కామన్ మ్యాన్ డైరీ: సామాన్యుడిని కోటిశ్వరుడిని చేసిన రాత్రి బడి!

by Ravi |   ( Updated:2022-10-03 18:45:57.0  )
కామన్ మ్యాన్ డైరీ: సామాన్యుడిని కోటిశ్వరుడిని చేసిన రాత్రి బడి!
X

అక్షరం ముక్క రాని రాములుకు రాత్రి బడి బలపం పట్టించింది. ఏదైనా చేయాలన్న తపన సముద్రాలను దాటించింది. యుక్తిని ప్రదర్శించిన రాములు పట్టిందల్లా బంగారమైంది. రియల్ ఎస్టేట్ రంగం రాములును అందలం ఎక్కించింది.

మెదక్ జిల్లా రామాయంపేట ప్రాంతానికి చెందిన రాములు గొర్రెలు కాస్తూ జీవనం సాగించేవాడు. చిన్నప్పటి నుంచి రాములుకు జీవాల సంరక్షణ మాత్రమే తెలుసు. బడికి వెళ్లలేదు. అక్షరం ముక్క రాదు. అంతలోనే గల్లీలో రాత్రి బడి ప్రారంభమైంది. ఊరి శివారులో మందను విడిచిపెట్టి ఇంటికి వచ్చేవాడు. తోటి కాపరులతో కలిసి రాత్రి బడికి వెళ్లేవాడు. మూడు నెలలలో రాయటం, చదవటం నేర్చుకున్నాడు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన సుశీలతో పెండ్లయింది.

సుశీల అన్న బీరయ్య సౌదీలో ఉంటున్నాడు. చెల్లెలు పెండ్లి చేసేందుకు ఇండియా వచ్చాడు. పెళ్లి తంతు పూర్తయింది. బావమర్ది డాబు, దర్పం చూసిన రాములుకు తానూ సౌదీ వెళ్లాలని, బాగా సంపాదించాలనే మనసైంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ససేమిరా వద్దన్నారు. '200 జీవాలున్నయి మనకు, దూరదేశం పోయి బతుకుడు అవసరమా? అంటూ పేచీ పెట్టారు. సుశీల కూడా వద్దంటూ మారాం చేసింది.

*

రాములుకు మాత్రం సౌదీ వెళ్లాలనే తపన వెంటాడుతున్నది. బావమరిదికి లెటర్ రాశాడు. వీసా ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. భార్యను ఒప్పించాడు. వీసా కోసం లక్ష రూపాయలు అవసరమయ్యాయి. జీవాలను అమ్మితే రెండు లక్షలు వచ్చాయి. లక్ష వీసాకు చెల్లించాడు. తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా రియాద్ ఫ్లయిట్ ఎక్కేశాడు. అక్కడ గొర్రెల కాపరిగా జాయిన్ అయ్యాడు. తనకు వచ్చిన పనే కావడంతో ఈజీగానే చేస్తున్నాడు. ఊరికి దూరంగా ఉండటంతో ఒంటరి జీవితాన్ని అనుభవించాడు. ఒక్కోసారి తినేందుకు తిండి కూడా ఉండేది కాదు. వారానికి ఓ సారి సిటీకి రావడం, సరిపడా సరుకులు కొనుక్కోవడం, మళ్లీ మంద దగ్గరకు వెళ్లడం చేస్తుండేవాడు.

సూపర్ మార్కెట్‌లో పనిచేసే బావమరిదిని వారానికి ఓసారి కలిసేవాడు.నెలనెలా ఇంటికి డబ్బులు పంపుతున్నాడు. పొదుపు కూడా చేస్తున్నాడు.మూడేళ్లు దాటింది. స్వదేశానికి రావాలనే తపన కలిగింది. యజమానిని కలిసి మూడు నెలల కోసం ఇంటికి వెళ్లొస్తానని అడగడంతో ఆయన అంగీకరించాడు. స్వదేశానికి వెళ్తున్నట్టు సౌదీలో ఉంటున్న తన మిత్రులకు, బావమరిది స్నేహితులకు చెప్పాడు. తమ వారి కోసం కొందరు డబ్బులు పంపారు. కొందరు వాచీలు, సెల్‌ఫోన్లు ఇలా చాలా సామగ్రి పంపారు. అన్నింటినీ తీసుకొని స్వగ్రామంలో వాలిపోయాడు.

*

అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం మండల కేంద్రాలకు పాకుతున్నది. డబ్బున్నవారు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఎకరా లక్షరూపాయలే పలుకుతుండటంతో తాను తెచ్చిన ఐదు లక్షలలో నాలుగు లక్షలు పెట్టి నాలుగెకరాల జాగా కొన్నాడు. ఈ విషయం సౌదీలో ఉన్న తన మిత్రులకూ చెప్పాడు. వాళ్లు పంపిన సామగ్రి ఓపికగా వారి వారి ఊళ్లకు వెళ్లి ఇచ్చేశాడు. దీంతో అందరి కుటుంబాలతో సాన్నిహిత్యం ఏర్పడింది. మరో మారు రియాద్ వెళ్లాడు రాములు. రెండేళ్లు పనిచేసి స్వదేశం చేరాడు. ఊరు బాగా డెవలప్ అయ్యింది. తాను నాలుగు లక్షల రూపాయలు పెట్టి కొన్న జాగా కాస్తా కోటి రూపాయలకు చేరింది. రాములు ఆనందానికి అవధులు లేవు.రెండెకరాలు అమ్మేశాడు.

మండల కేంద్రానికి సమీపంలో ఎకరం జాగా కొన్నాడు. చిన్నగా ఓ వెంచర్ ఏర్పాటు చేశాడు. ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఖర్చులు పోను కోటి రూపాయల వరకు మిగిలాయి. ఈ విషయాన్ని సౌదీలో ఉంటున్న తన మిత్రులతో షేర్ చేసుకున్నాడు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతున్నదని, మీరు పెట్టుబడి పెట్టాలని సూచించాడు. రాములును మధ్యవర్తిగా పెడుతూ దాదాపు ఓ పది మంది జాగాలు కొన్నారు. బేరం కుదిర్చినందుకు రాములు కమీషన్ కూడా తీసుకున్నాడు.

*

పట్టిందల్లా బంగారం అవుతుండటంతో రాములు ఆనందానికి అవధులు లేవు. రాములు స్థలం అమ్మాడంటే గ్యారెంటీ. ఎలాంటి చిక్కులు ఉండవన్న పేరు సంపాదించాడు. నాలుగు వెంచర్లు ఏర్పాటు చేశాడు. అన్ని సైట్ల వద్దకు వెళ్లేందుకు ఓ ఇన్నోవా కారు కొన్నాడు. డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. లెక్కలు ఇతర వ్యవహారాలు చూసేందుకు డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు కుర్రాళ్లను పెట్టుకొని ఏకంగా ఆఫీసు తెరిచాడు. డీటీసీపీ పర్మిషన్లు, న్యాయపరమైన చిక్కులు ఏవైనా తలెత్తితే వాళ్లే చూసుకుంటున్నారు. మండలంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు గాంచాడు.

రాములు దృష్టి మెల్లిగా రాజకీయాల వైపు మళ్లింది. స్థానిక ఎమ్మెల్యేకు మచ్చికయ్యాడు. డబ్బున్నవాడు కావడంతో ఎమ్మెల్యే సైతం చేరదీశాడు. వెన్నంటే ఉంటుండటంతో ఎమ్మెల్యేకు రాములుపై నమ్మకం పెరిగింది. మార్కెట్ కమిటీకి చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. అనంతరం 500 గజాల స్థలంలో ఓ అందమైన బంగళా కట్టుకున్నాడు. పిల్లలను హైదరాబాద్‌లోని కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాడు. వారానికి ఓసారి సుశీల, రాములు హైదరాబాద్​ వెళ్లొస్తున్నారు. కొంచెం తెగువను ప్రదర్శించిన రాములు ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. రాములుతో గొర్రెలు కాసిన బీరయ్య, కిష్టయ్య ఎప్పటిలాగే రోజు మందల దగ్గరికి వెళ్తున్నారు.


ఎంఎస్ఎన్ చారి

79950 47580

Advertisement

Next Story

Most Viewed