గుర్తింపునకు నోచని అదృశ్య యోధులు..

by Ravi |   ( Updated:2024-11-01 01:30:24.0  )
గుర్తింపునకు నోచని అదృశ్య యోధులు..
X

భారతదేశంలోని సందడిగా ఉండే నగరాలలోని నిశ్శబ్ద సందులలో, వ్యర్థాల్ని ఉత్పత్తి చేసేవారికి, సేకరించేవారికి మధ్య ఒక విచిత్రమైన సామరస్యం ఉంది. మనలో చాలా మంది మన ఇళ్లల్లో హాయిగా కూర్చుని, ఆహారాన్ని ఆర్డర్ చేస్తూ లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటే, శ్రామికుల సైన్యం మాత్రం మన ‌ అవసరాల్ని చిత్తశుద్ధితో, శ్రద్ధగా నెరవేరుస్తున్నారు. వారే.. డెలివరీ బాయ్‌లు, రాగ్ పికర్‌లు. వీరు స‌మాజ‌పు చివరి అంచులో పనిచేస్తున్న రెండు విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఒక వర్గం వస్తువుల్ని మనకు చేరేలా చేస్తుంటే... మరో వర్గం వాటి నుండి మనం ఉత్పత్తి చేసే వ్యర్థాల నిర్వహ‌ణ బాధ్యత‌ను తీసుకుంటోంది.

వీరు లేని మన జీవితాలను ఒక్కసారి ఊహించుకోండి. ఒక బటన్ లేదా స్క్రీన్‌పై నొక్కిన ప్రతి క్లిక్ వెనుక, వారు మన అవసరాలను తీర్చడానికి గడియారంతో పోటీపడుతూ పరుగెత్తడం వంటివి మనకు కన్పిస్తాయి. ఇలా దేశంలో పట్టణ ఆర్థిక వ్యవస్థ ఈ గిగ్ వర్కర్లపై ఎక్కువగా ఆధారపడుతోంది, కానీ వారికి తగిన గుర్తింపు లభించడం లేదు. జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లు తమ కస్టమర్ల కోసం దాదాపు అరకోటి మందికి పైగా ఫుడ్ డెలివరీ సిబ్బందిని నియమించుకోగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి వి ఈ-కామర్స్ డెలివరీ కంపెనీల్లో అంతకు మించిన సంఖ్యలో పని చేస్తున్నారు. ఈ వ్యక్తులలో చాలా మంది ఉన్నత విద్య డిగ్రీలను కలిగిన‌వారు ఉన్నారు, అయినప్పటికీ నిరుద్యో గం అత్యధికంగా ఉండటంతో డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండటం వంటి కనీస అర్హతలతో శీఘ్ర ఆదాయాల ఆకర్షణ డెలివరీ ఉద్యోగాల వేగవంతమైన పెరుగుదలకు దారితీసింది.

పర్యావరణ వ్యవస్థలలో అంతర్భాగమైనప్పటికీ..

అయితే, డెలివరీ బాయ్‌ల జీవితాలు అంత తేలికగా లేవు. వారు తరచుగా సమయపాలన పాటిస్తూ, బిజీగా వీధుల్లో ప్రయాణిస్తూ, రోజుకు 12 గంటల కంటే ఎక్కువే పనిచేస్తున్నారు. మన సౌకర్యం, సంతృప్తి కోసం శారీరక, మానసిక ఆరోగ్య సవాళ్లను వీరు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. కానీ వీరి పోరాటాలు పెద్దగా గుర్తింపునకు నోచుకోవడం లేదు. పైగా చాలా మంది చాలీచాల‌ని జీతంతో జీవితాల్ని నెట్టుకొస్తున్నారు. ఇవి తరచుగా వారిని ఆర్థిక అభద్రత భావంలోకి నెట్టివేస్తుంటాయి. వారు తమకు తాము నిలదొక్కుకోవడానికి, వ్యవ‌స్థలో మను గడ కోసం రోజువారీ పోరాటాన్ని చేస్తుంటారు. వారు అసంఘటితంగా దోపిడీకి గురవుతూ, తగిన గుర్తింపు లేకుండా బతుకులీడుస్తున్నారు.

ఇక మరోవర్గం రాగ్‌పికర్లు. వీరు మనం వదిలిపెట్టిన వ్యర్థాలను సేకరిస్తూ దానితో ఏర్పడే గజిబిజిని శుభ్రం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేస్తుంటారు. డెలివరీ బాయ్‌ల మాదిరిగానే, రాగ్‌పికర్‌లు భారతదేశంలోని పట్టణ, గ్రామీణ పర్యావరణ వ్యవస్థల్లో అంతర్భాగమైనప్పటికీ వీరు పెద్దగా గుర్తించబడని వర్గం. ఈ వర్గం చెత్త పోగుల్ని జల్లెడ పడుతూ, మన వ్యర్థాలు పర్యావరణాన్ని ముంచెత్తకుండా నిరోధిస్తారు. అయితే వీరందరూ తగిన భద్రత‌, రక్షణ లేకుండానే గణనీయమైన భాగాన్ని నిర్వహిస్తుంటారు. వీరి సంఖ్య దేశవ్యాప్తంగా 1.5 నుండి 4 మిలియన్లకు పైనే.. వ్యర్థాల్ని తగ్గించడంలో, వనరుల్ని పునరుద్ధరించడంలో పర్యావరణ పరిశుభ్రతను నిర్వహించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.

అదృశ్య భాగస్వామ్యం..

అయితే, ఈ రెండు వర్గాలు వారి అమూల్యమైన సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ, వారు మాత్రం సమాజపుటంచులలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అనారోగ్యం పాలు కావ‌డం, వివక్ష, సామాజిక బహిష్కరణ వంటి వాటితో పోరాడుతున్నారు. ప్రమాదకర పదార్థాలకు ప్రతిరోజూ చేరువగా సంచరించ‌డం వ‌ల్ల శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. వ్యర్థాల నిర్వహణలో వారి పాత్ర కీలకమైనప్పటికీ, వారు తక్కువ స్థాయిలో గుర్తింపు, భద్రతను పొందుతున్నారన్నది నిష్టుర సత్యం. వ్యర్థాల బరువుతో కుంగిపోతున్న పట్టణ, పల్లె ప్రాంతాలలో వీరు తమదైన పనితీరుతో సాంత్వన సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వారు శ్రామిక శక్తిలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన విభాగాలలో ఒకటిగా మిగిలిపోయారు. ప్రభుత్వం, సమాజం రెండింటి నుండీ వారికి తగిన మద్దతు లభించడం లేదు. ఆర్థిక వ్యవస్థలోని అనధికారిక, అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న ఈ రెండూ వర్గాలు కార్మిక రక్షణలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు ప్రాథమిక చట్టపరమైన హక్కుల వంటి వాటికి దూరంగానే వుంటున్నా రు. వాతావరణ పరిస్థితులు, సెలవులు లేదా ఇతర సామాజిక అంశాలతో సంబంధం లేకుండా అవిశ్రాంతంగా వీరు పనిచేస్తూనే వుంటారు. వీరికి తగిన కార్మిక చట్టాలు వ‌ర్తించేలా చ‌ర్యలు తీసుకుంటే త‌ప్ప దోపిడీకి గుర‌వుతున్న వీరికి తగిన భద్రత లభించద‌నే చెప్పాలి.

ఈ సైనికులను గౌరవించాలి..!

ఆకస్మిక తొలగింపున‌కు గుర‌వుతున్నందున వీరికి ఉద్యోగ భ‌ద్రత క‌ల్లే. ఇక రాగ్‌పికర్‌లైతే గుర్తింపున‌కు నోచుకోరు స‌రిక‌దా, సమాజంలో వీరు బహిష్కృతులుగా పరిగణించబడుతున్నారు. శౌర్యం, త్యాగం, కృషి వంటి సంప్రదాయాల్ని గర్వించే మ‌నదేశంలో, మనం సైనికులు, రైతులు, స్వాతంత్య్ర సమరయోధుల్ని గౌరవిస్తాం. అలాగే మన సమాజాన్ని నిలబెట్టే కొత్త తరహా సైనికులను కూడా మనం గుర్తించాల్సిన అవసరం వుంది. వీరు ఆధునిక భారతదేశానికి అపూర్వమైన హీరోలు.. వారు యూనిఫారాలు ధరించకపోవచ్చు, ఆయుధాలను కలిగి ఉండకపోవచ్చు, వారు ట్రాఫిక్, టైం, ఆకలి, ఆరోగ్యం వంటి ప్రమాదాలకు వ్యతిరేకంగా రోజూ పోరాడుతూనే ఉన్నారు. వారి సహకారాన్ని గుర్తించాల్సిన సమయం ఇది. మెరుగైన వేతనం, మెరుగైన పని పరిస్థితులతో పాటు ఇప్పటివరకూ సమాజం నిరాకరించిన గౌరవం గుర్తింపున‌కు ఈ కార్మికులు అర్హులు. వారు లేకుంటే, మన నగరాలు స్తంభించిపోతాయి. మన ఇళ్లు వ్యర్థాలతో పొంగిపొర్లుతాయి. వీరు భారతదేశ ముఖచిత్రంలో కన్పిం చని హీరోలు. ఈ కార్మికులు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకోవడం అత్యంత కీలకం. వారు అవిశ్రాంతంగా పనిచేసే అంతర్గత సైనికులు.. వారికి మన కృతజ్ఞతే కాదు.. మన మద్దతుకు గుర్తింపున‌కు కూడా అర్హులేనన్న మాట అక్షర సత్యం.

కేవీ ర‌మ‌ణ‌మూర్తి

99665 13257

Advertisement

Next Story