బీజేపీ రాష్ట్రాల్లోనూ ఇంతే కదా..!?

by Ravi |
బీజేపీ రాష్ట్రాల్లోనూ ఇంతే కదా..!?
X

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో అరెస్టయిన సివిక్ పోలీస్ వాలంటీర్ రాయ్ నిన్న మేజిస్ట్రేట్ ఎదుట మాట మార్చి నేను అమాయకుడినని తనకు ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని చెప్పాడు. మరి ఈ ఘాతుకం ఎవరు చేశారు? లక్షలాదిమంది రోగులకు సేవ చేయవలసిన ఈ యువ డాక్టర్ అన్యాయంగా విగతజీవిగా మారితే ఆ పాపంలో ఎవరి వాటా ఎంత?

పేద కుటుంబం నుంచి వచ్చి రెండోసారి ప్రయత్నంలో పీజీలో సీటు సాధించిన బాధితురాలు హాస్పిటల్‌లో చేరింది మొదలు హత్యాచారానికి గురయ్యే వరకు ఒక్కరితో కూడా వాదన పెట్టుకున్న దృశ్యాన్ని చూడలేదని ఆమెతో పనిచేసిన జూనియర్ గుర్తుచేసుకొని బాధపడ్డారు. అలాంటి అమ్మాయిని ఎవరు అంత దారుణం గా హత్యాచారం చేశారు..? ఈ ఘటనలో ఆర్‌జి కార్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ నిర్లక్ష్యం ఈ కేసులో అడుగడుగునా కనిపిస్తుంది. ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా స్థానిక అధికార పార్టీ ఎమ్యె ల్యే అండదండలతో అదే హాస్పిటల్‌లో రెండుసార్లు ట్రాన్స్ఫర్ అయినా అక్కడే కొనసాగుతున్నాడంటే తన పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. ఈ మొత్తం ఘటనపై మమత ప్రభుత్వం వ్యహరించిన తీరు దారుణం అనే చెప్పాలి. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన హత్యాచారం కేసుల్లో ఆ రాష్ట్ర పాలిట ప్రభుత్వాలు స్పందించిన తీరు దీనికి భిన్నంగా ఉందా?

రాజకీయ జోక్యం

ఒకప్పుడు మమత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన సువెందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఆమె ప్రభు త్వంపై ముప్పేట దాడి ప్రారంభించింది. హత్యాచారం తీవ్రత దృష్ట్యా ఇప్పుడు కేసు సుప్రీంకోర్ట్ పర్యవేక్షణలో ఉంది. ఇప్పటికే హైకోర్టు ఉతర్వులతో కేసు సీబీఐ పరిధిలోకి పోయింది. ఈ దారుణ సంఘటనకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ సంబంధమున్నట్టుగా బీజేపీ ప్రచారం ప్రారంభించింది. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన హత్యాచారం కేసుల్లో ఆ రాష్ట్ర పాలిట ప్రభుత్వాలు స్పందించిన తీరుపై పరిశీలిద్దాం.

కథువా అత్యాచారం, హత్య

యోగి ముఖ్యమంత్రిగా వున్నా బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో 8 ఏళ్ల ముస్లిం అమ్మాయిని ఒక హిందూ గుడిలో మత్తు మందిచ్చి, తిండి పెట్టకుండా రోజుల తరబడి మాడ్చి అత్యాచారం చేసి అవసరం తీరాక బండతో తలను ఛిద్రం చేసి, హత్య చేసిన రేపిస్టులకు హిందుత్వ సంఘాలు వత్తాసు పలికాయి.

హత్రాస్ అత్యాచారం,హత్య

అగ్ర వర్ణాలకు చెందిన ఇద్దరు యువకులు యూపీలోని హత్రాస్‌లో దళిత కులానికి చెందిన యువతిని చెరకు తోటలో లైంగికదాడి చేసి ఆమె నడుములు విరగ్గొట్టడం జరిగింది. సంఘటన జరిగిన తర్వాత కూడా రెం డువారాలు బతికింది. చనిపోతూ యువతి నిందితుల పేర్లు చెప్పింది. ఆమెకు ఇప్పటివరకు న్యాయం జరుగలేదు. జరుగుతుందనే ఆశ కూడా లేదు. ఎందుకంటే శవాన్ని తల్లిదండ్రుల అభీష్టానికి విరుద్దంగా పోలీసులు అర్ధరాత్రి హడావుడిగా యువతికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించకుండానే దహనం చేశారు. ఇక్కడ కూడా హిం దుత్వ సంఘాలు నిందితులకు వత్తాసు పలికాయి. పరాకాష్ట ఏమంటే సంఘటనను కవర్ చేయటానికి వెళుతున్న ఢిల్లీ నుండి వెళుతున్న జర్నలిస్టును ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి ఏళ్ల తరబడి జైల్లో ఉంచిన ఘటనను మనం ఇంకా మర్చిపోలేదు.

బిల్కిస్ బానో కేసులోనూ..

మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పాలించిన తొలిరోజుల్లో గోద్రా ఘటనతో చెలరేగిన మతకలహాల్లో బిల్కిస్ బానో అత్యాచారం చేసి ఆమె మూడేళ్ల కూతురు హత్యకు కారకులైన హంతకులకు కోర్టు జీవిత శిక్ష విధించగా గుజరాత్ బీజేపీ సర్కార్ శిక్ష కాలం పూర్తి కాకుండానే విడుదల చేసింది. ఈసందర్భంలో దోషులకు హిందుత్వ సంఘాలు శాలువాలు, మిఠాయిలతో సన్మానం చేసి ఫోటోలకు ఫోజులిచ్చి పత్రికలకు విడుదల చేసిన సంఘటనను దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇవన్నీ పక్కకుపెట్టి బీజేపీ పార్టీ ఈ మొత్తం ఘటనపై మమత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శిస్తున్నారు కానీ మరి మీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన హత్యాచారం కేసుల్లోనూ ఇంతే స్పందించి ఉంటే బాగుండేది. ఏది ఏమయినా కనీసం ఈ కేసులోనైనా నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారించి నిర్భయ చట్టంలో పేర్కొన్నట్లు శిక్షించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగ కుండా సత్వర న్యాయం అందిస్తారని ఆశిద్దాం.

- డా. కే సుధాకర్ రెడ్డి,

89850 37713

Advertisement

Next Story

Most Viewed