నడుస్తున్న చరిత్ర: బీజేపీ ఉచ్చులో రాజగోపాల్ రెడ్డి పడ్డారా?మునుగోడు ప్రజల అంతరంగం ఏమిటి?

by Ravi |   ( Updated:2022-09-03 14:02:25.0  )
నడుస్తున్న చరిత్ర: బీజేపీ ఉచ్చులో రాజగోపాల్ రెడ్డి పడ్డారా?మునుగోడు ప్రజల అంతరంగం ఏమిటి?
X

మీరు ఆటగాళ్లైతే మైదానాలకు వెళ్లండి

ధనవంతులైతే పేదలకు సహాయం చెయ్యండి

ప్రజాప్రతినిధులైతే ఓటర్ల తీర్పును గౌరవించి

పూర్తి పదవీ కాలం వారి సేవలో తరించండి

బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించండి

నవసరంగా ఉప ఎన్నిక తెచ్చి ప్రజాధనం వృథా చేయవద్దని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ఆవేదన. ఏ ప్రజా ప్రతినిధి అయినా తమకు తాముగా రాజీనామా చేస్తే ఉప ఎన్నికకు బదులుగా అదే ఎన్నికలో రెండవ స్థానంలో ఉన్న వారిని అర్హుడుగా ప్రకటించేలా రాజ్యాంగ సవరణ చేస్తే బాగుంటుందని ఒకరి సూచన. కాంగ్రెస్ పార్టీ తరఫున 2018 ఎన్నికలలో గెలిచిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) పదవికి, పార్టీకి రాజీనామా చేయబోతున్నారనే వదంతుల నేపథ్యంలో వెలువడుతున్న కొన్ని అభిప్రాయాలు ఇవి.

'మునుగోడు(Munugodu) ప్రజలు కోరుకుంటే రాజీనామా చేస్తా' అని పదే పదే అంటున్న రాజగోపాల్ రెడ్డి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలకు స్పందించిన వారిలో అధికులు 'మీరు రాజీనామా చేయకండి, బీజేపీ ఉచ్చులో పడకండి, మునుగోడులో బీజేపీ గెలిచే అవకాశాలు ఇప్పుడే లేవు' అని కామెంట్స్ పెట్టారు. 'మీరిప్పుడు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి' అని ఆయన ద్వారా సహాయం పొందామని చెబుతున్న కొందరు రాశారు. ఒకరకంగా ఈ కామెంట్లను కూడా ఆయన సీరియస్‌గానే తీసుకుని తన రాజీనామా సంగతిని సాగదీస్తున్నట్లు కనిపిస్తోంది. వారం, పదిహేను రోజుల సమయం అంటూ ఆ ముహూర్తం ఎంత దూరమైనా వెళ్లవచ్చనిపిస్తోంది.

సవాలు విసిరితే చాలా?

అసలు ఒక రాజకీయ నేతగా రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి స్థానమేమిటి ? ఆయన తెలంగాణలోని 119 ఎమ్మెల్యేలలో ఒకరు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కాంగ్రెస్‌లో మిగిలిన ఆరుగురు శాసనసభ్యులలో ఒకరు. పార్టీ మారుతారనే చర్చతో రోజూ మీడియాలో కనబడుతున్నారు. వారం, పది రోజులుగా ఆయనను పలకరించని టీవీ ఛానల్ లేదు. ఆయన మీద యూ ట్యూబ్‌లలో సుదీర్ఘ చర్చ చూడొచ్చు. 'ఉప ఎన్నిక వస్తేనే ఆ నియోజకవర్గానికి ప్రభుత్వ నిధులు వస్తాయంటే రాజీనామాకు సిద్ధమని' సర్కారుకు ఆయన చాలా కాలంగా సవాలు విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం సొంత సొమ్ము ఖర్చు చేసినా తగిన గౌరవం, హోదా దక్కలేదని పార్టీని వీడుతున్నానని ఓసారి అన్నారు.

తెలంగాణాలో కేసీఆర్ పాలనను అంతం చేసే సామర్థ్యం ఒక్క బీజేపీకే ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అన్నారు. నిజానికి ఈ అసహనమంతా జూన్ 2021 లో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదలైనట్లు గమనించవచ్చు. నోరు లేని పెద్ద మనుషులతో కునారిల్లుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌కు ఒక దీటైన గొంతు అత్యవసరమున్న వేళ, ఆ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి అధిష్టానం గత్యంతరం లేక పదవి కట్టబెట్టింది. అప్పటి నుండే అలకలు, నిరసనలు చూపుతున్న సీనియర్లు ఇంకా దారిలోకి రాలేదు. 2018లో మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపు సామాన్యమైనది కాదు. టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చి కాంగ్రెస్‌కు కొత్త బలాన్ని ఇచ్చిన మలుపు అది. ఎమ్మెల్యే కాలేని కిషన్‌రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయినట్లు ఇంట ఓడిన రేవంత్ కూడా ఈ ఎన్నికతో ఎంపీగా గెలిచి పార్టీ అగ్రనేత అయ్యారు.

వారంతా సరుకు లేనివారే

కడుపులో చల్ల కదలకుండా పదవులొస్తే అనుభవించేవారు కాంగ్రెస్ పార్టీలో చాలా మందే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఎడాపెడా విమర్శించేవారు, గొంతున్నవారు, చేతినిండా సమాచారమున్న వారు, ఏదైనా మాట్లాడే సత్తా ఉన్నవారు లేరనే చెప్పాలి. అలాంటి సందర్భంలో కాంగ్రెస్‌కు దొరికిన చిచ్చరపిడుగు రేవంత్ రెడ్డి(Revanth Reddy). రాబోయే ఎన్నికలలో ఫలితాలెలా ఉన్నా ఉత్సాహం, ఊపు తగ్గని మాటకారి ఆయన. కాంగ్రెస్ పార్టీ సభలు తగ్గిపోయిన సమయంలో రేవంత్ భారీ సంఖ్యలో ప్రజలను రప్పించి వాటిని నిర్వహించగలుగుతున్నారు. ఇన్నాళ్లుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా(TPCC) ఆయన చేసిన కార్యక్రమాల నిర్వహణ కాంగ్రెస్‌లో మరొకరితో సాధ్యమా? అనిపిస్తుంది.

రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్‌గా ఎదిగి రాజకీయాలలోకి వచ్చారు. చిన్న వయసులోనే రాజకీయ జీవితం మొదలు పెట్టే వారికన్నా వివిధ వృత్తులలో, వ్యాపారాలలో బాగా సంపాదించి రాజకీయాలలో వచ్చినవారు పార్టీలో తమ హోదాని, గౌరవాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుంటారు. 'పార్టీ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. మా ఆకాంక్షను నెరవేర్చాలి' అనే మొండితనంలో ఉంటారు. కోపమొస్తే పార్టీని తన్నేసి మరో పార్టీకి మారిపోతారు. వారికి ఎలాంటి పార్టీ సెంటిమెంట్స్ ఉండవు. జాతీయ స్థాయి నేతలన్నా చిన్న చూపే. కాంగ్రెస్‌లో కొనసాగి సాధించేది ఏమీ లేదనే నిర్ణయానికి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడో వచ్చేశారు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ ఎదిగి రాజకీయంగా చక్రం తిప్పే అవకాశం ఉన్నదనుకుని ఈ శిబిరంలో చేరడం మేలనే ఆలోచనలో ఉన్నారు.

రాజకీయ చంచలత్వం

అదేదో తన మనసులోనే ఉంచుకొని ఎన్నికల ముందు బయటపడితే భారీ ఎన్నికల ప్రచారంతో లాభించే అవకాశం ఉండేది. కాంగ్రెస్(Congress) బలహీన పడినందున తెలంగాణాలో కుటుంబ పాలనను కూలదోసే శక్తి బీజేపీకే ఉందనడమే ఆయన రాజకీయ చంచలత్వాన్ని బయటపెట్టింది. అదే మాటని పట్టుకొని బీజేపీ పావులు కదిపి ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. ఇప్పుడు బీజేపీకి కావలసింది 2023 కన్నా ముందు ఒక ఉప ఎన్నిక. మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ గెలవాలంటే దాని క్యాడర్, ఓటర్ రాజగోపాల్ రెడ్డితో వెళ్లిపోగూడదు. ఆయనలా ఎన్నికల ఖర్చును తట్టుకొనే నేత కావాలి.

టీఆర్ఎస్ పాలక పార్టీ అయినా మునుగోడులో తక్షణం బలం పుంజుకోవడం సాధ్యం కాదు. కొత్త పథకాల పడవ నిండా ముంచుతుందని హుజురాబాద్ అనుభవం నేర్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను అభ్యర్థిగా చేసుకుంటే గెలుపు సాధ్యమని బీజేపీ హుజురాబాద్ ద్వారా నేర్చుకుంది. మునుగోడు ఉప ఎన్నిక వచ్చి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే అది బీజేపీ గెలుపు, ఓడిపోతే అది రాజగోపాల్ ఓటమి అవుతుంది. రాజీనామాకు సమయం పడుతుందని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. బండి సంజయ్(Bandi Sanjay) మాత్రం ఆయన బీజేపీలో చేరిపోతున్నారనే ప్రచారం జోరుగా చేస్తూ తొందర పెడుతున్నారు.

అసలు సంగతి ఇదే

బీజేపీ రథం జోరు మీద ఉందని ఎక్కేందుకు ఉబలాటపడేవారంతా గమనించవలసిందేమిటంటే దానికి సొంత హార్డ్ కోర్ టీమ్ ఉంది. వారి ప్రయోజనాలే దానికి ప్రధానం. కాషాయ భావజాలం లేనివారిని రెండో వరుసలో ఉంచుతుందని ఈటల రాజేందర్‌కు దక్కుతున్న గౌరవం ద్వారా తెలుసుకోవచ్చు. 'బీజేపీ పాలన రాగానే రాష్ట్రంలో ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తాం' అని బహిరంగంగా అనగలిగినవారే వారి సొంత మనిషి. రాజాసింగ్‌లా రాజగోపాల్ రెడ్డి మాట్లాడితేనే తొలి వరుసలోకొస్తారు. మతపర తటస్థులు బీజేపీలో చేరి దాని హిందూ పక్షపాత ధోరణికి బలమియ్యడమే తప్ప వారికి దక్కేది తక్కువే. కేసీఆర్(Kcr) కుటుంబపాలనపై మునుగోడు నుండే ధర్మ యుద్ధం మొదలవుతుందని రాజగోపాల్ రెడ్డి పదేపదే అంటున్నారు.మునుగోడేమి తరతరాలుగా ఆయన సంస్థానం కాదు. పార్టీ బి-ఫారం ఎక్కడికి ఇస్తే అక్కడ పోటీ చేయాల్సిందే. నేతలు సొంతంగా నియోజకవర్గాలను ఎంచుకొనే పద్ధతి బీజేపీలో లేదు అన్న బండి సంజయ్ మాటలు ఇక్కడ గమనార్హం.

అనుకోకుండా ఉప ఎన్నిక వస్తే సరే కానీ, మీ బలాబలాలు తూకం వేయడానికి, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల క్షేత్రాన్ని వాడుకోవడం సబబు కాదు. మీ చాలెంజ్‌ల కోసం ప్రజాధనాన్ని, అధికారుల సమయాన్ని వృథా చేయడం పౌర అంగీకారం కాదు. కాంగ్రెస్‌పై అలకలతో, నిరసనలతో ఇంత కాలం గడిపిన చిన్న కోమటిరెడ్డి మునుగోడు ప్రజల అభిప్రాయ సేకరణ పేరిట, కాంగ్రెస్ బుజ్జగింపులు పర్వంతో మరింత కాలం గడిపితే పుణ్యకాలం దాటిపోతుంది. అప్పుడు తన దమ్మున్నది చేసుకోనీ.

బి. నర్సన్

9440128169

Advertisement

Next Story

Most Viewed