ఆలస్యంగా జరిగే న్యాయం.. న్యాయమేనా?

by Ravi |   ( Updated:6 Sept 2024 1:15 AM  )
ఆలస్యంగా జరిగే న్యాయం.. న్యాయమేనా?
X

కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన హేయమైన ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటు వస్తోంది. పోస్టుమార్టం రిపోర్ట్ చూస్తుంటే హృదయం ద్రవించి పోయింది. సగటు మనిషిగా రక్తం మసులుతోంది. ఎందుకీ దారుణం? ఏదీ కారణం? సవతి తల్లి వేధింపులకు గురవుతున్న ఒక బాలిక గాథని సుమోటోగా తీసుకుని పరిష్కారం సూచించిన కోర్టు హత్యాచార ఘటనలను ఎందుకని సుమోటోగా తీసుకోదు? ఘోరం జరిగిపోయిందని ఆయేషా తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తీర్పురావటానికి నాలుగేళ్లు ఎందుకు పట్టాలి? ‘ఆలస్యంగా జరిగే న్యాయం న్యాయమే కాదు’ అన్నాడు అంబేద్కర్. కుటుంబ కలహాలను పరిష్కరించడానికి కుటుంబ న్యాయస్థానాలు ఉన్నప్పుడు, మహిళల పట్ల ఇన్ని మారణ హోమాలు, ఇన్ని దారుణాలు, ఇంత క్రూరంగా జరుగుతున్నప్పుడు వాటిని విచారించి సత్వరమే తీర్పునివ్వడానికి మహిళా న్యాయస్థానాలు ఎందుకు ఉండకూడదు?

శంషాబాద్‌లో దిశ ఘటన జరిగినప్పుడు ఒంటరి గా నిర్మానుష్య ప్రదేశాల్లో సంచరించడమే కారణమని చాలామంది అన్నారు సరే. మరీ ఈ ఆర్జీకర్ ఘటనలో వైద్యురాలు రోగులకు సేవ చేస్తూ ఆసుపత్రి విధుల్లోనే ఉంది కదా? మరి ఈమె ఎందుకు హత్యాచారానికి గురయింది? ఈ ఘటన నుంచి తేరుకోకముందే మహారాష్ట్రలో నర్సరీ పిల్లలపై అఘాయిత్యం జరిగింది. గత జనవరిలో కర్నూలులో ఒక 60 ఏళ్ల వ్యక్తి తొమ్మిదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్ప డ్డాడు. కొద్దిరోజుల క్రితం డెహ్రాడూన్‌లో ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు ఒక టీనేజీ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివాహాలై, పిల్లలకు తండ్రు లై, ప్రభుత్వ పరిధిలో పనిచేసే వీళ్లకు మహిళల పట్ల ఏ విధమైన బాధ్యతను కలిగి ఉండాలో తెలియదా? మరి ఎందుకని పాశవికంగా ప్రవర్తించారు?

చట్టం దృష్టిలో అందరూ సమానమేనా?

దిశ ఘటనలోని నిందితులను ఎన్‌కౌంటర్ చేసి కఠినంగా వ్యవహరించిన పోలీసులు.. అసిఫాబాద్‌ లో జరిగిన లక్ష్మీ విషయంలో ఎందుకని ఉదాసీనంగా వ్యవహరించారు? కారణం.. దిశ ఘటన నగరంలో జరగడం. అందుకే ఇది ఎక్కువ ప్రచారం అయ్యి ప్రజలు నిరసనలు, ర్యాలీలు పెద్ద మొత్తంలో చేయటంతో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేసింది. కాకపోతే విచారణ జరుగుతున్నప్పుడే నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఆసిఫాబాద్ ఘటనలో కూడా బాధితురాలు హత్యాచారం వల్ల కిరాతకంగా చంపబడింది. ఇది మారుమూల ప్రాంతంలో జరిగింది. దిశ ఘటనకు స్పందించిన విధంగా లక్ష్మీ విషయంలో ప్రభుత్వం ఎందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయలేదు? ప్రచార వ్యాప్తిని బట్టి, ప్రజల ఒత్తిడిని బట్టి తీసుకునే చర్య వల్ల జరిగే దాన్ని న్యాయం అంటారా? బాధితులకు న్యాయం చేయడానికి అది ప్రాతిపదిక అవుతుందా? చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్న నమ్మకం ఉంటోందా? ఇలా ఒక్కో వ్యక్తికి ఒక్కోలా స్పందిస్తుంటే చట్టం అంటే భయ భక్తులు ఏర్పడతాయా?

వీరికి సంస్కారం ఎవరు నేర్పాలి?

పాతికేళ్ల యువకులు నేరం చేస్తే తల్లిదండ్రుల పెంప కం కారణమని అనుకోవచ్చు. కానీ 30 దాటిన వారు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్లు, 60 సంవత్సరాలు నిండిన వాళ్లు ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతుంటే ఎవరి లోపం అనుకోవాలి? ఏది కారణమనుకోవాలి? మానసికంగా సొంత ఆలోచన కలిగి నిర్ణయాలు తీసుకోగలిగిన వీళ్లకు సమాజంలోని మంచి చెడులను గురించి ఏ తల్లి చెప్పాలి? ఏ తండ్రి నేర్పాలి? ఘటనా స్థలం ఇది అదని కాకుండా ఘోరాలు జరుగుతున్నాయి. ఇటువంటి నేరాలకు తల్లిదండ్రుల పెంపకం కూడా ఒక కారణం. ఎందుకంటే సమాజంలో జరిగే సంఘటనల పట్ల కుటుంబం స్పందించే తీరే పిల్లలమానసిక వైఖరిని ప్రభావితం చేస్తుంది. దానిని బట్టే సంస్కారం ఏర్పడుతుంది. అయితే ఎక్కువ మందిలో పెరుగుతున్న కొద్దీ ఆ భావాలు చుట్టూ ఉన్న సమాజం, సంఘటనల ప్రభావం వల్ల మారిపోతూ ఉంటాయి. ఏతల్లి కూడా బూతు మాటలు నేర్పదు. ఏ తండ్రి కూడా మద్యం అలవాటు చేయడు. ఇవి సమాజం నుంచి ఏర్పడ్డ అలవాట్లే. మరి సమాజంలో ఏది మంచో ఏది చెడో ఎవరు చెప్పాలి?

ఉపాధ్యాయుడు వేతన జీవిగా మిగిలిపోతే..

బాల్య దశలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల ప్రభావం కూడా ఉంటుంది పిల్లల మీద. తల్లిదండ్రులకు తెలియని, చెప్పలేని ఎన్నో విషయాలు ఉపాధ్యాయుడు బోధించగలడు. అందుకే ‘సమాజ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ అన్నారు కొఠారి. ఐతే ప్రస్తుతం టీచర్లు చదువు మాత్రమే నేర్పగలుగుతున్నారు. ఈ చదువు వల్ల కేవలం జ్ఞానం మాత్రమే వస్తుంది. సంస్కారం క్రమశిక్షణ వల్లనే వస్తుంది. తరగతి గదిలో ఉపాధ్యాయులు తమ వృత్తికి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు? కారణం క్రమ శిక్షణ తప్పాడని విద్యార్థిని మందలించినందుకు తల్లిదండ్రులే ఉపాధ్యాయునిపై గొడవకు దిగి నానా యాగి చేయడం. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఏ విద్యార్థికైనా గౌరవం ఉంటుందా? రోజూ బడికి రావాలి అన్నందుకు బిహార్‌లో ఓ విద్యార్థి టీచర్‌పైకి తుపాకీ గురి పెట్టాడు. ఇట్లాంటి భయానక పరిస్థితులలో ఉపాధ్యాయుడు వేతనజీవి మాత్రమే కాగలడు కానీ గురువు ఎలా అవ్వగలడు? బాల్య దశలో క్రమశిక్షణ ఉంటేనే అది మున్ముందు మంచి వైపు నడిపిస్తుంది. అలాంటి అవకాశం ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఉందా?

సత్వరం శిక్ష విధించగలిగితేనే..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా కొన్ని అకృత్యాలు జరిగాయి కదా వాటి మాటేమిటి? అందుకే హత్యాచారం శిక్షలు అట్లాగే కొనసాగుతూ ఉంటే ‘దెబ్బలకు దేవుడైనా భయపడతాడు’ అన్నట్లు తక్కువ కాలంలోనే నేరాలను అరికట్టవచ్చు. శిక్షలు లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఒక ఇంటి ముందు ‘కుక్క ఉన్నది జాగ్రత్త’ అని బోర్డు కనబడితే ఆ కుక్క చిన్నదో పెద్దదో తెలియకపోయినా గేటు తెరవక ముందే అప్రమత్తం అవుతాం. భయం వల్ల ఉండే ప్రతిస్పందన అది. అందుకే రాష్ట్రానికి ఒక మహిళా కోర్టు ఏర్పాటయి నిందితులకు సత్వరమే శిక్ష విధించగలిగినప్పుడే ప్రజల్లో చట్టం పట్ల నమ్మకం, గౌరవం, భయం పెరుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ ఘోరాలు చూడకుండా ఉండే అవకాశం ఉంటుంది.

- గణపతి చల్లూరి

99899 82588

Advertisement

Next Story

Most Viewed