- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
26 ఏళ్లుగా పెన్షన్ రూ.350 యేనా?
సరిపడా గాలి, వెలుతురు లేకున్నా, విషవాయువులు వెలువడుతున్నా తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాభివృద్ధి, ప్రపంచానికి వెలుగునిస్తున్న బొగ్గు గని కార్మికులు త్యాగధనులు. 30 లేదా 40 సంవత్సరాలు తమ రక్తాన్ని చెమటగా మార్చిన బొగ్గు విశ్రాంత ఉద్యోగుల జీవితాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వయస్సు మీద పడిన తరువాత వచ్చే జబ్బులకు చికిత్స కోసం బొగ్గు యాజమాన్యాలు ఇచ్చిన కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడికేర్ స్కీం కార్డ్ నేటి వైద్య ఖర్చులతో సరి తూగటం లేదు.
26 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోల్ మైన్స్ పెన్షన్ -1998 మాత్రమే రిటైర్డ్ కార్మికులకు జీవనాధారం. ప్రతి ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత పెన్షన్ పొందాలంటే ప్రతి నెల తమ వేతనాల నుంచి నాలుగు శాతం, అంతే మొత్తంలో బొగ్గు యాజమాన్యాలు పెన్షన్ ఫండ్‌కు జమ చేసేవారు. 2017 ఆగస్టు నుంచి ఉద్యోగుల మూల వేతనాలలో ఏడు శాతం, అదే స్థాయిలో యాజమాన్యాలు పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తున్నాయి. అయితే, 1998లో కోల్ మైన్స్ కనీస పెన్షన్ నెలసరి 350 రూపాయలుగా నిర్ణయించారు. 26 సంవత్సరాలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం అమానుషం. ప్రతి మూడేళ్లకు ఒకసారి పెన్షన్ ఫండ్‌పై సమీక్ష జరపక పోవడం ఆందోళనకరమైన విషయం. ప్రతి సంవత్సరం పెన్షన్ ఫండ్‌కు సుమారు 4,150 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. కానీ పెన్షన్ దారులకు ప్రతి సంవత్సరం సుమారు 4,450 కోట్లు చెల్లిస్తున్నారు. అంటే జమ చేస్తున్న సొమ్ము కంటే ప్రతి సంవత్సరం 300 కోట్లు అదనంగా విత్ డ్రా అవుతున్నాయి.
దీక్షలు చేపట్టినా ఫలితం శూన్యం
పెన్షన్ దారుల సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరుకోగా పెన్షన్ చందాదారుల సంఖ్య మూడున్నర లక్షలకు తగ్గింది. పెన్షన్ ఫండ్ బలోపేతం కొరకు బొగ్గు సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే టన్ను బొగ్గుకు 10 రూపాయలు వసూలు చేసినప్పటికీ పెన్షన్ ఫండ్ పెరగడం లేదు. గతంలో కోల్ మైన్స్ పెన్షన్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశంలో ప్రతి టన్ను బొగ్గుపై 20 రూపాయలు పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తే ఫండ్‌పై 1200 కోట్ల రూపాయల అదనపు భారం తగ్గుతుందని నిర్ణయం జరిగింది. ఇది అమలు కావడం లేదు. పెన్షన్ పెంచాలని 2019 డిసెంబర్ 9న న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒకసారి, 2022 జూలై 25 నుంచి 28 వరకు మూడు రోజులు, 2022 డిసెంబర్ 6న అదే ఢిల్లీలో ఒకరోజు, 2023 మార్చి 27న ప్రధాన మంత్రి పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో ధర్నా, నిరాహార దీక్షలు చేపట్టినా ఫలితం శూన్యం. బొగ్గు విశ్రాంత ఉద్యోగులందరు కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడికేర్ స్కీం సభ్యులుగా చేరిన తరువాత భార్యాభర్తలకు ఎనిమిది లక్షల రూపాయల విలువగల కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్య సౌకర్యం లభిస్తుంది. నేటి వైద్య ఖర్చులకు ఈ సొమ్ము సరిపోవడం లేదు. కానీ విశ్రాంత అధికారులకు 25 లక్షల రూపాయల వైద్య సౌకర్యం ఉంది.
22న దేశవ్యాప్తంగా ఆందోళన
ప్రస్తుత పెన్షన్ ఫండ్‌ను బలోపేతం చేసి కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలనీ, విశ్రాంత అధికారులకు, ఉద్యోగులకు ఎటువంటి వివక్ష లేకుండా కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీంలో ఒకే విధానం కొనసాగాలనీ, అత్యవసర చికిత్స పొందేందుకు భారతదేశంలోని అన్ని ముఖ్య నగరాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్‌కు మెడికల్ కార్డ్ అనుసంధానం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని జనవరి 22న కోల్‌కత్తాలోని కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం, సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయాల ముందు భారీ ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపి మరోసారి ఆందోళన బాట చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కావున ప్రభుత్వాలు, బొగ్గు సంస్థ యాజమాన్యాలు విశ్రాంత ఉద్యోగుల పట్ల కనికరించి వారి సమస్యలను పరిశీలించి మరింత ఆలస్యం కాకుండా పరిష్కరించి గౌరవప్రదమైన జీవితం ప్రసాదించాలి.
ఆళవందార్ వేణు మాధవ్
86860 51752