- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పారిశ్రామిక తెలంగాణ - 2050
ప్రపంచ దేశాలన్నీ నేడు చైనా పారిశ్రామిక విధానం వైపు చూస్తున్నాయి. మరికొన్ని దేశాలు.. పారిశ్రామిక విధానాన్నే కాకుండా చైనా ఆర్థిక నమూనానే అవలంభిస్తున్నాయి. చైనాలో పల్లె నుంచి పట్టణం వరకు ఎక్కడ చూసినా ఏదో ఒక పరిశ్రమ కనిపిస్తుంది. చిన్నచిన్న దేశాలు కూడా పారిశ్రామిక విధానాలను ఒక విజన్‌గా పెట్టుకొని గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనూ పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ పాలసీ-2050ని రూపకల్పన చేయనున్నట్టుగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం హర్షనీయం.
భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే ఒకటి బయట నుంచి పెట్టుబడులు రావాలి.. మరోవైపు స్థానికంగా యువత పారిశ్రామిక రంగం వైపు మొగ్గు చూపాలి. ఈ రెండింటినీ ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తన మాటల ద్వారా స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
పాలసీలో సమూల మార్పులు
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన నమ్మకాన్ని కలిగిస్తోంది. అలాగే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం కొత్త పారిశ్రామిక పాలసీతో పారిశ్రామిక రంగానికే నూతనోత్తెజం తెస్తామంటూ ప్రకటించారు. ఇవే కాకుండా సీఎం మరొక అడుగు ముందుకు వేసి పారిశ్రామికవేత్తలు పెట్టే పెట్టుబడికి రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ప్రపంచ దేశాల నుంచి భారీ పెట్టుబడులే లక్ష్యంగా స్విజర్లాండ్ లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కలిసి వెళ్లారు. అక్కడనే కాక, లండన్‌లోనూ పెట్టుబడుల కోసం బడా పారిశ్రామికవేత్తలు, పలు దిగ్గజ కంపెనీల సీఈఓలతో సీఎం సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఒకవైపు పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తూనే మరోవైపు నూతన పారిశ్రామిక పాలసీలోనూ సమూలమైన మార్పులకు అడుగులు వేస్తోంది. నూతన పాలసీలో భాగంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనుంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ క్లస్టర్‌గా, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో ఉన్న ప్రాంతం సెమీ అర్బన్ క్లస్టర్‌గా, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాన్ని అందించనుంది. అంటే గ్రామీణ స్థాయికి పారిశ్రామిక రంగాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన పాలసీని రూపొందిస్తోంది. ఈ మూడు రకాల క్లస్టర్ల విభజనతో హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతమై ఉన్న పారిశ్రామిక అభివృద్ధి వికేంద్రీకరణ జరుగనుంది. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించింది.
పారిశ్రామిక కారిడార్లతో అద్భుతం
రాష్ట్ర నలుమూలలా పారిశ్రామికాభివృద్ధిని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సరికొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తోంది. విదేశీ పెట్టుబడులను, సంస్థలను ఆహ్వానించడం, ఆకర్షింప చేస్తూనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలను అధికారికంగా కోరుతోంది. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ ఇటీవలెే సీఎం, ఉప ముఖ్యమంత్రి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఉన్న వనరులు, అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం కల్పించాల్సిన అనుమతులను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ -విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-వరంగల్ నూతన పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు. వీటిలో హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం నుంచి తుది అనుమతులు వస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదల కానున్నాయి. వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను బ్రౌన్ ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్ హోదాకు మారిస్తే అదనంగా గ్రాంట్ల రూపంలో మరో రూ.300 కోట్లు రానున్నాయి. రాష్ట్రంలో 7 చేనేత క్లస్టర్లు ఉన్నందున రాష్ట్రంలో జాతీయ చేనేత సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఆదాయం పెంచుకొనే అవకాశాలు లభించనున్నాయి.
నిరుద్యోగుల్లో ఆశలు
విదేశాల నుంచి సంస్థలను, పెట్టుబడులను రాబడుతూనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను కూడా పారిశ్రామిక రంగంలో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులను పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. యువతీ యువకులకు నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీలను సైతం నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుతో యువతకు నైపుణ్యంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ పాలసీ-2050ని సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. నూతన పారిశ్రామిక పాలసీలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం కంటే రెట్టింపుగా స్థానిక యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది. మరీ ముఖ్యంగా ఎలాంటి పూచీకత్తు లేని బ్యాంకు రుణాలను ఇప్పించడం, ఏర్పాటు చేసే పరిశ్రమలకు కావాల్సిన భూములతో పాటు సబ్సిడీలను సైతం ప్రభుత్వమే బాధ్యతగా భావించి ఇప్పిస్తే రాష్ట్రంలో భావిభారత పారిశ్రామికవేత్తలు తయారు కానున్నారు.
- డా.ఎన్.యాదగిరిరావు,
అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ