- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోమియోపతి... ప్రత్యామ్నాయ వైద్య విధానం అవుతుందా?
ఒక చిన్న యురేనియం ముక్కలో నాగసాకీ, హిరోషిమాని కూల్చే శక్తి ఉంది అంటే ఇవాళ నమ్మడం పెద్ద విశేషమేమీ కాదు. ఒక గుండుసూది మొన అంత స్థలంలో వాషింగ్టన్ గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలన్నీ మెమరీలో దాచేయవచ్చంటే నిజమే కదా. ప్రకృతిలో సహజంగా లభించే అనేక పదార్థాలు ఉదాహరణకు ఉప్పు, పాదరసం, తేనె, దోస, గులాబీ, సింకొనా చెట్టు బెరడు, ఇంకా కొన్ని విషాలలోని మూల కణాలను అత్యంత సూక్ష్మ మోతాదుల్లో చిన్న పంచదార గుళికల మీద వేసి ఇచ్చే హోమియో వైద్య విధానం అత్యంత చర్చనీయాంశం అయింది. నిజానికి అలోపతీ, ఆయుర్వేదం కూడా ప్రకృతిలో లభించే పదార్థాలనే మందుగా వాడటం అనేది ఉన్నదే! ఒక ఇంజక్షన్ రక్తంలో వెంటనే కలిసినట్లు, నాలుక మీద సూక్ష్మ మోతాదులో ఇచ్చిన మందు శరీర జీవకణాల్లోకి ప్రవేశించటం అసంబద్ధమేమీ కాదు.
ప్రఖ్యాత జర్మన్ అల్లోపతీ ప్రాక్టీషనర్ కొన్నేళ్ల పాటూ అల్లోపతీ వైద్యం చేస్తూ కొన్ని జబ్బుల్ని తగ్గించడం ద్వారా మరికొన్ని జబ్బులు తలెత్తుతూ రావడం గమనించాడు. ఉదాహరణకు అస్మా తగ్గగానే కీళ్ళ నొప్పులు, రుమాటయిడ్ ఆర్థరైటిస్ తగ్గించగానే తీవ్రమైన చర్మ సంబంధ వ్యాధులు రావడం గమనించాడు. ఒక వైద్యుడిగా, పూర్తి స్వస్థత ఇవ్వలేని అటువంటి వైద్యం ప్రామాణికంగా లేదని అనుకున్నాడు. ఏదైనా ఎక్కువ డోసేజ్ మందు శరీరంలోకి పంపకుండా తక్కువ పరిమితమైన మందును పంపి వ్యాధుల్ని కట్టడి చేయలేమా అని మధన పడ్డాడు. ఆయన ఉద్దేశం ఒక్కటే డోసేజ్ తగ్గించి ఇవ్వడం, కాలేయం, కిడ్నీ, గుండె, మెదడు వంటి విలువైన శరీరావయవాలమీద ఎక్కువ వత్తిడి పడకుండా, వాటిని ఎక్కువ డోసేజ్ ఫలితంగా శరీరంలో చేరే టాక్సిన్లు దెబ్బతీయకుండా తక్కువ మందుతో, అసలు మందు ఉందా లేదా అన్నట్టు, మింగడానికి తేలిగ్గా వుండేలా సుమారు వంద రకాల ప్రకృతిలో దొరికే పదార్థాలను ఎంపిక చేసుకొని తన పరిశోధన మొదలు పెట్టాడు.
శరీరంపైనే ప్రయోగంతో ఆవిష్కరణలు
ఆయన తీసుకున్న శాంపిళ్ళు కూడా అల్లోపతీలో వాడే విధమైనవే, ప్రకృతిలో లభించేవే! సింకొనా బెరడు నుంచే మలేరియా మందు తయారు చేస్తారు. ఆయన దీన్ని పొటెంటైజేషన్ ప్రక్రియ ద్వారా బాగా తక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు మలేరియా జ్వర లక్షణాలు తగ్గినట్టు గమనించాడు. ఆయన వద్ద ఎలుకలు గానీ గినియా పిగ్స్ గానీ ఉండేవి కావు. ఆయన శిష్యులు వందమంది హానిమాన్ ఇచ్చిన మందుని వేసుకొని తమలో జరిగిన మార్పుల్ని రికార్డు చేసేవారు. దాంతో ఒక పదార్ధం మానవ శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఆ మందు గుణ గుణాల్ని రికార్డ్ చేసేవారు. ఇది చాలా శాస్త్రీయంగా మరే విధానంలో జరగనట్టు మనుష్యుల కోసం మనిషి మీదనే జరిగిన ఒక ప్రయత్నం. ఒక విషం మందుగా ఉపయోగ పడుతుందా లేదా అని పరిశీలించి చూడటానికి స్వయంగా హెర్రింగ్ అనే శిష్యుడు ఒక భయంకర పాము విషాన్ని తన మీద ఎక్కించుకుని చూసినప్పుడు అది ఆయన్ని చావు అంచు వరకూ తీసుకుని వెళ్ళింది. అదే ఆయన లేకసిస్ అనే మందుగా వాడేవారు. మానవజాతి ప్రాణాలు నిలపడం కోసం తన ప్రాణాలను లెక్క చేయని శాస్త్ర వేత్తలు కోకొల్లలు...
హోమియోపై భారీ దుష్ప్రచారం
ఆయన శిష్యుల్లో అనేకమంది గొప్ప గొప్ప వైద్యులు ఉండేవారు, అప్పటికి ఉన్న ఫిజియాలజీ, అనాటమీ, ఫార్మకాలజీలో నిష్ణాతులైన అనేక మంది ఎండీలు ఆయన వెంట ఉండి స్వయంగా ఆ మందు ప్రభావాల్ని అక్షరం పొల్లుపోకుండా రికార్డ్ చేశారు. కానీ ఆయన మందులు అశాస్త్రీయమైనవని చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. పొటెంటైజేషన్ ప్రక్రియ అబద్ధం అన్నారు. మోలిక్యులర్ బయాలజీ ప్రకారం మోలిక్యులర్ మెమరీ ఉంటుందనీ, అది సూక్ష్మ మోతాదులో సైతం పనిచేస్తుందనీ శాస్త్రం నిరూపించింది.
తక్కువ నష్టం, ఎక్కువ ఉపశమనం
మానవ శరీరం బిలియన్ల జీవకణాల సమాహారం. నిజానికి ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే తప్ప ఈ శరీరం సక్రమంగా పనిచేయదు. వెసులుబాటు రీత్యా శరీరాన్ని స్పెషలైజేషన్ పేరుతో తప్పనిసరి అగత్యంగా ఆధునిక వైద్యం వేరువేరు శరీర వ్యవస్థలకు సింప్టమెటాలజీ ఆధారంగా వైద్యం చేస్తూ వస్తోంది. శరీరాన్ని ఒకే ఒక వ్యవస్థగా అర్థం చేసుకొని హోమియో విధానంలో యావత్తు శరీరంలో రుగ్మతల మొత్తాన్ని (మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్ సింప్టంమ్స్) పరిగణనలోకి తీసుకోవడం నిజానికి ఒక గొప్ప శాస్త్రీయ అంశం. ప్రతి వ్యాధినీ ఎదుర్కొనే సామర్ధ్యాన్ని ఈ శరీరం తనకు తానుగా సమకూర్చుకుంటూ రావాల్సిందే. వైద్యం పేరుతో మనిషి చేసేది ఉపశమనం మాత్రమే అన్నది గమనార్హం. అందుకే వైద్యం అనేది తక్కువ నష్టంతో ఎక్కువ ఉపశమనాన్ని కలిగించేదిగా ఉండాలి. ఆ రకంగా ఆలోచిస్తూ వచ్చిందే హోమియో వైద్యశాస్త్రం. అత్యంత సూక్ష్మ మోతాదులు కూడా శరీర జీవకణంలోకి ప్రవేశించి ప్రభావితం చేస్తాయన్న మౌలిక సూత్రం శాస్త్రీయమే.
అలోపతి గొప్ప వైద్యమే కానీ...
ఒక్క తలనొప్పికి వెయ్యి కారణాలు ఉన్నట్లు, బాహ్యంగా కనపడే శరీరంలోని చాలా రుగ్మతల్లో మూల కారణాలు వేరే అయి ఉండవచ్చన్న ఆలోచనతో హోమియో వైద్యం ముడిపడి ఉంది. అనేక చర్మవ్యాధులు శరీర అంతర్భాగాలలోని రుగ్మతల క్షాళనగా తలపోసింది. ఏది ఏమైనప్పటికీ, వ్యాక్సినేషన్, యాంటీబయాటిక్స్, పెయిన్ రిలీవింగ్ మెడిసిన్స్, సర్జరీ, యాంప్యుటేషన్, అనేక గుండె సంబంధిత స్టెంట్స్ లాంటి పరికరాలు లేకుండా మానవజాతి మనుగడను వూహించలేం. ఇవేవీ హోమియో వైద్య విధానంలో కనీసం ఊహకు కూడా లేవన్న విషయం స్పష్టం. హోమియోపతీ గానీ ఆయుర్వేదం గానీ ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయ వైద్య విధాన స్థాయిని అందుకోవడం ఇంచుమించు అసాధ్యమే!. కానీ “నిరపాయకరం’’ అని చెప్పి విడుదలయ్యే ఫార్మా కంపెనీల మందులు అనేక సందర్భాల్లో అనేక రోగాలకు కారణం కావడం, వేల మందులు బదులుగా లక్షల మందులతో మార్కెట్ నిండిపోవడం గమనిస్తూనే ఉన్నాం. గొప్ప వైద్యులు సైతం కార్పొరేట్ కనుసన్నల్లో, రోబో ల్లాగా వైద్యం చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. అందుకే ఆధునిక వైద్యానికి కచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ, లాభాపేక్ష లేని వైద్య విధానాల అవసరం ఎంతైనా ఉంది. హోమియో గురించిన తాత్వికతను చెప్పే ప్రయత్నమే తప్ప దాన్ని సమర్ధించబూనడమో, లేదంటే అదొక పూర్తిస్థాయి ప్రత్యామ్నాయమని చెప్పటమో నా ఉద్దేశం కాదు.
వి.విజయకుమార్
85558 02596
- Tags
- Homeopathy