ఇది నిరుద్యోగుల విజయం!

by Ravi |   ( Updated:2023-12-05 00:15:12.0  )
ఇది నిరుద్యోగుల విజయం!
X

రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత పాత్ర మరువలేనిది. స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే వస్తాయని అప్పటి ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ విద్యార్థులు, యువతలో భారీగా ఆశలు రేకెత్తించారు. కానీ రాష్ట్రం ఆవిర్భవించాక, కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా, ఈ తొమ్మిది సంవత్సరాల అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగార్ధులు అనేక రూపాల్లో అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా సమయానికి ఉద్యోగ ప్రకటనలు రాకపోవడం, నియామకాలు తరుచూ కోర్టు కేసులతో ఆగిపోవడం, టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు లీకేజీ కావడం వంటివి యువతను విస్మయానికి గురిచేసింది. మరోవైపు టీఎస్పీఎస్సీ పారదర్శకత విషయంలో యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసినా, ప్రభుత్వం కంటితుడుపు చర్యలకే పరిమితమయింది. అంతేకాకుండా ప్రభుత్వంలోని అగ్రశ్రేణి మంత్రులు, ఎమ్మెల్యేలు నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం, చులకన చేసి మాట్లాడారు. దీంతో నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య అంతరాలు పెరిగాయి. యువత నైరాశ్యంలోకి వెళ్లింది. దీంతో ఇన్నాళ్లు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ప్రజలు సైతం మార్పు కావాలని కోరుకున్నారు. ఇదే అంశం అధికార పార్టీ పరాజయానికి కారణమైనదని మేధావి వర్గాల అంచనా.

ఉద్యోగులు సైతం..

గతేడాది మార్చిలో 80,039 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి నిరుద్యోగుల ఓట్లు కొల్లగొడుదామనుకుంది బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నియామకాల ప్రక్రియను కీలక మలుపు తిప్పింది. దీని తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు నిరుద్యోగుల అంశంపై గళమెత్తాయి. అనంతర పరిణామాలతో బీఆర్ఎస్ పట్ల నిరుద్యోగ యువతలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో ఆ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకొనేందుకు కేటీఆర్ అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఉద్యోగార్థులను కలిసి గాలం వేసే ప్రయత్నం చేశారు. కానీ అవేవి నమ్మకుండా నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీలకే ఓటు వేయాలని తల్లిదండ్రులను తమ కుటుంబ సభ్యులతో అభ్యర్థించారు. ఓటుతో తమ బిడ్డల జీవితాలను చక్కదిద్దుకోవాలని ఆలోచించారు.

అలాగే ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర' కూడా యువతను మరింత ఆలోచింపజేస్తున్నది. దీనికి కాంగ్రెస్ నాయకత్వం వహించడం మరింత బలాన్ని చేకూర్చింది. ఈ యాత్ర దాదాపు గ్రాడ్యుయేట్లు 25 లక్షల మందికి చేరిందని అంచనా! ఈ గెలుపుకి కారణంగా, మెజారిటీ నిరుద్యోగ యువత, వారి కుటుంబాలు ఓట్లు కాంగ్రెస్ గెలుపుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మెజారిటీ నిరుద్యోగ యువత, వారి కుటుంబాలు ఓట్లు కాంగ్రెస్ గెలుపుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌కే పట్టం కట్టడానికి..

తెలంగాణ యువత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుకున్నది. అంతేకాకుండా వివిధ క్యాటగిరిలో పోస్టుల సంఖ్యను పెంచడం, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లాంటివి ప్రధాన డిమాండ్లుగా యువత అన్ని రాజకీయ పార్టీల ముందుంచాయి. దీనికనుగుణంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలతోపాటు బిఆర్ఎస్ పార్టీ సైతం బలమైన వాగ్దానాలతో ముందుకు వెళ్లాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ ప్రకటన తేదీతో సహా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇలాంటి అనుకూల ప్రకటనలు ఉద్యోగార్దుల్లో నూతన ఆశలు రేకెత్తించాయి. ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీలన్నీ నిరుద్యోగుల అంశాన్ని ఎత్తుకున్నప్పటికీ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత భరోసా మిగతా పార్టీలు ఇవ్వలేకపోయాయి. యువతలోని అసహనానికి మార్పుకు ఇది సంకేతం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు. దీన్ని ప్రతి నాయకుడు గుర్తించాలి. దీనికి అనుగుణంగా నూతనంగా ఏర్పడే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడాలి. వారు ప్రకటించిన హామీలను సరిగ్గా అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. ముఖ్యంగా ఉద్యోగ నియమకాలతో యువతను సమర్ధ మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరగాలి. అప్పుడే వారిని ప్రజలు విశ్వసిస్తారు.

సంపతి రమేష్ మహారాజ్,

79895 79428

Advertisement

Next Story

Most Viewed