అపహాస్యమైన ప్రజాస్వామ్యం

by Ravi |   ( Updated:2024-02-08 00:46:17.0  )
అపహాస్యమైన ప్రజాస్వామ్యం
X

ఫిబ్రవరి 6న చండీఘర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరిగిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నిక నిర్వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ తీరు అత్యంత దారుణమని, బాలెట్ పేపర్లను మార్చేసి బీజేపీ మేయర్ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా ఉందని ఇలాంటి దుశ్చర్యలను తాము చూస్తూ ఊరుకోబోమని సీజే చంద్రచూడ్ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ నెల 7న కొత్త మేయర్ అధ్యక్షతన జరిగే సమావేశం కూడా ఆపడం జరిగింది.

రొటేషన్ పద్ధతిలో ఈ జనవరి 18న మేయర్ ఎన్నిక జరగాలి. ఆప్, కాంగ్రెస్ ఉమ్మడి మేయర్ అభ్యర్థిగా ఆప్‌కి చెందిన కులదీప్ పోటీలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా మనోహర్ సోలాంకి పోటీకి దిగగా ఆ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా బీజేపీ నామినేటెడ్ కౌన్సిలర్ అనిల్ మసీహ్ ఎన్నికలు నిర్వహించలేదు. నిర్ణీత సమయానికి ఆప్, కాంగ్రెస్ అభ్యర్థులు కార్యాలయంలో నిరీక్షిస్తున్నప్పటికీ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా, బీజేపీ సభ్యులు కానీ హాజరు కాలేదు. ప్రతిపక్ష సభ్యులు హైకోర్టుకు వెళ్లగా, కోర్టు ఫిబ్రవరి 6న ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. కౌన్సిల్లో బీజేపీకి 14మంది కౌన్సిలర్స్ ఉండగా, ఆప్‌కి 13, కాంగ్రెస్ పార్టీకి 7గురు అభ్యర్థులు ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికలో ప్రిసైడింగ్ అధికారి బీజేపీ నామినేటెడ్ సభ్యుడు. ఆయన గతంలో బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోహర్ సోలాంకి 16 ఓట్లు, ఆప్, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కులదీప్‌కు 12ఓట్లు వచ్చినట్టు, 8 చెల్లకపోవడంతో బీజేపీ అభ్యర్థి మేయర్‌గా ఎన్నికైనట్టు ప్రకటించారు.

షాక్‌లో సుప్రీంకోర్టు

దీంతో నివ్వెర పోయిన అప్ అభ్యర్థి పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించగా కోర్ట్ వారికి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీవీ రికార్డు చూసి ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు, ప్రెసిడింగ్ ఆఫీసర్ మాటిమాటికి కెమెరా వైపు చూసి 8 బ్యాలట్‌లను చేరిపేయటం స్పష్టంగా కనిపించడాన్ని గమనించి అతగాడి నిర్వాకాన్ని దుయ్యబట్టింది. ఈ వీడియో ఇప్పుడు పబ్లిక్ డొమెయిన్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. 20మంది వున్న అప్ అభ్యర్థి ఓడిపోయినట్టు 14మంది కౌన్సిలర్లు ఒక బీజేపీ ఎంపీ ఓటుతో 15 మంది వున్న బీజేపీ గెలిచినట్టు ప్రకటించటంపై సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్యం పట్టపగలే అపహాస్యం కావటం సహించలేమని అన్ని రికార్డులను వెంటనే స్థానిక హైకోర్టు రిజిస్టార్ జనరల్‌కు వెంటనే స్వాధీనం చేయాలనీ తదుపరి విచారణకు ఎన్నిక నిర్వహించిన బీజేపీ కౌన్సిలర్ అనిల్ మసీహ్ కూడా హాజరు కావాలని తదుపరి ఉత్తర్వులు విలువడే వరకు ఎలాంటి సమావేశం నిర్వహించరాదని ఆదేశించారు.

దేశంలో ప్రమాద ఘంటికలు

ఇక నిన్న జరిగిన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎన్నిక అధికార పక్షం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే అక్కడి గవర్నర్ ముందు మెజారిటీ సభ్యులు హాజరైనా పరోక్షంగా రెండు రోజులు వేచి చూసి విమర్శల వెల్లువ చూసింతర్వాతే, చెంపయిన్ సొరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ పది రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాలని షరతులు పెడతాడు. ఇక్కడొక మతలబు వుంది. 47 మంది సభ్యుల బలం వున్న సొరెన్‌ని కాదని 29మంది ఎంల్ఏలున్న బీజేపీని పీఠమెక్కించాలని అందుకు సాయపడే బేరసరాలకు ఆస్కారం ఇచ్చే విధంగా పది రోజుల సమయం ఇచ్చారు గవర్నర్. దీనితో అప్రమత్తమై ఎంఎల్ఏలను హైదరాబాద్‌కు తరలించి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బీహార్ ముఖ్యమంత్రి త్వరలో జరిగే బలపరీక్షలో సైతం బేరసారాలకు తెర లేపగా 16 మంది కాంగ్రెస్ ఎమ్మేల్యేలను కాపాడుకోవడానికి వీరిని ప్రస్తుతం హైదరాబాద్ క్యాంపు‌నకు తరలించారు.

ఇప్పటికే పలు ప్రతిపక్ష ప్రభుత్వాలను ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ టాక్స్ సంస్థలతో వేటాడుతూ ఆయా ప్రభుత్వాలను పడగొట్టడం చూస్తూనే వున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులు మున్ముందు ఊహించని పరిస్థితిలోకి దేశం నెత్తివేయబడే స్థితిలోకి వెళుతున్నామనే ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

కె. సుధాకర్ రెడ్డి

రిటైర్డు సీనియర్ లెక్చరర్

89850 37713

Advertisement

Next Story

Most Viewed