ఇదీ సంగతి:పౌరులు మేలుకుంటారా?

by Ravi |   ( Updated:2022-09-03 14:44:43.0  )
ఇదీ సంగతి:పౌరులు మేలుకుంటారా?
X

అసమానతలు, ఆకలి, పేదరికం విజృంభిస్తున్నాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పొలిటికల్ పార్టీల వద్ద దేశాన్ని గాడిలో పెట్టే విజన్ లేదు. అధికారంలో ఉన్నవారు అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. ప్రజాప్రతినిధులు 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే' యావలో పడిపోయారు. జనం ఎటైనా పోనీ 'ఎలక్షన్-కలెక్షన్-పవర్' ఉంటే చాలు అనే పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన విభాగం, మంత్రి పదవి కూడా నేరపూరిత నేతల దగ్గరే ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది? సిన్సియర్ పోలీసులు, ఇతర అధికారులు అలాంటి మంత్రుల అండర్‌లో ఎలా పని చేస్తారు? నేరమే అధికారంగా మారితే ఎలా? వీరా మన ప్రజా ప్రతినిధులు? ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని వారు, తమ ప్రయోజనాల కోసం సామాన్యులను, అధికారులను బెదిరించేవారు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులా ? బుద్ధిజీవులారా మేల్కొనండి.

రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మన నేతలలో చాలా మంది మర్డర్, రేప్, డెకాయిటీ, రాబరీ, కిడ్నాప్, మహిళల మీద జులుం, అత్యాచారాలు, భూ కబ్జాలు, మనీ లాండరింగ్, కరెప్షన్ ఇలా ఏదో ఒక నేరంలో భాగంగా ఉంటున్నారు. కేంద్రంలోని 39 మంది మంత్రుల వివిధ కేసులు ఉన్నాయి. దేశం మొత్తంలో 363 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 67 మంది ఎంపీలు ఉన్నారు. మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. బీజేపీ ఖాతాలో 83 మంది, కాంగ్రెస్ ఖాతాలో 47 మంది నేరాలతో సంబంధం ఉన్న ప్రజా ప్రతినిధులు ఉన్నారు. బీఎస్‌పీ, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన, ఎన్‌సీపీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్‌జేడీ, ఆప్, వైసీపా, టీఆర్‌ఎస్ తదితర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కూడా కొందరు క్రిమినల్ కేసులలో ఉన్నారు.

యూపీ, బిహార్, బెంగాల్, మహారాష్ట్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మీదా కేసులు ఉన్నాయి. కొందరు జైళ్లలో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసులు, దాడులు, విపక్ష నేతల మీద బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత పెరిగాయి. బీజేపీలో చేరితే 'బారా ఖూన్ మాఫ్' అనే పరిస్థితిని బెంగాల్, బిహార్, యూపీ, ఎంపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చూసాం. ఇప్పుడు ఎన్నికలు జరుగనున్న గుజరాత్, కర్ణాటకలలో చూస్తున్నాం. కేంద్ర మంత్రులు సంజీవ్‌కుమార్ బలియాన్, సత్యపాల్‌సింగ్ బెహల్, కైలాష్ చౌదరి, అశ్వినీ‌కుమార్‌పైన చాలా సీరియస్ కేసులు ఉన్నాయి. కేంద్ర హోమ్ సహాయ మంత్రి అజయ్ కుమార్ తేని తనయుడు ఆశిష్ మీద నలుగురు రైతులను తండ్రి పేరిట రిజిస్టర్ అయి ఉన్న జీబుతో ఢీకొట్టి చంపిన ఆరోపణల కేసు ఉంది. ఆశిష్ జైలులో ఉన్నాడు. మంత్రి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇలా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, లోకల్ ప్రజాప్రతినిధులు 718 మంది మీద కేసులు ఉన్నాయి.

అన్నీ వారిచ్చిన వివరాలే

ఎన్నికల సందర్భాలలో దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగానే ఈ వివరాలు వెలుగుచూశాయి. ప్రెజెంట్‌గా ఉన్న 296 మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. బిహార్‌లో 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పరిశీలిస్తే 54 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చూస్తే 67 మంది ఎంపీల మీద కేసులు ఉన్నాయి. ఇలా పరిశీలించుకుంటూ పోతే కేసులు, ఆరోపణలు లేని, అసలు మరకలు అంటని ప్రజాప్రతినిధులు దేశంలో 15 నుంచి 20 శాతం మందికి మించి కనిపించరు. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న ప్రభుత్వ మార్పిడి ప్రజాప్రతినిధుల జంప్ జిలానీ వ్యవహారం, దేశంలోని అస్తవ్యస్త దివాలాకోరు విధానం, నేతల నిజమైన రంగును, క్యారెక్టర్‌ను బట్టబయలు చేస్తున్నది.

ప్రజలతో సంబంధం లేకుండా, వారి మనోభావాలకు గౌరవం ఇవ్వకుండా మ్యూజికల్ చైర్ ఆడుతున్న నేతల పతనం జరగక తప్పదు. శివసేనకు మద్దతు ఇస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్‌సీ‌పీ, కాంగ్రెస్ క్రైసెస్‌లో కూడా సీఎం ఉద్దవ్‌ఠాక్రేకు మద్దతు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తెర వెనుక నుంచి నడిపించిన బీజేపీ షిండేకు బయటి నుంచే మద్దతు పలుకుతామని చిలుక పలుకులు పలుకుతోంది. రాజకీయాలు పదవీ వ్యామోహాలతో ఎంతగా గబ్బు పట్టిపోయాయో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది.

వారికి ఇది గుణపాఠం అవుతుందా?

'అవుట్ డోర్ తక్కువ-ఇండోర్ ఎక్కువ'గా గడిపే ఉద్దవ్‌ఠాక్రే లాంటి సీఎంలు తేరుకోవడానికి, గుణపాఠం నేర్చుకోడానికి మహారాష్ట్ర ఉదంతం ఒక ఉదాహరణ లాంటిది. దేశంలో కేంద్రం తెచ్చిన అవుట్ సోర్సింగ్ లాంటి అగ్ని‌పథ్ పథకానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు రోడ్ల మీదికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య 18 కోట్లకు చేరింది. పీఎం ప్రకటించిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇంకా మొదలు కాలేదు. మూత పడ్డ పరిశ్రమలు తెరుచుకోలేదు. పీఎస్‌యూల అమ్మకాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. కోటి మంది ఉద్యోగాలు పోయాయి. కేంద్రం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వేగం పుంజుకుంది. అసమానతలు, ఆకలి, పేదరికం విజృంభిస్తున్నాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పొలిటికల్ పార్టీల వద్ద దేశాన్ని గాడిలో పెట్టే విజన్ లేదు. అధికారంలో ఉన్నవారు అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు.

ప్రజాప్రతినిధులు 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే' యావలో పడిపోయారు. జనం ఎటైనా పోనీ 'ఎలక్షన్-కలెక్షన్-పవర్' ఉంటే చాలు అనే పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన విభాగం, మంత్రి పదవి కూడా నేరపూరిత నేతల దగ్గరే ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది? సిన్సియర్ పోలీసులు, ఇతర అధికారులు అలాంటి మంత్రుల అండర్‌లో ఎలా పని చేస్తారు? నేరమే అధికారంగా మారితే ఎలా? వీరా మన ప్రజా ప్రతినిధులు? ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని వారు, తమ ప్రయోజనాల కోసం సామాన్యులను, అధికారులను బెదిరించేవారు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులా ? బుద్ధిజీవులు, పౌర సమాజం మేలుకోవాలి. లేకపోతే మరింత ముప్పు తప్పదు.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Advertisement

Next Story