కేసులేమో వందల్లో.. శిక్షలేమో రెండు శాతం..!

by Ravi |
కేసులేమో వందల్లో.. శిక్షలేమో రెండు శాతం..!
X

కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం పట్ల కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ‘ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవడం లేదని, దేశంలో చాలామందికి కోర్టు కేజ్రీవాల్‌కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు నమ్ముతున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కార నేరం కిందకి రాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు మేధావులు. అసలు ఆయన ఉద్దేశ్యం ఏమిటి? బీజేపీ ప్రభుత్వం ప్రాథమిక ఆధారాలు ఉన్నా, లేకున్నా.. విపక్ష నేతలపై ఎలాంటి కేసులైనా పెడతాం. బెయిల్ రాకుండా ఎలాంటి సెక్షన్లనైనా ఇరికిస్తాం.. కానీ, కోర్టులు నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని ఆయన ఉద్ధేశ్యమా?

దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఎవరికి బెయిల్ ఇవ్వాలో.. ఎందుకివ్వాలో కూడా దేశ హోంమంత్రే నిర్ణయిస్తారా? న్యాయమూర్తులకు బెయిల్ ఎందుకివ్వాలో కూడా తెలియదా? ఇది బాహాటంగా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడం కాదా? రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న హోంమంత్రికి ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలు చేయడం తగునా? సామాన్య ప్రజలకు కోర్టుల తీర్పుపై అనుమానాలను రేకెత్తించడం సమంజసమా? చట్టరీత్యా నేరం కాదా? విజ్ఞులు ఆలోచించాలి. అమిత్ షా వ్యాఖ్యలు పరోక్షంగా అత్యున్నత న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావటమే అవుతుంది.

మొన్న ఎలక్టోరల్ బాండ్ల కోసులోనూ సుప్రీంకోర్టు తీర్పుపై దాదాపు ఇలాంటి వ్యాఖ్యానాలే వినిపించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ ఎవరు కొన్నారో, ఎవరు వాటిని క్యాష్ చేసుకున్నారో, ఎంత మొత్తంలో ఏ పార్టీకి లబ్ధి చేకూరిందో మెదలైన స్పష్టమైన సంపూర్ణ సమాచారం కోర్టుకు, ఎన్నికల సంఘానికి ఇవ్వకుండా పరోక్షంగా ఎవరు అడ్డుకున్నారో ప్రజలు గ్రహించారు. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆజ్ఞలు జారీ చేయటంతో కొన్ని నిజాలైనా వెలుగు చూశాయి.

ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో..

ప్రొఫెసర్ సాయిబాబా పై కేంద్ర ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టింది. తల్లి అవసాన దశలో ఉంటే కూడా కోర్టులో బెయిల్ రాకుండా అడ్డుకుంది. కనీసం కన్న తల్లి మరణిస్తే అంతిమ సంస్కారాలు జరపకుండా, కడసారి చూపులు దక్కకుండా ఆయనకు బెయిల్ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. సుమారు 90 శాతం వికలాంగునికి సరైన వైద్య సహాయం కూడా అందించకుండా జైల్‌లో నిర్భంధించింది. పది సంవత్సరాల తరువాత, అనేక శారీరక, మానసిక వేదనలు అనుభవించిన తరువాత, కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. ఆయన తల్లి, భార్య ఆర్థికంగా, మానసికంగా ఎంతో క్షోభను అనుభవించారు. అక్రమ అరెస్ట్ వల్ల ఆయన ఉద్యోగం పోయింది. కుటుంబం ఆయన జీతంపైనే ఆధారపడి ఉండటంతో.. వేరే ఆదాయం లేకపోవటంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆరోగ్యం బాగా క్షీణించింది. చివరకు నిర్దోషిగా విడుదలైనా ఆయన పోగొట్టుకున్న స్వేచ్ఛాయుత జీవితానికి లెక్క కట్టేదెవరు? నేరస్తుడిగా సమాజంలో ముద్రపడితే ఆయన, ఆయన కుటుంబం ఎదుర్కొన్న పరువు నష్టానికి బాధ్యులు ఎవరు? ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు కేసులను పెట్టి 10 సంవత్సరాలు వేధించటం, తర్వాత మాకు ఏ సంబంధం లేదన్నట్లు చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఇలాంటి తప్పుడు కేసులలో ఇరికించిన ప్రభుత్వానికి కోర్టులు ఏ శిక్షలు విధించవా? ఇది బాధితుడికి న్యాయం చేయడమే అవుతుందా?

న్యూస్‌క్లిక్ ఎడిటర్‌పై సైతం..

మొన్న ప్రబీర్ పుర్కాయస్థని సైతం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పైగా ఆయనను కేంద్ర ప్రభుత్వం ‘ఉపా’ కేసులో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయన ఈ కేసులో ఆరు నెలలకు పైగా జైలులో ఉన్నారు. అయితే, ప్రబీర్‌ని ఇలా అక్రమంగా నిర్బంధించడం ఇదే మొదటిసారి కాదు. 48 ఏళ్ల క్రితం ఇదే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆయనకు పాతికేళ్లు. అప్పుడు కూడా ఆయన ఎలాంటి నేరం చేయలేదు. పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలూ లేకుండానే తప్పుడు కేసులు పెట్టారు. అప్పుడు దేశంలో ఎమర్జెన్సీ ఉంది కనుక విచారణ కూడా లేకుండానే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు కూడా ప్రాథమిక ఆధారాలు లేకుండానే 74 ఏళ్ల వయసులో గత అక్టోబర్‌లో ప్రబీర్‌ను మళ్లీ పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు దేశంలో ఎలాంటి ప్రకటిత ఎమర్జెన్సీ లేదు. ప్రబీర్‌ అప్పుడు విద్యార్థి, ఇప్పుడు ఆయన జర్నలిస్ట్‌. దేశంలో అవినీతిపరుల గుట్టును రట్టు చేసే వామపక్ష మేధావి. 'న్యూస్ క్లిక్' సంపాదకుడు. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వానికి తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రజాస్వామిక వాది. అప్పటి ప్రకటిత ఎమర్జెన్సీకీ ఇప్పటి అప్రకటిత ఎమర్జెన్సీకి ఏమీ తేడా లేదు. విధానాలలో ఎలాంటి మార్పు రాలేదు.

చట్ట విరుద్ధమైన కేసులెన్నో..!

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామిక వాదులను, పౌరహక్కుల నేతలను ప్రజల కష్టాలను ఎలుగెత్తి చాటినందుకు.. ప్రభుత్వ లోపాలను ఒక జర్నలిస్టుగా, బాధ్యత గల పౌరుడిగా పత్రికలలో ప్రశ్నిస్తూ సంపాదక వ్యాసాలు ప్రచురిస్తే అర్బన్ నక్సలైట్, దోశ ద్రోహిగా, రాజ ద్రోహిగా ముద్ర వేసి కవులను, కళాకారులను, జర్నలిస్టులను, సంపాదకులను, ప్రొఫెసర్లను, చైతన్యం గల పౌరులను అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది.

రాజకీయ నాయకుల మెప్పుకోసం, ప్రమోషన్ల కోసం చట్ట విరుద్ధమైనప్పటికీ చట్ట వ్యతిరేక ఆదేశాలను పాటిస్తూ కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసులు, దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. విపక్ష నేతలపై అక్రమంగా ఈడీ, సీబీఐ, ఇన్‌కం టాక్స్ సంస్థలు గత పదేళ్ళలో.. అవినీతి కేసులు కొన్ని వందలు పెట్టాయి. వాటిల్లో కేవలం 2.5 శాతమే శిక్షలు పడ్డాయి. కొందరు విపక్ష రాజకీయ నేతలు కేసుల నుండి తప్పించుకోవటానికి బీజేపీలో చేరారు. దాంతో కొందరిపై కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వారు వాషింగ్ మిషన్‌లో కడగబడి పునీతులు అయ్యారు. మరికొందరిపై జరుగుతున్న విచారణ వేధింపులు లేకుండా మధ్యలో ఆగిపోయాయి. లొంగని వారిని అక్రమ కేసులతో జైళ్ళలో నిర్బంధించారు. వారిలో ఎవరినైనా నిర్దోషులుగా కోర్టు ప్రకటించి విడుదల చేసినా, బెయిల్ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం సహించ లేకుండా ఉంది. అందుకు కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ ఇచ్చినందుకు హోంమంత్రి అమిత్ షా ‘కోర్టు ఇచ్చిన అసాధారణ బెయిల్’ గా బాధతో వ్యాఖ్యానించారు.

డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్

9849328496



Next Story