నేను తెలంగాణను... మాట్లాడుతున్నాను

by Ravi |   ( Updated:2023-11-29 01:00:34.0  )
నేను తెలంగాణను... మాట్లాడుతున్నాను
X

సుమారు గత రెండు శతాబ్దాలుగా దేశ్‌ముఖ్‌లు, దేశాయిలు, జమీందారులు, జాగీదార్లు, భూస్వాములు, హత్యలు అణచివేతలు, దౌర్జన్యాలు, మానభంగాలు, హింసలు, మానవ హననం, నాటి నుంచి నేటి తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ పరివార్ పరిపాలన వరకు తెలంగాణ ఆశపడి మోసపోతూ గోస పడుతూనే ఉన్నది. అడుగడుగునా గాయపడుతూనే ఉన్నది.. ఒక అబద్ధాన్ని వందల సార్లు మాట్లాడిన నిజం కానే కాదు ఇది అక్షరాల హిట్లర్ గోబెల్ చెప్పిన రుజువులతో నిరూపితమైన అక్షర సత్యం. ఒక్కసారి ప్రజల్ని మోసం చేయవచ్చు కానీ మూడోసారి మోసానికి ప్రజలు బలి కావడానికి సంసిద్ధంగా లేరు. ఇన్ని గాయాల తర్వాత రక్తపాతాల తర్వాత కన్నీళ్లు, రక్తంతో కలగలిసి తడిసిన నేల మీద నిలబడి నా బిడ్డలారా మీ కన్నతల్లి తెలంగాణని మాట్లాడుతున్నాను. జెర మనసు పెట్టి సోయించాంయించుడ్రు.

ఏమైంది చెర్ల నీళ్లు చెరువు వెనుక పడ్డాయి అత్త మీది కోపంతో బిడ్డని కుంపట్ల ఏసుకున్నట్లయి. ఇప్పుడు ఇక తెరాస భరోసా లేనిపోని బారాసాగా మారినా నా బిడ్డల్లారా.. వీడు నమ్మించి నడి గండ్లె బొండిగె పిసుకుతాడు. కేసీఆర్ నెత్తుట్లనే మోసం, ఎత్తులు జిత్తులు, పొంచి ఉన్న గమ్మత్తులు ఉంటాయి. ఇత్తు ఒకటి పెడితే మరో చెట్టు అయితాదా? అయ్య తంతెల మీద పోతే కొడుకు కోనేట్ల పోతడు. ఇంకెందుకు? ఇంత గణం చూసినంక మనకు చింత ఎందుకు? కేసీఆర్ కుటుంబం డీఎన్ఏలోనే ఇవన్నీ ఇమిడి ఉన్నాయి గమనించి కైరత్‌గా ఉండగలరు. లేకుంటే మననెవ్వరు కాపాడలేరు. మనకు మనమే ఓదార్చుకోవాలి. సముదాయించుకోవాలి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మూకా రాగానే మన తడాఖా చూపించాలి. కేసీఆర్ తూ చూమ్ మంత్రాలకు ఓట్ల చింతకాయలు రాలవు. మంది నెత్తి మీద చేయి పెట్టడమే ఈయన సుగుణం. ఎన్ని ఇచ్చంత్రాలు.. నిన్ను చూసి కాలం ముచ్చట పడి ముక్కు మీద వేలు వేసుకుంటుంది. ఎన్ని ఇగ్మతలు పుట్టి నేర్చిండో పుట్టకముందే నేర్చిండో కానీ బహరాల్ జనం పుట్టి నట్టేట్ల ముంచిండు. గడ్డమీద నిలబడి చర్ల కొమ్ములకు బేరం చేసి భయాన తీసుకునే మోసగాడు. 2014 ముందు ఉన్న అన్ని రంగాల సబ్సిడీలను ఎత్తేసి కొత్త సీసాలో పాత సారా పథకాలను పోసి, మెదడు అనే రోలులో కలువం నూరి నూరి కొత్త పంచలేహ్యాలను తయారుచేశాడు. అవి ఒకటి ఆసరా పథకాలు, రెండు రైతుబంధు, మూడు దళిత బంధు, నాలుగు బీసీ బందు, ఐదు మంది పెళ్లి దగ్గర మంగళ హారతి పాడడం లాంటి పథకాలను కేసీఆర్ తన మాంత్రికుని సంచి నుంచి తీసి మీడియా ప్రకటనల ద్వారా ఊదరగొట్టాడు.

ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత అన్ని సంక్షేమ పథకాలను లోతుగా అధ్యయనం చేస్తే నీళ్లలో వేలు పెట్టి నోట్లే వేలు పెట్టుకున్నట్టు ఉంది దొంగ చీకటి ఒకటై దొంగే దొంగ అని అరిచినట్టుంది. ఇక తను తన కుటుంబ వర్గ సభ్యులను కాకతీయ, భగీరథ, కాళేశ్వరం మూడు నామాల నర్సింహ అవతారం ఎత్తాడు. అంతేగాక పిల్లికి ఎలుక సాక్ష్యంలా చెప్పాడు. నారాయణ నారాయణ తప్ప శివ శివ అని పుట్టుక పుట్టి దింపుడు కల్లం ఆశతో గాలిగాలోలె గాలి మోటార్లు ఎక్కి రెండు చేతుల మందికి మొక్కి, కట్టె తుపాకి రామునిలా చెరువు తూమ్ కింద పుట్టెడి బియ్యానికి మంట పెడుతుండు. వవ్హా అవ్వా సెవ్వా ఏం కాలం వచ్చింది. నూరు పర్లాలు తిన్న ఒక్క ఓటు దెబ్బకు రాబందును కింద పడగొట్టాలి. పాపం పండింది కేసీఆర్.. ఇక నిన్ను తెలంగాణ నమ్మదు, మోయదు. మీరంతా ఒక తవ్వడు ఎత్తడు మోయడు బ్యాచ్ గాళ్లు కారు. గీరలకు ఎన్నిప్యాచ్‌లు వేసినా తుస్ అనే గాలి ఇక ఆగదు. ఇక మీకు యాదగిరి గుట్ట మీదికి మెట్లు నడికే దిక్కు సక్కి. అల్లనేరేడు ఆగమ్మా వింటున్నావా తల్లి ఎంత ఫామ్ హౌస్ రోడ్డుకు మిమ్మల్ని ఎంత ఆగం చేసిండు? ఎన్ని వల్సెన్ని మాటలు మాట్లాడండి. ఎట్లనచేసి కేసీఆర్‌ను వారి పరివారాన్ని మిటాయి కొట్టియ్యిండ్రి. ఆ ఎద్దు మంచిదైతే ఆ ఆ ఊరిలోనే అమ్ముడుపోవు గదా! సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, గజ్వేల్, ఇప్పుడు కామారెడ్డి అంగట్లకు వచ్చి బర్రె పుర్రు పోసుకుంటా నిలబడ్డడు. నిండా చెడ్డడు. ఒకటా రెండా ఎడ్ల బేరం, మస్కట్ పైరవి తెలంగాణ పేర్పన ఆంధ్రోల్ల పేర్న అనేక పేర్నాలు పెట్టి నోటికి వచ్చినట్టు తిట్టి ఇప్పుడు చిలుక గూటి పలుకులు పలుగుతుండ్రు జాగ్రత్త అవినీతి గొంగట్ల ఇరుకుంటా తినుకుంటా ఎంటికలు ఏరేతుండ్రు.

అరేయ్ ఏందిరా సువ్వర్ అన్న నూటితో అన్నా తమ్మీ అయ్యా అన్నప్పుడన్నా నిన్ను గుర్తుపట్టేదుండె, అవునే ఏందే రావే పోవే అన్న నోటితో అక్కా చెల్లే అవ్వా అని దగ్గరికి అలిపించుకున్నప్పుడల్లా నిన్ను ఆవు తోలు కప్పుకున్న పులివని తరిమి కొట్టేది ఉండే. మీ నశీవ గట్లున్నది. మా తక్దీర గిట్ల ఉన్నది నీ గుల్లే మన్ను పోయా... నువ్వు దేవునివా? నువ్వు ప్రజల పన్నుల సంపదతో కట్టుకున్న ప్రగతిభవన్‌కు ప్రజలను కలువని వాడివి, అనుమతించని వాడివి నువ్వు ఇయ్యాల్ల కొమ్మ మీది కాకి నోట్లె ఉన్న ఓటు ముక్కకు మల్లోసారి ఆశపడి ఇకముందు మాంసం తిననని నక్క ప్రమాణం చేస్తున్నావు. అయినా నిన్ను నాయనా నిన్ను పోనీ అని ఇంట్లకు రానిస్తే, ఇల్లంతా నాదేనని బాపది గానివని పదేండ్లకు మాకు ఇప్పుడిప్పుడే అర్థమైతుంది. అదే చూసి చూసి చేతిలో కందులు పట్టుకొని బాయిల పడ్డట్టు అయ్యింది తెలంగాణ. తల్లీ తండ్రీ.. జెరా కల్వకుంట్ల నాటకానికి తెరదించుండ్రి. శరణు శరణు నీకు వేములాడ రాజన్నా కొమురెల్లి మల్లన్నా కొండగట్టు వీరన్నా అడవి వీర మాతలు సమ్మక్కా సారక్కా యాద్గిరి మూడు నామాల నర్సన్నా.. మల్లచ్చే సోమారం మీ దగ్గరికి వచ్చి మీ మొక్కులు చెల్లించుకుంటం. కొత్త బట్టల కట్టిన ముడుపులు తీర్చుకుంటాం. దయవుంచుండ్రి. కరుణించుండ్రు.

-జూకంటి జగన్నాథం

కవి, రచయిత

94410 78095

Advertisement

Next Story

Most Viewed