ఖనిజ సంపద కోసం జీవితాల్లో నిప్పులు..

by Ravi |   ( Updated:2023-01-20 02:08:06.0  )
ఖనిజ సంపద కోసం జీవితాల్లో నిప్పులు..
X



దేశంలో సుమారు పదిన్నర కోట్ల జనాభా ఉన్న ఆదివాసీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆకలి చావులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మందిని ఖనిజ సంపద కోసం నివాసాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. రోజుకు లక్షల మంది ఆదివాసీలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.దేశంలోని డీప్ ఫారెస్ట్ ఏరియాలో రానున్న 20 సంవత్సరాలలో కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టి ఖనిజ సంపదను వెలికి తీయడం ద్వారా 60 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంతల్లో నివసించే సుమారు 60 శాతం మంది ఆదివాసీలను బయటకు తరిమేయనున్నారు.అడవిలోని ఖనిజ సంపద దోచుకుంటూ అక్కడి చెట్టు, చేమపై ఆధారపడి జీవించే ఆదివాసీలకు బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు.

దేశంలో ఖనిజ సంపద కోసం మనుషుల జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు పాలకులు. అడవిలోని ఖనిజ సంపద దోచుకుంటూ అక్కడి చెట్టు, చేమపై ఆధారపడి జీవించే ఆదివాసీలకు బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు. అడవుల యజమానులుగా అడవిపై హక్కుదారులుగా ఉంటున్న వారికే బతుకులు లేకుండా ఆగం చేస్తున్నారు.. దేశంలోని ఆదివాసీ ప్రాంతంలోని సంపదను లూటీ చేస్తూ, పర్యావరణానికి పెద్ద ఎత్తున విఘాతం కలిగిస్తూ వరదల బీభత్సానికి కారణం అవుతున్నారు. ఒకవైపు విధ్వంసం సృష్టిస్తునే మరోవైపు ఆ సమస్యను రాజకీయం చేస్తూ రాజకీయంగానూ లబ్ది పొందుతున్నారు. ఆ ప్రాంతాల వారి ఓట్లను పార్లమెంట్ అసెంబ్లీ సీట్లను నయానా, భయానా సామ దాన దండోపాయాలతో అబద్ధపు అభివృద్ధి సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చి సాధించుకోవడం కోసం పాలకులు బహుముఖ వేషాలు ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు.

ఆదివాసుల ముందు నాటకాలు..

ఆదివాసీ ప్రాంతాల పర్యటనకు మంత్రులు, పీఎం,సీఎం, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పెట్టుబడిదారులు ఎవరు వెళ్లినా ఆ కొద్దిసేపు ఆదివాసీల సంస్కృతిని గౌరవిస్తున్నట్లు, వారి వేషధారణతో కనిపిస్తారు.. వారి డాన్స్‌లు చేస్తారు, వారి భోజనం తింటారు, వారి పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతారు కూడా. అక్కడి వృద్ధులను పలకరించి ఆలింగనాలూ చేసుకుంటారు. మంచి ఫోటోలు దిగి మీడియాకు పంపుతారు. అక్కడి రోడ్లకు, ఇతర సంక్షేమ అభివృద్ధి పతకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు...ఈ నాటకాన్నంతా అప్పుడప్పుడు మనం టీవీలో చూస్తుంటాం. ఈ నాటకంలో పాల్గొన్న నేత స్థాయిని బట్టి పత్రికల్లో బ్యానర్లో లేదా లోపలి పేజీల్లో వార్తలు చూస్తూ ఉంటాం.. నిజానికి ఇదంతా డ్రామా కాకుండా నిజం కావాలని. వారి బతుకులు బాగుపడాలని పాలకులు, ప్రజా ప్రతినిధులు మమేకం కావాలని ఆదివాసీ జీవితాలలో వెలుగు రావాలని అందరూ భావిస్తారు.

కానీ ఇదంతా అబద్ధం. సంపద, ఓటు బ్యాంకు కోసం తద్వారా అధికారం కోసం నేతలు ఆడే నాటకమని తెలిసినప్పుడు ఒకింత ఆందోళన కలిగి ఈ కలుషిత మనుషులు, రాజకీయాలపై వెగటు పుడుతుంది. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వారి బతుకులు10 శాతం బాగుపడలేదు, మారలేదు. మార్చడానికి పాలకులు కూడా సరైన ప్రయత్నాలు చేయలేదు. ఈ దశాబ్దాల కాలం మధ్యన మాత్రం 28 కమిటీలను అధ్యయనం కోసం వేశారు. కానీ కార్యాచరణ లేదు. నిజానికి దేశంలోని 92 శాతం అపారమైన ఖనిజ సంపద ఆదివాసీలు నివసించే అటవీ ప్రాంతంలోనే ఉంది. అందుకే అక్కడి సంపదను దోచుకోవడానికి ఇప్పటికే కోట్లచెట్లను లక్షల ఎకరాలలో నరికేసి ఆదివాసీల బతుకుల్లో నిప్పులు పోశారు. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో వీరి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ప్రభుత్వ రేషన్ అందించడానికి కనీసం ఒక్క రేషన్ దుకాణం కూడా కనిపించదు. ఆ దుకాణాలు కేవలం కాగితాలమీద మాత్రమే ఉంటుంది. ఆదివాసీల నుంచి తీసుకున్న భూమి బదులు మరోచోట ఇస్తామన్న హామీ నెరవేరదు. నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన అక్కడి సంపదలో వాటా అంతే సంగతి.

దేశంలో ఇప్పటి రాజనీతి అదే..

దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో 18 శాతం పేదరికం పెరిగి హంగర్ ఇండెక్స్‌లోని 166 దేశాల్లో మనదేశం 101వ స్థానంలో ఉంది. దేశంలో సుమారు పదిన్నర కోట్ల జనాభా ఉన్న ఆదివాసీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆకలి చావులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మందిని ఖనిజ సంపద కోసం నివాసాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. రోజుకు లక్షల మంది ఆదివాసీలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి ప్రాంతాల్లో వైద్య, రవాణా సౌకర్యం లేక వాగులు, వంకలు దాటలేక వేలాది మంది ఊపిరి వదులుతున్న దాఖలా ఉంది. ఆదివాసీలలో 46 శాతం రక్తహీనతతో బాధపడుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. పసిపిల్లలు గర్భిణీలు ఇందులో 66 శాతం ఉన్నారంటే పౌష్టిక ఆహారం వారికి ఎంత దూరంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక అంచనా ప్రకారం దేశంలోని డీప్ ఫారెస్ట్ ఏరియాలో రానున్న 20 సంవత్సరాలలో కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టి ఖనిజ సంపదను వెలికి తీయడం ద్వారా 60 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంతల్లో నివసించే సుమారు 60 శాతం మంది ఆదివాసీలను బయటకు తరిమేయనున్నారు. ఇప్పటికే దీనికై ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో కొంత ప్రభుత్వానికి పన్నుల రూపంలో వస్తుంది. కొంత ఎలక్షన్ ఫండ్, నజరానాలు, పార్టీలకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందుతాయి. అందుకే ఆదివాసీల జీవితాల గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి వీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రకృతి అసమతౌల్యత కారణంగా వచ్చే వరదలతో వారికి సంబంధం లేదు. పది రూపాయలు వారి జేబులోకి వస్తే చాలు వారి బతుకులు పణంగా పెట్టేస్తారు. ఇదే ఇప్పుడు దేశం రాజనీతి.

ఇప్పటికే గడిచిన పదేండ్లలో పలు కంపెనీలకు 6 లక్షల 50 వేల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం నెరవేరింది. ఇప్పుడు బాక్స్వా జంగిల్‌లో ‌2.5 లక్షల చెట్లు నరికేసి వజ్రాల అన్వేషణ మొదలుపెట్టారు. చెట్ల అమ్మకం ద్వారా 10 లక్షల కోట్ల రూపాయల లాభం చేకూరుతుంది. బొగ్గు, బాక్సైట్ల ద్వారా ఒక లక్ష 50 వేల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపాదన ప్రతి ఏడూ సాధిస్తున్నారు. అడవిలో బీడీ ఆకుల సీజన్లో ఒక్కొక్కరు రెండున్నర వేల ఆకులు సేకరిస్తే వారికి లభించేది కేవలం 75 పైసలు మాత్రమే. ఆదివాసీల దుస్థితి ఇలా ఉంది. కోల్ ఇండియా కూడా తమకు అన్యాయమే చేస్తోందని 70 శాతం బొగ్గు తవ్వకాలు ఉన్న ఆదివాసీ ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. లక్షల కోట్లు సంపాదించి పెడుతున్న ఆదివాసీల జీవితాల బాగుకోసం క్షేత్ర స్థాయి నుంచి కృషి జరగాలి. ఆ ప్రాంతాల్లోని 121 మంది ఎంపీలు, 350 మందికి పైగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు దీనికై పాటుపడాలి. కనీసం సాటి మనుషులుగా అయినా ఆదివాసీల పట్ల వారి జీవన పరిస్థితుల పట్ల శ్రద్ధ చూపాలి. వారి జీవితాల మెరుగు కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వాలు ప్రయత్నం చేసి వెలుగు తీసుకురావాలి. వారి ప్రాంతంలో లభిస్తున్న సంపదలో వారిని భాగస్వాములను చేయాలి. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండి.మునీర్

సీనియర్ జర్నలిస్ట్..విశ్లేషకులు

9951865223

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

పరిశోధనా నివేదికను రూపొందించటం ఎలా?


Advertisement

Next Story

Most Viewed