అభివృద్ధికి నిర్వచనం ఇదేనా?

by Ravi |   ( Updated:2023-07-09 00:30:58.0  )
అభివృద్ధికి నిర్వచనం ఇదేనా?
X

భారతదేశం ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలోనే ముందు వరుసలో వుందని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమా? అంటే పచ్చి అబద్ధం అని భారత సామాజిక, సాంస్కృతిక ఆర్థిక పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశంలో ప్రధానంగా కులాన్ని నిర్మూలించకుండా అభివృద్ధి చెందదు. 140 కోట్ల జనాభాలో 10 కోట్ల మంది అభివృద్ధిని దేశాభివృద్దిగా ప్రొజెక్టు చేయడం ఆశ్చర్యకరమైన విషయం. నిజానికి దేశంలో సుమారు 40 కోట్ల మంది ఉపాధి లేకుండా వున్నారు.

స్వాతంత్రోద్యమ కాలంలో డా. బి.ఆర్.అంబేద్కర్, డా. రామ్ మనోహర్ లోహియా భారతదేశంలో రావాల్సిన నిజమైన సామాజిక, ఆర్థిక, జాతీయ, ప్రాపంచిక అసమానతల నిర్మూలన కోసం పోరాడారు. ముఖ్యంగా స్త్రీ పురుష సమానత్వం కొరకు పోరాడారు. రంగు కారణంగా వున్న అసమాన నిర్మూలన కోసం పోరాడారు. జన్మతః కులం ద్వారా ఏర్పడే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. సామ్రాజ్యవాదానికి, విదేశీ ఆక్రమణలకు వ్యతిరేకంగా, వసుదైక ప్రభుత్వ స్థాపన కోసం పోరాడారు. వ్యక్తిగత ఆస్తులు, యాజమాన్యాల వలన ఏర్పడిన ఆర్థిక అసమానతల నిర్మూలనకు ప్రణాళిక బద్ధమైన ఉత్పత్తులు పెంచడానికి పోరాడారు. వైయుక్తిక అధికారుల మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. దేశంలో అక్షరాస్యత బాగా పెరుగుతోంది కానీ విద్యావ్యవస్థ బాగా కుంటుపడింది. దళితవాడల్లోని బడుల్లో ఎక్కువ ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉంటున్నాయి. చాలా గిరిజన వాడల్లో పాఠశాలలు లేవు. దళితవాడల్లోని పాఠశాలలు నడవడం లేదు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని 15.5 లక్షలకు పైగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 24 కోట్ల 75 లక్షలు. పునాది స్థాయి నుంచి ఉన్నత మాధ్యమిక దశ దాకా 94 లక్షల మందికి పైగా టీచర్లు నియమితులయ్యారు.

గంపగుత్తగా పన్నుల దోపిడీ

ఇకపోతే రాష్ట్రాల హక్కులు కాలరాసి రాష్ట్రాలకు రావలసిన పన్నులు కూడా కేంద్రం గుత్త సొత్తుగా దోపిడీ చేస్తున్న క్రమంలో కేంద్రం ఆదాయాన్ని బలోపేతంగా చూపిస్తుంది. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను, శక్తిని దారాదత్తం చేసే విధానాలలో వలస కూలీల వ్యవస్థను పెంచి, ఒక చోట పని దొరకని అవ్యవస్థ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. నిజానికి సర్కారియా కమిషన్ సిఫార్సుల మేరకు ఇప్పటికి సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1990 మేలో ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ అంతర్ రాష్ట్ర మండలి. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా వుండే ‘వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) మండలి కన్నా, పన్నుల ఆదాయ సంఘం కన్నా ఇది భిన్నమైనది. భారత రాజ్యాంగంలోని 263వ అధికరణం ఈ మండలి ఏర్పాటుకు ప్రాతిపదిక. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వుంటారు. కొందరు కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులు. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీలోని వివాదాస్పద అంశాలను పరిశీలించి సలహా ఇవ్వడం కౌన్సిల్‌ పని. కేంద్ర, రాష్ట్రాలకు ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాలను లోతుగా చర్చించడం దాని విధి. వివాదాల పరిష్కారానికి, ప్రభుత్వ విధానాలు ఆచరణల మధ్య మెరుగైన సమన్వయానికి సిఫార్సులు చేసే బాధ్యత దానిదే.

భయభ్రాంత భారత్

కానీ నేడు రాష్ట్రాలపై విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. బీజేపేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సీబీఐ దాడులు జరిపించి భయభ్రాంతులను చేయడం ద్వారా అభివృద్ధి సాధించగలరా! మహారాష్ట్రలో ఏం జరిగింది? శివసేనను చీల్చి ఒక ముక్క వెనకకు బీజేపీ వచ్చింది. కర్నాటకలో సావర్కర్ వివాదం లేపి ముస్లిమ్‌లను భయభ్రాంతులను చేసింది. ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, మహిళలు మోదీ హయాంలో భయం భయంతో బతుకుతున్నారు. ప్రజల్లో భయభ్రాంతులు పెరిగాక ఉత్పత్తిలో భాగస్వాములు ఎలా కాగలుగుతారు? ప్రధానమైన తోలు ఎగుమతుల మీద, మాంసం ఎగుమతుల మీద దాడులు చేసి దళితులను, ముస్లింలను వేటాడుతున్నారు. అనేక ఆంక్షలు పెట్టి భయపెడుతున్నారు. శ్రమలో భాగస్వామ్యం లేని స్వాములకు, యోగులకు, బాబాలకు భూములు పంచిపెడుతున్నారు. అలా పంచిపెట్టడం వలన వాళ్ళలో అభివృద్ధి వస్తుందా? అభివృద్ధిలో ప్రధానమైన గిరిజనోత్పత్తులకు ఎగుమతి విధానం లేకుండా చేశారు.

మతం విష కోరలు చాస్తూవుంది. స్త్రీలను ఉత్పత్తి రంగం నుండి తరిమి వేస్తున్నారు. స్త్రీలకు బ్యాంకు లోన్లు ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలను చూపించి స్త్రీల అభివృద్ధి అని చెబుతున్నారు. దళిత స్త్రీలు పనికోసం రైలు ఎక్కితే కేసులు పెడుతున్నారు. గరిబోళ్ళకు రైళ్లు లేవు. గరిబోళ్ళకు బస్సులు లేవు. అంతా ఏసీల మయం. అవి టిక్కెట్టు రిజర్వ్ చేసుకునే పై తరగతులకే కానీ వలసకార్మికులకు ఎక్కడా బస్సులు లేవు. వలస కార్మికులు కాంట్రాక్టర్ల చేతుల్లో నలిగిపోతున్నారు. ఇక భారతదేశంలో ఆర్థికాభివృద్ధి జరగాలంటే దళితులకు భూమి పంపకం చేయాల్సివుంది. ప్రతి ఊరులోనూ కుటీర పరిశ్రమలు పెట్టి వస్తువులను ప్రపంచ మార్కెట్టులో అమ్మే విధానాన్ని రూపొందించాల్సి వుంది.

రేపిస్టులకు, హంతకులకు పూలదండలు

ఇకపోతే స్త్రీలపై అణచివేత ఘటనకు పరాకాష్ట బిల్కిస్ బానో అత్యాచార నేరస్తుల విడుదల. దేశం మొత్తం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేళ, దేశ ప్రధాని భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ దేశ మహిళల హక్కులు, గౌరవం, స్త్రీ శక్తి అంటూ మాట్లాడిన కొన్ని గంటల తర్వాత అంటే ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం బిల్కిస్ భానోతో పాటు దేశ ప్రజలందరూ నిర్ఘాంతపోయే దారుణ వార్త మీడియా ద్వారా బయటికొచ్చింది. 17 సంవత్సరాలుగా తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయం మీద న్యాయ పోరాటం చేస్తున్న బిల్కిస్ బానో ఈ దుర్వార్తను వినాల్సి వచ్చింది. పదిహేనేళ్ళ క్రితం తనమీద సామూహిక అత్యాచారం చేసి, తర్వాత తన కుటుంబ సభ్యుల మీద కూడా అత్యాచారం చేసి చంపేసిన హంతక, అత్యాచార నేరస్థులకు, ‘క్షమాభిక్ష’ పెట్టి గుట్టు చప్పుడు కాకుండా జైలు నుండి విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ దుర్మార్గమైన వార్త బిల్కిస్‌ని భయభ్రాంతురాలని చేసింది.

ఆమెతో పాటు మొత్తం గ్రామమంతా భయాందోళనతో వణికిపోయారు. అన్నింటినీ మించి కరకు పాషాణాల్లాంటి 11 మంది నేరస్తులకు స్వీట్లు తినిపించి, పూలదండలేసి బయట ప్రపంచంలోకి ఆహ్వానించిన తీరును టివీల్లో, సోషల్ మీడియాల్లో చూసిన బిల్కిస్ బానో మనసులో చెలరేగిన కల్లోలం, అవమానం, ఆందోళనను తూచడానికి నా దగ్గర ఏ కొలమానమూ లేదు. పదిహేడు సంవత్సరాలుగా ఆమె గుండెల్లో గూడు కట్టిన గాయాన్ని క్రూరంగా కెలికిన ఈ దేశ న్యాయ వ్యవస్థ వేసుకున్న మనువాద ముసుగు మెల్లగా జారిపోయిన దృశ్యాలుగా కనిపించాయి. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని మహిళా సంఘాలు గళం విప్పి మాట్లాడుతున్నాయి. ఇది భారతదేశంలో స్త్రీ అణచివేతకు నిలువెత్తు సాక్ష్యం.

అస్పృశ్యతే అభివృద్ధికి అడ్డుకట్ట

మరోప్రక్క కాంట్రాక్ట్ లేబర్ గానూ, గృహనిర్మాణం పనివాళ్ళుగాను, మున్సిపల్ వర్కర్స్‌గానూ, పనిచేస్తూ, పట్టణాల్లో, మురికివాడల్లో దళితులు జీవిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గడ్, జార్ఖాండ్, రాష్ట్రాల్లోని దళితులు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున కూలీలుగా వలస వెళ్తున్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన ప్రభుత్వరంగ సంస్థలను విస్తృతం చేయాలని చెప్పాడు. సరిగ్గా ఇప్పుడు అవే తాకట్టులోకి వెళ్తున్నాయి. అంబేద్కర్ భూమిని, పరిశ్రమలను జాతీయం చేయాలని చెప్పాడు. అవన్నీ ప్రస్తుతం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పాడు. ముఖ్యంగా అంబేద్కర్ అస్పృశ్య భారతాన్ని విముక్తి చేసి స్పృశ్య భారతంగా చేయాలన్నాడు. కానీ ఇప్పటికీ దేశంలోని 40% గ్రామాల్లో అస్పృశ్యత తీవ్రంగా వుంది. వారిని ఉత్పత్తి రంగంలోకి రానివ్వడం లేదు. నిజానికి ఉత్పత్తి వారి బానిసత్వాన్ని నిర్మూలిస్తుంది. ఉత్పత్తి లేని భారతం దారిద్య్రపు ఊబిలో కూరుకుపోయింది. శ్రమ, మానవవనరులు, మానవ విలువలు సమన్వయంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి భారతం ఏర్పడుతుంది. అప్పుడే ఆర్థిక పరిపుష్టి గలిగిన భారతదేశం ఏర్పడుతుంది. అంబేద్కర్ మార్గమే భారతదేశ ఆర్థికాభివృద్ధికి మూలం. అంతిమ విజయం శ్రామికులదే.

డా. కత్తి పద్మారావు,

సామాజిక దళిత ఉద్యమ నాయకులు

98497 41695

Advertisement

Next Story