రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఉందా..!?

by Ravi |   ( Updated:2023-03-29 00:31:04.0  )
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఉందా..!?
X

త దశాబ్ద కాలంగా రాష్ట్రంలో పరిస్థితిని గమనిస్తే, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా దహనం అవుతుందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో పత్రికా రంగం ప్రజల పక్షాన నిలిచింది. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పత్రికా రంగం మొత్తం తన ముఖకవళికల్ని మార్చుకునే ప్రయత్నాలు చేపట్టినట్టు అనిపిస్తోంది. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలోని దాదాపు అన్ని పత్రికలు, ఛానళ్లు అధికారపార్టీకి పూర్తిగా దాసోహం అయ్యాయని చెప్పొచ్చు. ఈనాడు వంటి అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక సైతం అధికార పార్టీకి 'నమస్తే' లు పెడుతున్నాయనడానికి ఎన్నో 'సాక్ష్యా'లు ఉన్నాయి. ఒకప్పుడు అధికార పార్టీని విమర్శించే ప్రధాన పత్రికలు ఇప్పుడు అదే పార్టీని ఆకాశానికి ఎత్తడం ఆరంభించి అధికార పార్టీ అవినీతి, కుంభకోణాలు కనుమరుగు చేయడం ఆందోళన కలిగించే అంశం. కేవలం ప్రభుత్వ ప్రకటనల కోసం, పెయిడ్ న్యూస్ కోసం పత్రికల యజమానులు సైతం ప్రతికూల వార్తల్ని పక్కన పెట్టడంతో పత్రికా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్టు అనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకటో, రెండో పత్రికలు మాత్రమే ధైర్యంగా ప్రజల పక్షాన, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే భరించలేని కేసీఆర్ ఆ పత్రికలకి ప్రభుత్వ ప్రకటనలు ఆపడం, సిబ్బందికి అక్రిడేషన్ కార్డులు జారీ చేయకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు కలిగించారు. తాజాగా వెలుగు దిన పత్రికపై కేటీఆర్ బహిరంగంగా బ్యాన్ ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇక కేసీఆర్ ఎంతోమంది విలేఖరులను బహిరంగంగా దూషించారు. క్యూ న్యూస్ ఆఫీసుపై గత నాలుగేళ్లుగా ఎన్నో భౌతిక దాడులు జరిగాయి. ప్రభుత్వ నియంతృత్వ వార్తా ప్రసారాలు చేసిన కారణంగా తీన్మార్ మల్లన్న, తొలివెలుగు రఘు, జర్నలిస్ట్ విఠల్‌ని జైల్లో పెట్టారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినవారిపై, ప్రతిపక్ష పార్టీ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మీడియాపై అక్కసు వెలగక్కకుండా వాస్తవాలను గ్రహించి ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది. నేటి మీడియా యజమానులు సైతం ఏ ఒక్క రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా, ప్రజల పక్షాన పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.

పసునూరి శ్రీనివాస్

8801800222

Advertisement

Next Story

Most Viewed