- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికలంటే వ్యాపారమా!
ఐదేండ్లకోసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు టంచనుగా వస్తూనే ఉన్నాయి. కానీ రాను రాను అసెంబ్లీ పార్లమెంటు సభ్యులంతా ధనికుల కుటీరాలుగా మారిపోయి ప్రజాశ్రేయస్సుకై ఉపయోగించాల్సిన ధనమంతా ఎన్నికల్లో గెలవడానికి కోట్ల కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేసే అత్యంత నీచ, దుష్ట సంస్కృతి పాతుకుపోవడంతో ప్రపంచ దేశాలలో భారతదేశ ఎన్నికల విధానం ప్రజాస్వామ్యం పేరిట ధనస్వామ్యంగా మారి అభాసుపాలు అవుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజా సమస్యలను నయా పైస మందం కూడా పట్టించుకోక పోగా ప్రజావ్యతిరేక విధానాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మరింత దిగజార్చే విధానాలు అవలంభిస్తూ వస్తున్నారు. తత్ఫలితంగా అన్నదాతల విద్యార్థుల ఆత్మహత్యలు బలవన్మరణాలు, సంసారాలను వెళ్ళదీయలేని పరిస్థితుల్లో అనేక ఆత్మహత్యలు నిత్యకృత్యమైపోయాయి. ఏ ఒక్క పార్టీ నాయకుడూ వీటిని తీర్చడానికి ప్రయత్నించకపోగా, రకరకాల ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా సగటు మనుషులను పట్టిపీడించడమే నిత్యకృత్యమైపోతుంది. ప్రజా చైతన్యం కోసం కృషి చేసే సామాజిక వేత్తలపై, మేధావులపై, కవులపై, రచయితలపై, లాయర్లపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకి పంపుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫాసిస్ట్ పాలనకు దారి వేస్తున్నారు.
ఏదీ అసలు అభివృద్ధి?
ఎన్నికల్లో దుబారాగా ఖర్చు పెట్టిన ధనానికి పదింతలు, వందింతలు వెయ్యింతలు దండుకోడానికి చేయకూడని అవినీతి పనులెన్నో చేస్తూ సహజ వనరులన్నీ కార్పొరేట్ల వశం జేస్తూ మానవ సమాజానికి చేయగూడని కీడెంతో చేస్తున్నారు. అభివృద్ధి అనే పదాన్ని మాత్రం నిరంతరం మూడు దశాబ్దాలుగా ఊదర కొడుతూనే ఉన్నారు. వీళ్ళ దృష్టిలో బహుళజాతి కంపెనీల వ్యాపార విస్తరణనే, కార్పొరేట్ల అభివృద్ధే, పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధి. దేశమంటే సాధారణ ప్రజలు కాదు, దేశమంటే కార్పొరేట్లు. వాళ్ల కంపెనీలు. వాళ్ల నిరర్థక వస్తుసామాగ్రి అమ్మకాలు. దేశంలో నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. వ్యవసాయంకు తగిన ప్రోత్సాహం లేక కునారిల్ల్లి పోతుంది. ప్రభుత్వరంగ పరిశ్రమలను మూసివేసినారు. ప్రకృతి గుండెలో విష రసాయనాలను నింపే ఫార్మా కంపెనీలు మాత్రం విపరీతంగా ప్రభుత్వ రాయితీలతో పురుడు పోసుకుంటున్నాయి. ఇదే అభివృద్ధికి సూచికనా? ఇంత స్థాయిలో ఫార్మా కంపెనీల పెరుగుదల అవసరమా? పచ్చటి వైవిధ్యభరితమైన పంటచేలను అధిక దిగుబడుల పేరుతో, హరిత విప్లవం పేరుతో వరి, పత్తి పంటలకే పరిమితం చేస్తూ పంటల్లో మోనోకల్చర్‌ను వృద్ధి చేయడమే రోగకారక రసాయన పూరిత పంటల వ్యవసాయమే అభివృద్ధికి సూచననా, ఏదీ అసలైన అభివృద్ధి ఓటర్లను ప్రజా సంక్షేమ పథకాల పేరున రకరకాల పింఛన్లు, వగైరా పథకాలతో మభ్య పెట్టి బిక్షగాళ్లుగా చేస్తూ అడుక్కు తినే వ్యవహారాన్ని పెంపొందించడం న్యాయమేనా? విద్యా వైద్య వ్యాపారం, మంచినీళ్ళ వ్యాపారం, రవాణా వ్యాపారం అన్నీ కార్పొరేట్ల అజమాయిషీలతో పేద మధ్య తరగతి ప్రజల రక్త మాంసాలను పీక్కతినడాన్ని పెంపొందించడమే అభివృద్ధా.. ఏది అసలు అభివృద్ధి?
ఇదెక్కడి అభివృద్ధి
స్వయం సమృద్ధి వైపుగా ఏ ఒక్క ప్రణాళికా చేయకపోవడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని డొల్లతనాన్ని సూచిస్తుంది. ప్రజాస్వామ్యం పేరున పోలీస్ వ్యవస్థను తమ చేతుల్లో వుంచుకుని ప్రజలను మేధావులను ప్రశ్నించే వాళ్లను అణచివేయడమే అభివృద్ధా? దేశ యువత అంతా ఉపాధి పేరున విదేశాలకు తరలి వెళ్ళడమే అభివృద్ధా? ఇదెక్కడి అభివృద్ధి ఇంకెంత కాలమీ కుహనా అభివృద్ధి అసలైన అభివృద్ధికి పునాదులు వేసి ప్రజల గుండెల్లో చిరకాలం నిలవాల్సిన నాయకులంతా ప్రజలచే ఛీ...తూ ... అనిపించుకోకుండా, వుమ్మివేసినా పట్టింపులేనితనపు దిగజారుడు, నీచ, నికృష్ట రాజకీయాలకు స్వస్తి పలకలేరా? కార్పొరేట్ కబంధ హస్తాల నుండి బయటపడి ప్రజాపక్ష రాజకీయాలు చేయలేరా? స్వాతంత్ర్య సమర యోధుల జన్మదినాలు, వర్థంతులు టంచనుగా జరుపుకుంటూ రావడమేనా ప్రజాస్వామ్యం? వాళ్ల స్ఫూర్తిని ఒక్కశాతమైనా జీర్ణించుకోలేక పోవడంతోపాటు ప్రజలను విడదీసి ఐక్యత లేకుండా చేసే మీ రాజకీయ పన్నాగాలింకెన్ని రోజులు? మసిబూసి మారేడు గాయలు జేయడమే ఎన్నికల విధానమా? ఎందుకీ ఎన్నికల దుబారా ఖర్చులు, ఎందుకీ ఆడంబరాలు? మద్యం మనీ మనీ పంపకాల దుష్టాచార రాజకీయాలకు స్వస్తి చెప్పలేరా? ఎన్నికల్లో చేసే దుబారా ఖర్చుని పౌరుల స్వయం సమృద్ధి కొరకు ఖర్చు చేయలేరా? విద్యా వైద్య వ్యవస్థలను పూర్తి స్థాయిలో పబ్లిక్ సెక్టార్‌లోకి తేకపోవడానికి కారణం ఏంటి? ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఇంకెంత కాలం అపహాస్యం చేస్తారు? అన్ని రంగాల్లో దేశాన్ని ప్రపంచ స్థాయిలో హీన దీన స్థితికి దిగజార్చే రాజకీయాలు ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారు? ఇది న్యాయమేనా.. ఇకనైనా మారరా?
నిరాడంబర జీవితాలు గడపలేరా?
సర్వ స్వతంత్ర ఆలోచనలతో గ్రామ పట్టణ నగర స్థాయిలో అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి ఆలోచనలే తట్టడం లేదా ఎంతసేపూ ఎన్నికలలో ఓటర్లను వివిధ ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడం, వక్ర మార్గాల్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అడ్డతోవలో ఎన్నికల్లో ఖర్చు చేసిన దానికి పదింతలు, వందింతలూ వీలైతే వేయింతలు సంపాదించుకోవడానికి అర్రులు చాచడమంటే ఎన్నికలు ఫక్తు వ్యాపారమా? విదేశీ పాలన కంటే, స్వదేశీ పాలన కొంచమైనా మెరుగు అని చెప్పడానికి ఇసుమంతైనా కృషి జరుగుతోందా? అన్నీ ప్రైవేట్ రంగానికే అప్పగిస్తే ఎన్నికల వ్యాపారంలో ఏదో ఒక రోజు రాజకీయ రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడి శక్తులకు గుండుగుత్తగా ధారాదత్తం చేయవలసిన దారుణ పరిస్థితి దాపురించకపోదని గుర్తెరగాలి! ఎన్నికల వ్యాపార రాజకీయులారా. ప్రజాపక్ష నేతల్లారా! ప్రజలవలన ప్రజల చేత ప్రజల కొరకు పాలనను అపహాస్యం చేసే ధోరణిని వదలి స్వచ్చ హృదయంతో స్వచ్ఛమైన పాలన ద్వారా నీతి నిజాయితీకి పెద్దపీట వేస్తూ ప్రైవేట్ రంగ గుప్పిట్లోని వ్యవస్థల నన్నిటిని మళ్లీ పబ్లిక్ రంగంలోనికి తేస్తెనే అసలైన ప్రజాస్వామ్య ప్రతిష్టను నిలిపినట్లవుతుంది. ప్రజలను స్వేచ్ఛగా బతకనిస్తేనే ప్రజాస్వామ్యం.
మేధావుల అభిప్రాయాలను గౌరవించని ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదని గుర్తెరగాలి. ఇకనైనా ప్రజాపక్ష పాలనకు దారితీయండి. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అత్యంత మానవీయ దేశంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేయండి. అప్పుడే దేశంలో సుఖ శాంతులు వర్థిల్లుతాయి. ఇతర దేశాలు మన దేశానికి ఉపాధి కొరకు వచ్చే ప్రణాళికలు చేయండి. కావాల్సింది స్వార్థ రహిత పాలన. అధిక ఆస్తులను జాతికంకితం చేసి మహాత్మా గాంధీ లాగా ఇతర స్వాతంత్ర్య సమర యోధులలాగా నిరాడంబర జీవితాలకు భారతదేశ పార్లమెంట్ సభ్యులు, వివిధ అసెంబ్లీల్లోని శాసన సభ్యులు అలవాటు పడితే ప్రపంచంలోనే అగ్రగామిగా దేశాభివృద్ధిని నిలుపొచ్చు. అదే స్వాతంత్ర్య సమరయోధులకు అసలైన నివాళి అని గుర్తించాలి. జయంతులు వర్ధంతులు యాంత్రికంగా జరుపుతూ స్ఫూర్తిని మరిస్తే లాభమేంటి? స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి ప్రధానంగా పాలన జరగాలి. ఎన్నికలు వ్యాపారం కాకూడదు.
-గడీల సుధాకర్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి,REBS
99489 36488