మరోకోణం:రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?

by D.Markandeya |   ( Updated:2022-09-27 10:00:47.0  )
మరోకోణం:రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?
X

తెలంగాణలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్, 21న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరస మీటింగులతో ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ తన ప్రసంగంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. కమలం పార్టీ దేశానికి ఒక్క మంచి పని చేయలేదని, అన్నీ అమ్ముకుంటూ పోతున్నదని, అంతా మాయామశ్చీంద్ర చేస్తున్నదని విమర్శించారు. ఎనిమిదేళ్ల తెలంగాణకు కేంద్రం ఇచ్చింది శూన్యమన్నారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలోనే లేదన్న సంకేతాలిస్తూ ఆ పార్టీకి వేసిన ఓట్లు గంగలో కలిసినట్లేనని హెచ్చరించారు.

ఆయనదీ అదే దారి

ఆ మరునాడు వచ్చిన అమిత్ షా సైతం కేసీఆర్‌పైనే నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. దళితుడికి సీఎం పదవి ఏమైందని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారని, లక్షలలో ఉద్యోగాలని చెప్పి తన కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. రాజగోపాలరెడ్డి చేరికను రానున్న కాలంలో కేసీఆర్ సర్కారును తరిమికొట్టడానికి చేసే పోరాటంలో మొదటి మెట్టుగా అభివర్ణించారు. మునుగోడులో గెలువగానే ఇక్కడి అవినీతి సర్కారును నలిపేస్తామని, బీజేపీని అధికారంలోకి తెస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనే తీసుకురాలేదు.

వారి మధ్యనే అసలు పోరు

ఈ రెండు సభల తర్వాత రాష్ట్రంలో అధికారం కోసం ప్రధానంగా టీఆర్ఎస్ X బీజేపీల మధ్యే పోరు జరుగుతోందన్న భావన సర్వత్రా ఏర్పడింది. ఓవైపు బండి సంజయ్ పాదయాత్ర, రాజాసింగ్ ఎపిసోడ్, మరోవైపు ఈడీ, సీబీఐ, ఐటీ రంగప్రవేశం ఇందుకు మరింత దోహదపడ్డాయి. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఏ గల్లీలో, ఏ బస్తీలో చూసినా ఈ రెండు పార్టీల మధ్య కొట్లాట గురించే వినిపిస్తోంది. మేధావులు, విద్యావంతుల నుంచి మొదలుకొని రైతులు, మధ్యతరగతి వర్గాల వరకూ ఇదే చర్చించుకుంటున్నారు.

చారిత్రకంగా వామపక్ష, ఉద్యమ భావజాలం కలిగిన తెలంగాణ ప్రజానీకం మతవాద బీజేపీని ఎట్టి పరిస్థితులలోనూ అక్కున చేర్చకోరన్న వాదన క్రమంగా బలహీనపడుతున్నది. కేసీఆర్ కుటుంబాన్ని ఢీకొనగల సత్తా ఒక్క కమలనాథులకే ఉందన్న అభిప్రాయం బలపడుతున్నది. మీడియాలో సైతం నిత్యం అయితే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు, నేతలకు సంబంధించిన, వారి మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన వార్తలే బ్యానర్లుగా, ముఖ్యవార్తలుగా దర్శనమిస్తున్నాయి. అంతర్గత కీచులాటలతో తప్ప కాంగ్రెస్ అసలు సీన్‌లోనే లేకుండాపోయింది.

ఇందుకు కారణం అదే

ఈ పరిస్థితి ఏర్పడడానికి టీఆర్ఎస్, బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలే కారణం. దక్షిణ భారతంలో, ప్రత్యేకించి తెలంగాణలో పాగా వేయాలని లక్ష్య నిర్దేశం చేసుకున్న కమలనాథులు ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా మారడం ద్వారా తమ జాతీయ ప్రధాన శత్రువు కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టి కోలుకోలేని దెబ్బతీయడం వారి మొదటి టార్గెట్. అన్ని పరిస్థితులూ అనుకూలించి కేసీఆర్‌ వ్యతిరేక ఓటింగ్ అంతా తమ పార్టీ వైపు మళ్లితే ఏకంగా అధికారాన్నే దక్కించుకోవడం రెండవ టార్గెట్.

ఒకవేళ ప్రజలు మరోసారి కేసీఆర్‌కే పట్టం కట్టినా ఆ పార్టీకి జరిగే నష్టం ఏమీలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ తదుపరి ఎన్నికలలో చాన్స్ కోసం ఎదురు చూస్తుండవచ్చు. అంతిమంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలు బీజేపీ, టీఆర్ఎస్‌ ఖాతాలో మాత్రమే పడేలా, కాంగ్రెస్‌ అవమానకర ఓటమి పొందేలా చేయడమే ఆ పార్టీ థింక్ టాంక్ అసలు ప్లాన్. కేంద్రంలో రేపు తమకు మెజారిటీకి అవసరమైన స్థానాలు దక్కని పక్షంలో ఎన్డీయే బయట ఉన్న పార్టీల సహకారం తీసుకునే స్వేచ్ఛ ఆ పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. గతంలో మాయావతి బీఎస్పీ, మమత తృణమూల్ మద్దతును తీసుకున్న విషయం మనం మర్చిపోకూడదు. ఈ ప్రకారం రేపు అవసరమైన పక్షంలో టీఆర్ఎస్‌ను ఎన్డీయేలో కలుపుకున్నా ఆశ్యర్యపోనక్కర్లేదు.

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా

రాష్ట్రంలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ బదులుగా బీజేపీయే ఉండాలని కేసీఆర్ కూడా మొదటినుంచీ చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ ఎదుగుదల వెనక ఆయన పరోక్ష సహకారం చాలా ఉంది. తన రెండు దఫాల పాలనలో ఆయన కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. తను మాట్లాడిన ప్రతి సభలో, మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వేలాది ఛోటా, బడా నేతలను 'ఆపరేషన్ ఆకర్ష్' పేరిట పార్టీలో చేర్చుకున్నారు.

పలువురు ఎమ్మెల్యేలకు ఎర వేసి చివరకు ఏకంగా సీఎల్పీనే విలీనం చేసుకున్నారు. మరోవైపు, మోడీ-షా ద్వయంతో, కేంద్రంతో సఖ్యంగా ఉన్నారు. మోడీ పాలనను పలు సందర్భాలలో మెచ్చుకున్నారు. చట్టసభలలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు, 2017 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించారు. కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిని వెంటిలేటర్‌పై ఉందనుకున్న పరిస్థితులలో 2021లో హుజూరాబాద్ ఉపఎన్నిక నుంచి ఆయన ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్‌ను వదిలి బీజేపీపై పడ్డారు. వడ్ల కొనుగోలు అంశంతో ప్రారంభించి సమర శంఖం పూరించారు. వచ్చే ఎన్నికలలో తన ప్రత్యర్థి కాషాయపార్టీయే అన్న రీతిలో ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.

అంతా రాజకీయమే

కేసీఆర్ ఇలా వైఖరి మార్చడం వెనకాల ఆయన చాణక్య నీతి దాగివుందని చెప్పవచ్చు. బీజేపీని ప్రధాన శత్రువుగా ప్రమోట్ చేయడం ద్వారా ఆయన రెండు ప్రయోజనాలను కోరుకుంటున్నారు. ఒకటి, కాంగ్రెస్‌ను అనివార్యంగా తనకు తోకపార్టీగా మార్చుకోవడం. రేపు ఎన్నికలలో మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువ వచ్చిన పక్షంలో ఆయన ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ సహకారాన్ని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ స్థానాలు వచ్చినా ఎలాగూ ఆ పార్టీ బీజేపీతో కలవలేదు కనుక అనివార్యంగా గులాబీ దళానికే మద్దతు ప్రకటించాల్సి వస్తుంది.

రెండు, ఓటర్లలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఉంది కనుక తను బీజేపీపై దాడి చేయడం ద్వారా ఆ వ్యతిరేకతను దారి మళ్లించవచ్చు. టీఆర్ఎస్ ఓటింగ్‌పై పడకుండా చూసుకోవచ్చు. అన్ని సమస్యలకు మోడీయే కారణమని, రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తున్నారని, లేదంటే తాను ప్రజలను పువ్వులలో పెట్టి చూసుకోగలనని ఆయన చెప్పవచ్చు. మునుగోడు సహా కేసీఆర్ ఇటీవల చేస్తున్న అన్ని ప్రసంగాలూ మనకు ఈ విషయాన్నే తెలియజేస్తాయి.

వీరు కలహాలు వీడుతారా?

విడ్డూరమేమంటే తమ స్వప్రయోజనాల కోసం టీఆర్ఎస్, బీజేపీ అనుసరిస్తున్న ఈ గేమ్‌ప్లాన్‌కు కాంగ్రెస్ చాలా చురుగ్గా సహకరిస్తున్నది. ఏ మాత్రం సోయి లేకుండా రాష్ట్రంలో పార్టీని నాశనం చేసే కార్యక్రమాన్ని సీనియర్, జూనియర్ నేతలు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నిత్యం అంతర్గత కలహాలతో బిజీగా ఉంటున్నారు. 'నవ్వితే నాకేంటి సిగ్గు' అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.ఓవైపు మునుగోడు బైపోల్ రాజకీయం హీటెక్కుతుంటే ఏమీ పట్టనట్లుగా సొంతపార్టీ నేతలను తూలనాడుతూ బజారుకెక్కుతున్నారు.

తాను మునుగోడు ప్రచారానికి వెళ్లనని రాజగోపాలరెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తి పంచాయితీ ఢిల్లీ చేరింది. దాదాపు సీనియర్లందరూ ఆయన సారథ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. అతిత్వరలో నాయకత్వ మార్పు ఉంటుందన్న గుసగుసలూ హైకమాండ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. మరోవైపు, జాతీయపార్టీకి అధ్యక్షుడు ఎవరో ఇంకా తేలలేదు. తెలంగాణకు ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను మార్చుతారని, ప్రియాంకకు బాధ్యతలు ఇస్తారంటున్నారు. ఈ పరిణామాలన్నింటితో మునుగోడు సంగతి కాదు కదా, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికలలో అధికారం సాధించాలంటే ఏం చేయాలన్న విషయాన్ని పట్టించుకునే నాథుడే ఆ పార్టీలో కరువయ్యారు.

కొసమెరుపు

మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుంది? రెండవ స్థానం ఎవరికి దక్కుతుంది? సిట్టింగ్ సీటులో కాంగ్రెస్ తన గౌరవాన్ని నిలుపుకుంటుందా? లేక డిపాజిట్ గల్లంతవుతుందా? మునుగోడు సీన్ రేపటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా రిపీట్ కానుందా? వేర్వేరు వైపుల నుంచి టీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న దాడులకు కాంగ్రెస్ బలవక తప్పదా? రెండు పార్టీల దెబ్బలకు టార్గెట్ ఒక్క పిట్టేనా? కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది? ఆ పార్టీ నేతలు ఇకనైనా మారుతారా? చూడాలి.

డి. మార్కండేయ

[email protected]

Also Read : బీజేపీలోకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే? న్యూజిలాండ్‌లో సెటిల్మెంట్

Advertisement

Next Story