- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెటాలియన్ ఉద్యోగుల కష్టాలు అర్థం చేసుకోవాలి!
తెలంగాణ పోలీస్ బెటాలియన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రోడ్ల మీదికి వచ్చి నిరసన తెలియజేయడం దేశంలో పెద్ద చర్చనీయాంశం అయింది. సాధారణంగా యూనిఫామ్ ధరించిన ఉద్యోగులు బహిరంగంగా నిరసన తెలియజేయకూడదు. కానీ వారు చేశారు.. దీంతో 8వ బెటాలియన్ ఉద్యోగులు నిరసన తెలియజేయడానికి కారణమైన 29 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం, పదిమందిని సర్వీసు నుండి రిమూవ్ చేయడంతో బెటాలియన్ ఉద్యోగుల్లో, వారి కుటుంబ సభ్యుల్లో, ఆందోళన, అసంతృప్తి, ఆగ్రహం తారాస్థాయికి చేరడంతో కుటుంబ సభ్యులు రోడ్ల మీదకు వచ్చి రోడ్లను దిగ్బంధం చేశారు.
శాంతి భద్రతలు అదుపు తప్పితే-అదుపులో పెట్ట వలసిన పోలీసులకు స్పెషల్ పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యుల నిరసనలు, రోడ్లను జామ్ చేయడం వంటి చర్యలు తలనొప్పిగా మారాయి. అయితే స్పెష ల్ పోలీసు వారి భార్యలకు, లోకల్ పోలీస్ అధికారులకు మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడి యా గోరంతలు కొండంతలుగా చేసి తాత్కాలిక ఆనందం పొందాలని ప్రయత్నం చేయడం క్షంతవ్యం కాదు.
ఈ విజ్ఞత ఉండాలి!
ప్రతీ మనిషి కష్టాలకు బాధపడతాడు. సుఖాలకు సంతోషిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి విషయంలో ఇదే సూత్రం వర్తిస్తుంది. కొన్ని ఉద్యోగాలు చేయడం కష్టంగా ఉంటుంది. మరికొన్ని ఉద్యోగాలు చేయడం సులభంగా ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు ఒత్తిడి ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు పనే ఉండదు. సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు చూసే ఉద్యోగుల కష్టాలతో మిగతా ఉద్యోగుల కష్టాలను పోల్చడానికి వీలు ఉండదు. దేశం వారికి జీతాలు, పెన్షన్ ఇతర సౌకర్యాలు ఇస్తుంది కదా అని ఒక వాక్యంతో సరిపెడితే అది విజ్ఞత అనిపించుకోదు. దేశ రక్షణ, శాంతి భద్రతల రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఆ సర్వీసు రూల్స్‌ను అతిక్రమించే ఏ ఉద్యోగి అయినా శిక్షకు అర్హుడే!
పోలీసుల కష్టం అర్థం కాలేదా?
అయితే ఈ మొత్తం ఉదంతాన్ని పరిశీలిస్తే, డ్యూటీల విషయంలో స్పెషల్ పోలీసుల కష్టాలను మానవతా దృష్టితో పోలీసు ఉన్నతాధికారులు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. చాలా రోజులు కుటుంబా న్ని వదిలి, బయట ఉండడం, బయట రాష్ట్రాలకు డ్యూటీ నిమిత్తం పంపినప్పుడు కనీస వసతులు కల్పించకపోవడం, ఆరోగ్య సంబంధమైన విషయాలతో బాధపడుతున్న వారిని సరైన రీతిలో ఉన్నతాధికారులు ట్రీట్ చేయకపోవడం, తమ పిల్లల చదువులకు బెటాలియన్‌లో సరైన విద్యా సౌకర్యాలు లేకపోవడం ఇత్యాది విషయాలన్నీ బెటాలియన్ ఉద్యోగులలో అసంతృప్తికి కారణమయ్యాయని చెప్పాలి. ఏ ఉద్యోగి అయినా తన కష్టాన్ని ఇతర ఉద్యోగుల కష్టాలతో పోల్చుకుని, తాను ప్రయోజనం, సౌకర్యాలను పొందాలని కోరుకుంటాడు. ఇది ప్రకృతి సూత్రం. దీన్ని ఎవరూ తృణీకరించలేరు. ఉన్నత అధికారులు అనేక సౌకర్యాలతో, సుఖమైన జీవితంతో సాటి ఉద్యోగులతో సేవలు చేయించుకుంటూ, దర్జాగా జీవి తాన్ని గడుపుతూ ఉంటే... సదరు అధికారులపై కింది ఉద్యోగులకు అసంతృప్తి, ఆగ్రహం పెళ్లుబుకుతాయి. 'యద్య దాచరది శ్రేష్టః' అని గీతాచార్యుడు చెప్పిన భగవద్గీత శ్లోకాన్ని అర్థం చేసుకుంటే ఉన్నత అధికారుల నిజాయితీ, విద్యుక్త ధర్మం పట్ల నిష్ఠ, కింది ఉద్యోగుల పట్ల సమరసతా భావన వంటి విషయాలు కింది స్థాయి ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తాయి.
పోలీసులు బానిసలు కారు..
చాలామంది ఉన్నత ఉద్యోగులలో బ్రిటిష్ అధికారుల ఆలోచనా భావనల పరంపర వాసనలు ఇంకా తొలగిపోలేదు. ఈ భావనల స్వరూపమే స్పెషల్ పోలీసు కుటుంబ సభ్యులను రోడ్ల మీదికి తెచ్చిందని చెబితే అతిశయోక్తి కాదేమో! ఒకప్పుడు స్పెషల్ పోలీసు ఉద్యోగాలకు ఎనిమిదవ తరగతి, పదవ తరగతి పాసైన వాళ్లు మాత్రమే ఎన్నికయ్యేవారు. వారికి చదువు తక్కువ కాబట్టి పై అధికారులు ఏ పనులు చెప్పినా బుద్ధిగా, బాధ్యతాయుతంగా చేసేవారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగాలకు వచ్చేవారు బాగా చదువుకున్నవారు. తమ వ్యక్తిత్వాలను కాపాడుకోవాలని ప్రస్తుతం స్పెషల్ పోలీస్ ఉద్యోగుల ఆలోచన తీరు ఉంది. దీనిని ఉన్నత అధికారులు దృష్టిలో ఉంచుకొని ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా, పోలీసు వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం పోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.
వారితోనూ పోల్చుకుంటే..
స్పెషల్ పోలీసు ఉద్యోగుల కష్టాలను ప్రభుత్వం సానుకూల దృష్టితో ఆలోచించి, వారి కోరికలను తగిన రీతిలో నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంది. ఇదే సంద ర్భంలో మాతో డ్యూటీకి సంబంధం లేని పనులను గ్రౌండ్‌లో చేయిస్తున్నారని కొందరు ఉద్యోగులు వీడియోలు తీసి పంపడం కూడా తప్పు. వీరు పొలాల్లో పని చేసే రైతులు, రైతు కూలీలు, బేల్దారి పనులు చేసే కార్మికుల కష్టాలను బేరీజు వేసుకుని ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. వాస్తవంగా ఎంతో పెద్ద చదువులు చదువుకొని, ఉద్యోగం రాక దేశంలో యువత అనేక బాధలను ఎదుర్కొంటున్నారు. వీరి జీవితాలతో ఉద్యోగా లు పొందిన వారు అనుభవిస్తున్న సౌకర్యాలను కంపేర్ చేసుకోవాలి. ఇదే సందర్భంలో సమసమాజ నిర్మాణానికి మావోయిస్టు ఉద్యమాన్ని నడుపుతూ, ప్రాణాలను తృణప్రాయంగా సమాజానికి సమర్పిస్తున్న వ్యక్తులను, దేశసేవకే తమ జీవితాలు అనుకుంటూ, జీవితాంతం బ్రహ్మచారులుగా కొనసాగే ఆర్ఎస్ఎస్ ప్రచారకులను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ పోలీసులు తమ విద్యుక్త ధర్మం విషయంలో నిబద్ధతతో ఉంటే, ప్రభుత్వాలను నడిపే రాజకీయ నాయకులు దిగి వస్తారు.
- ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877