- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జారుడు మెట్ల మీద ఉన్నత విద్య
ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదించుకోవాలంటే అత్యున్నత ప్రతిభ గల అధ్యాపకులను నియమించుకోవాలి. మన విశ్వవిద్యాలయాలలో ఉప కులపతుల, అధ్యాపకుల నియామకాల తీరులో అలసత్వం చోటు చేసుకుంటున్నది. ఏ విద్యావ్యవస్థలో అయినా బోధకులే కీలకం. వారి పాత్రే విద్యా ప్రమాణాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బోధకులు-విద్యార్థుల మధ్య నిష్పత్తి అధికంగా ఉంటే విద్యార్థుల మీద అధ్యాపకుడు ఏకాగ్రత చూపలేడు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిస్థితి అన్ని విశ్వవిద్యాలయాలలో ఉంది.
మన దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది. అయినా, ఇటీవల 'క్యూఎస్' ప్రకటించిన ప్రపంచంలోని 100 అత్యుత్తమ విశ్వ విద్యాలయాల జాబితాలో 2022 సంవత్సరానికి భారత్ నుంచి ఒక్క విశ్వ విద్యాలయం కూడా చోటు దక్కించుకోలేకపోయింది. మన దేశ విద్యా రంగం దుస్థితికి దర్పణం ఇది పడుతోంది. పది వేల కోట్ల రూపాయలు వెచ్చించి దేశవ్యాప్తంగా 20 విశ్వవిద్యాలయాలను ఐదేళ్లలో ప్రపంచ స్థాయి సృజన కేంద్రాలుగా మారుస్తామని 2017 లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ సుందర స్వప్నం నేటికీ నెరవేరలేదు. మన ఉన్నత చదువుల స్థితిగతులు మారలేదు. బడ్జెట్‌లో నామమాత్రం నిధుల కేటాయింపు, ఆర్థిక వనరుల కొరత, బోధన సిబ్బంది లేమి, నిర్వహణ పరంగా మితిమీరిన నియంత్రణలు, కాలం చెల్లిన పాఠ్య ప్రణాళికలు వంటివి ఉన్నత చదువులకు చెదలు పట్టిస్తున్నాయి. వాటిని పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరించాల్సిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మాటలతో కోటలు కడుతున్నాయి.
'క్యూఎస్' సంస్థ అంతర్జాతీయంగా విశ్వ విద్యాలయాల ప్రమాణాలు, వాటి తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఏటా ర్యాంకులను ప్రకటిస్తుంది. ఇందుకోసం బోధనా సిబ్బంది-విద్యార్థుల నిష్పత్తి, విదేశీ ఫ్యాకల్టీ నిష్పత్తి, విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు, విశ్వవిద్యాలయం ప్రతిష్ట, పరిశోధనలు, పేటెంట్లు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. 2022 లో 97 దేశాలకు చెందిన 1,300 యూనివర్సిటీలు ఇందుకు పోటీపడగా, 100 మార్కులు సాధించి మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తొలి స్థానంలో నిలిచింది. 99.5 మార్కులతో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రెండో స్థానాన్ని సంపాదించింది. 98.7 మార్కులతో స్టాన్ ఫోర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు మూడో స్థానం పొందాయి. తొలి 100 స్థానాలలో అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్ చైనా, జర్మనీ ఫ్రాన్స్ తదితర దేశాల విద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి.
నానాటికీ దిగజారుతూ
గత ఐదేళ్ల కాలంగా ఈ దేశాలు తమ విద్యా విధానాన్ని మార్చుకుంటుంటే, మన దేశం మాత్రం దిగజారుతోంది. ఐఐటీ బాంబే 46.4 స్కోరుతో 177 వ స్థానంలో ఉండి ఆ జాబితాలో భారత్ నుంచి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఐఐటీ ఢిల్లీ 185 వ స్థానం, ఐఐఎస్ బెంగళూరు 186 వ స్థానంలో ఉన్నది. టాప్ 500 విశ్వవిద్యాలయాల జాబితాలో మన దేశం నుంచి ఎనిమిది మాత్రమే చోటు దక్కించుకున్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి 500 జాబితాలో ఏ విశ్వవిద్యాలయమూ చోటు దక్కించుకోలేకపోయింది. ఐఐటీ హైదరాబాద్ 591 వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 651 వ స్థానంలో నిలిచాయి. మన దేశంలో విద్యాసంస్థలు ప్రపంచ అవసరాలకు సరిపడా ప్రమాణాల విషయంలో ఆసక్తి కనబరచకపోవడంతో వెనుకబడుతున్నాయి. క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం నుంచి 2018లో 20, 2019లో 24, 2020లో 23, 2021లో 21, 2022 లో 22 యూనివర్సిటీలు టాప్-1000 ర్యాంకులలో ఉన్నాయి.
వారి పాత్రే కీలకం
దేశంలో విశ్వవిద్యాలయాలలో రాజకీయ జోక్యం పెరిగింది. బోధన, అభ్యసన, పరిశోధనలలో నాణ్యత కొరవడింది. పారిశ్రామిక అనుసంధానం తక్కువగా ఉంది. నిధుల లేమి, సౌకర్యాల కొరతతో వర్సిటీలు కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థులు నామమాత్ర అభ్యాసంతో పట్టాలు అందుకుని నైపుణ్యాల కొరతతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదించుకోవాలంటే అత్యున్నత ప్రతిభ గల అధ్యాపకులను నియమించుకోవాలి.
మన విశ్వవిద్యాలయాలలో ఉప కులపతుల, అధ్యాపకుల నియామకాల తీరులో అలసత్వం చోటు చేసుకుంటున్నది. ఏ విద్యావ్యవస్థలో అయినా బోధకులే కీలకం. వారి పాత్రే విద్యా ప్రమాణాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బోధకులు-విద్యార్థుల మధ్య నిష్పత్తి అధికంగా ఉంటే విద్యార్థుల మీద అధ్యాపకుడు ఏకాగ్రత చూపలేడు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిస్థితి అన్ని విశ్వవిద్యాలయాలలో ఉంది. ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విశ్వవిద్యాలయాలలో దాదాపుగా 12,900 అధ్యాపక పోస్టులు, 22 వేల బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వారిపై ఒత్తిడి కారణంగా
తెలంగాణ రాష్ట్రంలోని పది ప్రధాన యూనివర్సిటీలలో 1,974 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది ప్రధాన యూనివర్సిటీలలో 108 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తొలి వేయి విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదించిన ఉస్మానియా యూనివర్సిటీలో 848 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నంలో దాదాపు 30 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో 232 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఇలాంటి ఖాళీలతో, అధ్యాపకులు అవసరమైన రీతిలో సన్నద్ధం కాలేని పరిస్థితి నెలకొంటుంది. పరిశోధనకు తగిన సమయం కేటాయించలేరు. బోధన అనుబంధ కార్యకలాపాలపైన దృష్టి సారించలేరు.
మౌలిక వసతులు, బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయింపు, నాణ్యమైన అధ్యాపకులు, నూతన ఉత్పత్తుల సాంకేతికతలు, ఆవిష్కరణలతో దోహదపడే పరిశోధనలు, పరిశ్రమల అనుసంధానంతో విశ్వవిద్యాలయాలను సరికొత్తగా మలిస్తే జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఆవిష్కృతమవుతుంది. పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య బోధన కళాశాలలో నైపుణ్య శిక్షణలతో యువ భారతం రాత మారుతుంది. కాలం చెల్లిన పాఠ్య ప్రణాళికను మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశంలోని విశ్వవిద్యాలయాలు ఉన్నత ప్రమాణాలకు నిలయాలుగా, యువత సామర్థ్యాలను పెంచుకోగలిగే నైపుణ్య కార్ఖానాలుగా మారుతాయి.
అంకం నరేష్
6301650324