సిరా చుక్కకి.. ఉందో లెక్క

by Ravi |   ( Updated:2024-03-30 00:30:34.0  )
సిరా చుక్కకి.. ఉందో లెక్క
X

ఎన్నికల రోజున ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడువేలుపై ఒక సిరాచుక్క పెట్టడం కూడా అందరూ గమనించే ఉంటారు. అయితే ఎందుకు ఈ సిరాచుక్క పెడుతున్నారు. ఎప్పటినుంచి పెడుతున్నారని తెలుసుకోవాలంటే దానికో లెక్కుంది. ఆ లెక్కేంటో, దాని కథాకమామిషు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఓకే విడతగా 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ తేదీన ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ లోపల ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడు వేలుపై ఒక సిరా చుక్కను పెడతారు. ఈ చుక్క 72 గంటల వరకు(3రోజులు) చెరిగిపోకుండా ఉంటుంది. దొంగ ఒట్ల నివారణకై దీనిని ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. 10 మి.లీ సామర్థ్యం కలిగిన ఒక సిరా సీసా(వైల్ ) 700 మందికి చుక్కలు పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయిలేకపోయినా, ప్రమాదంలో కోల్పోయినా, అప్పుడు మాత్రమే అధికారుల అనుమతితో కుడిచేతికి పెట్టాలనే నిబంధన కూడా ఉంది.

పోలియో చుక్కల కోసం..

ఈ సిరా చుక్కను మనదేశంలో 1962 నుంచి వాడుతున్నారు. ఇది కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిస్ కంపెనీ తయారు చేస్తుంది. అయితే డిమాండ్‌ను బట్టి కర్ణాటకతో పాటు హైదరాబాద్‌లోనూ తయారిచేసే కంపెనీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇదే సిరాను చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసినప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు. ఇదే సిరాను మనదేశం ఎన్నికలకు మాత్రమే కాకుండా 1976 నుంచి 29 దేశాలకు ఎగుమతి చేస్తుంది భారతదేశం. ఎన్నికల సంఘ నిబంధనలు సెక్షన్ 37 (1) ప్రకారం ఓటరు ఎడమ చేతిపై చూపుడు వేలుపై సిరా చుక్క వెయ్యాలి. 2006 ఫిబ్రవరి నుండి వేలుతో పాటు గోరుపై భాగంలో కూడా సిరా చుక్క వేస్తున్నారు.

సి.ఎన్. మూర్తి,

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

83281 43489

Advertisement

Next Story

Most Viewed