- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధునిక తెలుగు వైతాళికుడు గిడుగు
తెలుగు భాషా మాధుర్యాన్ని తెలుగు వారందరూ ఆస్వాదించి తరించాలి. కానీ, వందేళ్ల క్రితం ఈ పరిస్థితి లేదు. నాటి సాహిత్యంలో, పాఠ్య పుస్తకాలలో, ప్రసార మాధ్యమాలలో తెలుగు భాష కఠినమైన గ్రాంథిక రూపంలో ఉండేది. గ్రాంథిక భాషను పండితులు తప్ప విద్యార్థులు, సామాన్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఈ విషయాన్ని అప్పట్లో గిడుగు రామమూర్తి గుర్తించారు. ఈ విధానం సరికాదనీ, తెలుగు భాషను మనం సాధారణంగా మాట్లాడే వ్యావహారిక భాషలోనే బోధించాలనీ, రాయాలనీ ఒక ఉద్యమాన్నే చేశారు. ఈ ఉద్యమమే వ్యవహారిక భాషోద్యమం. గిడుగు రామమూర్తి చేసిన ఎన్నో ఏళ్ళ పోరాటం, కృషి ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార, ప్రసార మాధ్యమాల్లో, సాహిత్యంలో వాడుక భాషను ఉపయోగిస్తున్నాం. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించిన గిడుగు వెంకట రామమూర్తి, పర్లాకిమిడి మిడిల్ స్కూల్లో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు, రామమూర్తి సహాధ్యాయి.
తెలుగు భాష ఇంత తేడాగా ఎందుకుంది?
వ్యవహారిక భాషోద్యమ ప్రారంభానికి ఓ ఆసక్తికర నేపథ్యం ఉంది. 1907 ప్రాంతంలో మద్రాసు, రాజమండ్రి ప్రాంతాల్లో జే.ఏ. యేట్సు అనే ఇంగ్లీషు దొర పాఠశాలల తనిఖీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడై, ఉద్యోగం నిమిత్తం భారతదేశం వచ్చాడు. జే.ఏ. యేట్సు దొరకి తెలుగు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో పాఠశాలల్లో తెలుగు బోధించే విధానానికి, బయట తెలుగు మాట్లాడే విధానానికి చాలా తేడా ఉందని ఆయన గమనించాడు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న తెలుగు, వ్యవహారిక భాషగా ఉన్న తెలుగు రెంటిలో ఎందుకు తేడా ఉందో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని విశాఖపట్నంలో ఏ.వీ.ఎన్. కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నారు. అప్పటికే గిడుగు వారు తెలుగు భాషా శాస్త్రవేత్తగా ఎంతో లోతైన విషయ పరిజ్ఞానాన్ని సంపాదించారు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు దొర ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. వ్యవహారిక భాషోద్యమాన్ని పూర్తిగా తన భుజానికెత్తుకొని ముందుకి తీసుకువెళ్లి విజయం సాధించేవరకు రామమూర్తి అవిశ్రాంతంగా కృషి చేసారు.
అధునిక తెలుగు గిడుగు కృషి ఫలితం
అప్పటి స్కూలు, కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది. కొన్నిటిలో వీరేశలింగం గారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గ్రాంథికం, వ్యవహారిక భాషలపై లోతైన పరిశోధన చేసిన గిడుగు రామమూర్తి. ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దిష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. సాంప్రదాయవాదులు కొందరు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని వ్యతిరేకించినప్పటికీ చివరిగా గిడుగు వారి అభిప్రాయంతో ఏకీభవించారు. 1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇలా వాడుక భాషా బోధనా, రచనలను పండితులందరూ ఆమోదించారు. గిడుగు రామమూర్తి గారి కృషి కారణంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం. తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న కన్ను మూశారు. గిడుగు జయంతిని పురస్కరించుకొని వాడవాడలా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆయన కృషికి గొప్ప నివాళి. అక్కిరాజు ఉమాపతిరావు గిడుగు వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ఇలా అన్నారు.. "ఆయన స్థిత ప్రజ్ఞుడు, స్థిర సంకల్పుడు, వాజ్మి, మేధానిధి, పండితమౌళి, సాంప్రదాయ పరిరక్షకుడు, అభ్యుదయగామి".
(ఆగష్టు 29 తెలుగు భాషా దినోత్సవం)
- వి. పద్మ
తెలుగు ఉపాధ్యాయురాలు
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల
వినుకొండ
98666 23380