- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ఓటమి భయంతో ఉన్నారా!?
రానున్నవి కులాల మధ్య కాదు.. పేదలు, పెత్తందార్ల మధ్య జరిగే ఎన్నికలంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్తపల్లవి అందుకున్నారు. వచ్చే ఎన్నికలు ఇంగ్లీషు-మాతృభాష మధ్య, కరువు-వరుణదేవుడి మధ్య జరిగే ఎన్నికలంటూ ఊదరగొడుతున్నారు. దుష్ట చతుష్టయంతో, చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో పోరాటం చేస్తున్నామని ఇటీవల అన్ని బహిరంగ సభల్లో ఒకే స్క్రిప్ట్ ను చదువుతున్నారు. నాకు సొంత మీడియా లేదు, సొంత ఛానళ్లు లేవని బీద పలుకులు పలుకుతున్నారు. కట్టుకథలకు, పెట్టుబడులకు పుట్టిన సాక్షి పత్రిక, ఛానళ్లు ఎవరివి ప్రతిరోజూ ప్రతిపక్షాలపై విషం కక్కుతున్న కూలి చానళ్లు, పత్రికలు చాలా మీ వెంట ఉన్నాయి. తటస్థుల ముసుగులో సోషల్ మీడియా వేదికగా ప్రజల మెదళ్లు కలుషితం చేస్తున్న మేధావి వర్గం మీ పక్షానే ఉంది. ప్రచార మాధ్యమాల్లో మీ ఆధిపత్యమే కొనసాగుతుందన్న విషయం నిజం కాదా భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇనుప సంకెళ్లు వేసి ఖాకీల క్రౌర్యం రాజ్యమేలుతోంది.
ఓటమి భయంతోనే ఆ వ్యాఖ్యలు..
విలువలు, విశ్వసనీయతకు తానే ప్రతిరూపంగా చాటుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. జగన్ విష కౌగిలిలో ప్రజాస్వామ్యం బందీ కావడంతో ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. నిజాలు మాట్లాడటం మర్చిపోయి అబద్దాలు, అసత్యాలు, అర్థసత్యాలు మాట్లాడుతూ ప్రజలను భ్రమింపజేస్తున్నారు. ఎక్కడ ప్రతిపక్షాలు ఏకమవుతాయో, తన అధికారం ఎక్కడ పోతుందనే భయం మొదలైంది. అందుకే 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అని సవాల్ చేస్తున్నారు. పైగా రాష్ట్రంలో పెత్తందారులకు ప్రతి రూపం అయిన జగన్ రెడ్డి పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించడం ఎబ్బెట్టుగా ఉంది. బూర్జువా భావజాల లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు వినడం విడ్డూరంగా ఉంది.
నిజమే.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పొరపాటు జరిగితే నష్టపోయేది ప్రజలేనని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాల సర్వనాశనం అయింది. ప్రజల సంపదను దోచి వ్యక్తిగత సంపదను పెంచుకున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే జగన్ రెడ్డి భస్మాసుర హస్తం ప్రజల నెత్తిపై పెడతారు. పాలనలోనూ, అభివృద్ధిలోనూ గత ప్రభుత్వాలతో పోటీపడి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్లు ఉండేది. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని సవాల్ విసిరితే బాగుంటుంది. పొత్తులు పెట్టుకోవడం అనేది ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారం. జగన్ రాష్ట్రంలో ఒంటరివాడయ్యారు. వైసీపీ పార్టీకి గాని, ప్రభుత్వానికి గానీ నైతిక మద్దతిచ్చే పార్టీ ఒక్కటి కూడా లేదు. విడివిడిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారంటే ఓటమి భయం పట్టుకున్నట్లుంది. మేం సింగిల్ గా వస్తాం.. మీరు గుంపులు గుంపులుగా రండి అని అనేక సందర్భాల్లో మంత్రులు, పార్టీ నాయకులు ప్రతిపక్షాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడెందుకు విడివిడిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు? మీ ఉన్మాద చర్యలే ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నాయి.
మీ హామీలు పూర్తయ్యాయా?
ముందుముందు చాలా కుట్రలు చూస్తారంటున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కుట్రలంటే కోడికత్తులు, గొడ్డలిపోట్లు, రక్తచరిత్రలు కాదు కదా! అరగంట ప్రయాణానికి లక్షలు ఖర్చుపెట్టి హెలికాఫ్టర్‌లో రావడం అవసరమా? దారిపొడవునా పరదాలు కట్టి, బారికేడ్లు పెట్టి, చెట్లు నరికి స్కూళ్లు, షాపులు మూసి ముఖ్యమంత్రి సభలు జరుపుతున్నారు. 98.5 శాతం హామీలు నెరవేర్చారన్నారు. పూర్తికాని 1.5 శాతం హామీలు ఏవో సెలవిస్తే బావుంటుంది. సీపీఎస్ రద్దు, ఏటా జాబ్ కేలండర్, అమరావతి, పోలవరం నిర్మాణం, దశలవారీ మద్య నిషేధం హామీలకు ఏం సమాధానం చెబుతారు? ఒకసారి శంకుస్థాపన చేసినవాటికి పదేపదే శంకుస్థాపన చేస్తూ, ఒకసారి ప్రారంభించిన వాటిని మళ్లీ ప్రారంభిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రజలను సాంఘికంగా, సామాజికంగా, ఆర్ధికంగా విభజించారు. అత్యంత జుగుప్సాకరమైన కుల వివక్షతను పెంచి పోషిస్తోంది మీరు కాదా? కరోనా లాంటి మహమ్మారికి మందు కనిపెట్టిన సంస్థను గౌరవించకపోగా, వారి ప్రతిభా నైపుణ్యాన్ని గుర్తించకపోగా కులముద్ర వేసిన మీ భావదారిద్య్రం, మీ కుసంస్కారం చరిత్రలో నిలిచిపోతుంది. దేశం మొత్తం కీర్తిస్తున్న వ్యక్తులను, సంస్థలను కుల పిశాచం బలిపీఠంపై ఉంచారు. సంపద సృష్టించడం చేతగాక సంపద సృష్టించే కంపెనీలు, సంస్థలకు సైతం కుల ముద్ర వేసి తరిమేసిన ఘన చరిత్ర మీది కాదా? రాష్ట్ర మంత్రివర్గంలో పెత్తందారి పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో ఏ ప్రభుత్వం ఈ విధమైన వికృత రూపాన్ని ప్రదర్శించడం లేదు.
పెత్తందారీ ప్రభుత్వ విధానం..
ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికం రాజ్యమేలుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారే ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల విధులు, బాధ్యతలను స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం లేకుండా వారిని బానిసలుగా, భజంత్రీలుగా మార్చారు. కేబినెట్‌తో సంబంధం లేకుండా తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, నడిపించడం పెత్తందారీ వ్యవస్థలో భాగం కాదా? అసలు మీకన్నా పెత్తందారులు ఎవరున్నారు? మీ పత్రిక ఆఫీసులో గుమాస్తాగా పని చేసిన సజ్జల సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పాలనకు సమాధి కట్టి సమస్త పాలనా యంత్రాంగాన్ని సలహాదారులు శాసిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన మంత్రులు పైన కూర్చొని ఉంటే.. బడుగు, బలహీన వర్గాల మంత్రులు చేతులు కట్టుకుని నిలబడి ఉండటం మీ పెత్తందారీ విధానానికి అద్దం పడుతోంది.
రాష్ట్రంలో పాలన చేతగాక, జనం దృష్టి మరల్చడానికి, విభజించి పాలించడానికి శ్రీకారం చుట్టారు. మొన్నటి వరకు మూడు రాజధానుల నాటకాన్ని నడిపి కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధికి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు పేదలు, పెత్తందార్లు, ఇంగ్లీషు, వరుణదేవుడు అంటూ కొత్త రాగం అందుకున్నారు. వెయ్యి మందికి పైగా మీ సొంత సామాజికవర్గం వారికి కీలకమైన పదవులు కట్టబెట్టారు. మీరు నామినేట్ చేసిన కీలకమైన పోస్టులలో బడుగు బలహీనవర్గాల వారు ఎంతమంది ఉన్నారు? దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు ఈ మూడున్నరేళ్లలో రెట్టింపైనట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. డ్రగ్స్, గంజాయి కేంద్రంగా మారి దేశంలో ముందు వరుసలో నిలిచింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్ర ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెట్టి, నిందితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
కొసమెరుపు
వైసీపీ సెగ అందరినీ తాకింది. ఏ ఒక్కరికీ పరిమితం కాలేదు. జగన్ జనంపై యుద్ధం చేస్తున్నారు. తన చేతికి మట్టి కాకుండా, పేరు బయటకు రాకుండా అన్ని వ్యవస్థల్లో బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పౌరహక్కులు, మానవహక్కులు కాలరాస్తున్నారు.. అసలు జీవించే హక్కునే హరించివేస్తున్నారు. దీనిని బట్టి జగన్ రెడ్డిని మించిన పెత్తందార్లు ప్రపంచంలో మరొకరు లేరని గుర్తించాలి. కులపునాదులపై మీరు నిర్మించిన పార్టీ, అహంకారపు కోటలు కూలిపోయే సమయం ఆసన్నమైంది. మీ సామాజికవర్గానికి ఆయాచితంగా పందేరం చేసి.. వేసిన పదవులను, అధికారాలను, మీ అక్రమ సంపాదనను బడుగు, బలహీనవర్గాలకు పంచిన తర్వాత క్యాస్ట్, క్లాసెస్ వార్, ధనిక, పేదల గురించి మాట్లాడితే బాగుంటుంది.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్
9949777727
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672