ఇదేనా మీ విజన్ బాబు ‘గారూ’ !

by Ravi |   ( Updated:2023-06-01 01:00:28.0  )
ఇదేనా మీ విజన్ బాబు ‘గారూ’ !
X

నందమూరి తారకరామారావు నుంచి 1995లో వక్రమార్గంలో, అప్రజాస్వామ్యంగా ముఖ్యమంత్రి పీఠంతో పాటూ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 సంవత్సరాలపాటు, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లు వెరసి 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఏకైక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఖ్యాతి గడించారు. తన పాలనా కాలంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిగా కాక కార్పొరేట్ కంపెనీకి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సి.ఈ.ఓ) పేరు గడించారు. అందుకు తగ్గట్టుగానే 1995లో మొదటి పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబునాయుడు అప్పటివరకూ రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చి మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు.

వికేంద్రీకరణకు ఆమడ దూరం

రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, భారీ భవంతుల నిర్మాణాలకు తన హయాంలో చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబుతో పాటూ బాబు అనుకూల మీడియా ఆ భారీ నిర్మాణాలనే అభివృద్ధి అని ప్రజలను భ్రమింప చేసేందుకు విశేషంగా కృషి చేశాయి. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీ పునర్నిర్మాణంకు చంద్రబాబు పెద్దపీట వేశారు. ఇటువంటి భారీ నిర్మాణాలు మొత్తం హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోనే చంద్రబాబు నాయుడు తన హయాంలో నిర్మించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో 60 శాతం పైగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వస్తూ ఉండేది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇది నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట శాపంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా, తీవ్రమైన లోటుబడ్జెట్‌తో, కట్టుబట్టలతో నడి రోడ్డుపై నిలబడడం దురదృష్టకరం.

సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటూ రాష్ట్రంలోని ఇతర వనరులను అభివృద్ధి పరచడంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారో అభివృద్ధి వికేంద్రీకరణ ఎందుకు చేయలేక పోయారో సమాధానం చెప్పవలసిన అవసరం చంద్రబాబుపైనే అధికంగా ఉంది. అదే సమయంలో ఉమ్మడి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలు ఇప్పటికీ అత్యంత వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి. ఉద్దానంలో కిడ్నీ సమస్యలు మొన్నటి వరకు అలాగే ఉండేవి. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి తనకు తాను గొప్ప విజన్ (ముందుచూపు) ఉన్న నాయకునిగా చెప్పుకునే నారా చంద్రబాబు ఈ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం శోచనీయం. ఈ పరిణామం చంద్రబాబు విజనరీకి తీవ్రమైన మచ్చగా భావింపవచ్చు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం అయిపోయాయి. ఆ సమయంలో విద్య, వైద్య రంగాలలో కార్పొరేట్ శక్తులు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించాయి. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్య నిర్వీర్యమయిపోవడంతో పేదలకు ఉన్నత విద్య అందని ద్రాక్ష పండుగా మారింది. పర్యవసానంగా చంద్రబాబు ప్రతి నిత్యం తాను అభివృద్ధి చేశానని చెప్పుకునే ఐ టి రంగంలో ఒక వర్గం ప్రజల పిల్లలే అంటే ఆర్థికంగా అప్పులు చేసి అయినా తమ పిల్లలను చదివించుకొనే స్థోమత ఉన్న వారి పిల్లలు మాత్రమే స్థిరపడినారనేది నిర్వివాదాంశం.

బాబు ఏటీఎం గా పోలవరం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ పాలిటి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర పునర్విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పొందుపరచి ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం స్వంత నిధులతో నిర్మించాలని స్పష్టంగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు 30 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అవగాహనా రాహిత్యంతోనూ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చాలనే దురుద్దేశ్యంతో పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు అవరోధంగా మారింది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము కేటాయించిన నిధులలో అవకతవకలు జరిగాయని కేంద్రం బలంగా నమ్మింది. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఏ.టి యం లా వాడుకుంటున్నారని స్వయానా దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు బహిరంగ సభల్లో చెప్పడమే దీనికి నిదర్శనంగా భావించవచ్చు. ఆ కారణంగానే ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వవలసిన నిధులతో పాటూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వవలసిన నిధులను ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది.

పోలవరం, హోదా... చారిత్రక తప్పిదాలు

ఈ విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ పాలిటి కల్పతరువుగా భావించడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కచ్చితంగా చారిత్రాత్మక తప్పిదాలుగా చెప్పవచ్చు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పొరుగునున్న తెలంగాణా రాష్ట్రం ఇటీవల సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాన్ని తలపించే విధంగా కేవలం 657 కోట్ల రూపాయలతో అతి తక్కువ కాలంలో సచివాలయం నిర్మాణం చేసింది. కానీ వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఏపీలో తాత్కాలిక సచివాలయం నిర్మించడం ఆశ్చర్యకరం. చంద్రబాబు తన సుదీర్ఘమైన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పేదరిక నిర్మూలనకు అమలు చేసిన ఒక్కటంటే ఒక్క పథకమూ లేదు. అలాగే పేదలను గూర్చి ఉచ్చరించిన దాఖలాలు కూడా లేవు అని కచ్చితంగా చెప్పవచ్చు.

ఇప్పుడు ఏపీ శ్రీలంక అయిపోదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కొరకు అమలు చేస్తున్న కార్యక్రమాలు పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడమే కాక వారి హృదయాలలో జగన్ మోహన్ రెడ్డికి శాశ్వత స్థానం ఏర్పరచాయి. దీనిని చూసి చంద్రబాబు తాజాగా తాను కూడా పేదరికం పారదోలతానని,పేదలను కోటీశ్వరులను చేస్తానని విశ్వసనీయత లేని మాటలు చెపుతున్నారు. 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకోసం ఏమీ చేయలేని చంద్రబాబు రాజకీయ చరమాంక దశలో పేదలను ఉద్దరిస్తారంటే ఎవరు నమ్ముతారు‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రం దివాలా తీసి మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు గగ్గోలు పెట్టారు. జగన్ పథకాల వలన ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలను చంద్రబాబు తూలనాడడం గమనార్హం. ఇప్పుడు ఏకంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మించి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని నారా చంద్రబాబు నాయుడు మొన్నటి మహానాడులో తన మినీ మేనిఫెస్టోలో తెలియచేయడం చర్చనీయాంశం. తాను ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉంది. పాలు ఇచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే ఎద్దును ఎవరైనా తెచ్చుకుంటారా ఈ పరిణామాలు పరిశీలిస్తే చంద్రబాబుని విజన్ (ముందు చూపు) ఉన్న నాయకునిగా పేర్కొనడం ఎంతవరకు సబబు అస్థిరమైన నిర్ణయాలతో అవకాశవాద రాజకీయం చేయడమే ముందుచూపు ఎలా అవుతుందో చంద్రబాబుకే తెలియాలి మరి.

కైలసాని శివప్రసాద్,

సీనియర్ జర్నలిస్ట్

94402 03999

Advertisement

Next Story

Most Viewed