రాహుల్ ఆ హామీలు ఇస్తారా?

by Ravi |   ( Updated:2022-09-03 16:52:46.0  )
రాహుల్ ఆ హామీలు ఇస్తారా?
X

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఓయూ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని టీపీసీసీ చీఫ్ ఇతర కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. రాహుల్ ఓయూ పర్యటన మీద కాంగ్రెస్- టీఆర్ఎస్ విద్యార్థి సంఘాల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓయూ కు రాహుల్ రావాలని కాంగ్రెస్ విద్యార్థి నేతలు అంటుంటే, వస్తే అడ్డుకుంటామని టీఆర్ఎస్ విద్యార్థి నేతలు చెబుతున్నారు. యూనివర్సిటీ కేంద్రాలు విభిన్న రాజకీయ సంఘర్షణ సమాహార మాత్రమే కాదు, ప్రజాస్వామిక స్వరాలు కూడాను.

ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ నాయకుడైన ఏ యూనివర్సిటీకైన వెళ్లి తన రాజకీయ అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించిపోవచ్చు. భిన్న విమర్శలను స్వీకరించవచ్చు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు విద్యార్థుల పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. తెలంగాణ పోరాటంలో అగ్ర భాగాన నిలబడ్డ ప్రజానీకంలో దళిత సామాజికవర్గం అశేష త్యాగాలు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితులు కావాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, దళిత ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళిత సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుంది.

వారి ఆకాంక్ష నెరవేరలేదు

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రిగా ఉంటాడన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. నిజానికి దళిత సమాజం కూడా ఇదే ఆశించింది. తీరా రాష్ట్ర ఏర్పాటు తర్వాత దళితుల ఆకాంక్ష ఆకాంక్షగానే మిగిలిపోయాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న లక్షలాది కార్యకర్తలలో అత్యధికులు దళితులనే సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. మిగతా కులాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పునాది దళితుల ఓట్లే. కాంగ్రెస్ పార్టీ బలం దళితులు, తెలంగాణ ఉద్యమంలో అశేష త్యాగాలు చేసిన దళిత సమాజం తన వర్గం నుంచి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుంది, దళిత సమాజానికి న్యాయం చేకూరుతుంది.

ఓయూకి రాహుల్ రాక సందర్భంగా దళిత ముఖ్యమంత్రి అనే ఎజెండాను చర్చ లో పెడితే దళిత సమాజానికి న్యాయం జరుగుతుంది. అలాకాకుండా, అడ్డుకుంటాం అనడం అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చెరగని ముద్ర నాటి వందేమాతరం ఉద్యమం మొదలుకొని నిన్నటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దాకా ఓయూ విద్యార్థులు అశేష త్యాగాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ,ఎమ్మెల్యేలుగా ఓయూ విద్యార్థులకు అవకాశం కల్పించి, ప్రజాప్రతినిధులుగా వారిని గెలిపించింది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం అనేక నామినేటెడ్ పోస్టులలో ఓయూ విద్యార్థుల కు ప్రాధాన్యత కల్పించింది. మరి కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో విద్యార్థులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించండంపై పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వారిని గెలిపించే ప్రయత్నం పార్టీ నాయకత్వం చేస్తుందా? ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే ఓయూ విద్యార్థులకు ప్రభుత్వ శాఖలలో వివిధ విభాగాల్లో నామినేటెడ్ పదవులు అవకాశం కల్పిస్తుందా?

అదే నిర్లక్ష్యం

సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఉస్మానియా యూనివర్సిటీలో స్వరాష్ట్ర సాధన అనంతరం అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉస్మానియా వర్సిటీ సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని రాహుల్ హామీ ఇస్తే ఉపయోగకరము. రెండవ తరం కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి నేటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు గా ఉన్న అనేక మందికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యాబుద్దులు నేర్పింది. యూనివర్సిటీ కేంద్రంగానే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుగా ఎదిగారు. అనేకమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకనాటి ఓయూ విద్యార్థులెేనన్న సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించి, ఖాళీగానున్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆర్‌ఎన్ శంకర్

ఓయూ,

AISF స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ

9963169415

Advertisement

Next Story