- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరుగుతున్న నిరుద్యోగం తరుగుతున్న అవకాశాలు..
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ (పీపీపీ) లెక్కలను బట్టి 3.36 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. గణనీయంగా పెరుగుతున్న భారతీయ మధ్య తరగతి వృద్ధి వినియోగంలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది అంతర్జాతీయ కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం 2027 నాటికి అమెరికా, చైనా దేశాల తరువాత మనదేశం మూడో స్థానానికి చేరుకోవచ్చు.
అయితే ఉత్సాహం ఉరకలెత్తే యువత చోదకశక్తిగా ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రధాన లబ్ధిదారు భారతదేశమేనని విశ్లేషిస్తున్నారు. అయితే భారత్ నిలకడగా అభివృద్ధి సాధించాలంటే నిరుద్యోగం, క్రమంగా తగ్గిపోతున్న యువ జనాభా అనే రెండు ప్రధాన అవరోధాలను సమర్ధవంతంగా అధిగమించాల్సి ఉంటుంది.
నిరుద్యోగ కోరల్లో యువత
పారిశ్రామిక వృద్ధిని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలను సృష్టించడం, దిగుమతిపై ఆధారపడటం తగ్గించ డం, జీడీపీ వృద్ధి రేటును పెంచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదం చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండి యా" ఉపాధి కల్పనలో అనుకున్నంతగా సఫలం కాలేదనే చెప్పాలి. ప్రతి సంవత్సరం భారతదేశ కార్మిక మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న లక్షలాది మంది యువకులకు తగిన ఉద్యోగాలు సృష్టించడం దేశ నాయకత్వానికి అతి పెద్ద సవాలుగా మారింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ)లు సంయుక్తంగా రూపొందించిన తాజా నివేదిక ప్రకారం 2011లో 61 శాతంగా ఉన్న శ్రామిక జనాభా, 2021 నాటికి 64శాతానికి చేరిందని, ఇది 2036 నాటికి 65శాతానికి పెరగొచ్చని అంచనా వేశారు. దేశంలోని ప్రతి ముగ్గురు యువకులలో ఒకరికి విద్య, ఉద్యోగం లేదా నైపు ణ్య శిక్షణ లేదని ఇది వెల్లడించింది. పాఠశాల విద్య లేని వారి కంటే ఉన్నత విద్యావంతులైన యువకులలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని, చదవడం, రాయడం రానివారిలో నిరుద్యోగిత రేటు 3.4 శాతం ఉంటే, పట్టభద్రులలో నిరుద్యోగిత రేటు 29.1 శాతంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది.
నైపుణ్యలేమి అసలు అడ్డంకి!
నైపుణ్యాల లేమి, నాణ్యమైన ఉద్యోగాలు లేకపోవడం వల్ల 2022-23లో 15-29 ఏళ్ల మధ్య ఉన్న పట్టణ యువతలో దాదాపు 16% మంది నిరుద్యోగులుగా మిగిలారని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ డేటా చూపిస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఏకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం యువత నిరుద్యోగ రేటు 45.4% వరకు ఉంది. సీఎంఐఈ సర్వే ప్రకారం, భారత్‌లో నిరుద్యోగిత రేటు 2024 మే నెలలో 7 శాతం నుండి 2024 జూన్ నాటికి 9.2 శాతానికి పెరిగింది. దేశంలోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ భారతదేశంలో కూడా నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. పట్టణ నిరుద్యోగిత రేటు మేలో 8.6 శాతం నుంచి జూన్‌లో 8.9 శాతానికి పెరిగితే, గ్రామీణ నిరుద్యోగిత రేటు 6.3 శాతం నుంచి 9.3శాతానికి పెరిగింది. లేబర్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్పీఆర్) జూన్‌లో 40.8శాతం నుండి 41.4 శాతానికి పెరగడం, ఉపాధి రేటు 38 శాతం నుండి 37.6 శాతానికి తగ్గడంతో నిరుద్యోగిత రేటు పెరిగింది. దేశంలో నిరుద్యోగిత రేటు విద్యా స్థాయితో పెరుగుతోందని ఐఐఎం లక్నో అధ్యయనంలో కూడా వెల్లడైంది. 2020-21లో నిరక్షరాస్యులు, ప్రైమరీ కంటే తక్కువ చదువుకున్న యువతలో (15-29) నిరుద్యోగ రేటు వరుసగా 0.57%, 1.13% కాగా, ఉన్నత విద్యావంతులలో 14.73% శాతం నిరుద్యోగిత ఉందని తేల్చింది. ప్రస్తుతం శ్రామిక శక్తిలో 35శాతం ఉన్న మహిళా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలి. దేశం శ్రామిక శక్తిలో కొనసాగుతున్న లింగ ఆధారిత అసమానతను వీలైనంతగా తగ్గించాలి.
తరగనున్న యువశక్తి
స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సగటు ఆయుర్దాయం దాదాపు రెట్టింపు కాగా, జనాభా నియంత్రణ తదితర చర్యలతో సం తానోత్పత్తి రేటు తగ్గి బాలబాలికల సంఖ్య తరిగిపోతోంది. కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ప్రకారం, 2021లో దేశ జనాభా లో పదిహేనేళ్ల లోపు వారు సుమారు 26 శాతం ఉంటే, 2036 నాటికి వారు 20.1 శాతానికి తగ్గనున్నారు. కాగా అదే సమ యంలో 60 ఏళ్లకు పైబడిన పురుషులు 9.5శాతం నుంచి 13.9శాతానికి, మహిళ లు 10.7 శాతం నుంచి 16 శాతానికి పెరగనున్నారు. 2036 నాటికి దేశంలో బాలబాలికల సంఖ్య తగ్గిపోయి, అరవై ఏళ్లు పైబడిన వారు అధికమవుతారని ఈ నివే దిక వెల్లడించింది. దేశీయ ఉత్పాదకత, సంక్షేమ వ్యయం, కుటుంబ పోషణలపై అత్యంత తీవ్ర ప్రభావం చూపే పరిణామమిది. ఈ పరిస్థితిని అధిగమించడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తక్షణం ప్రారంభించాలి.
పరిష్కారాలు..
దేశ విద్యా విధానం ఆధునిక ప్రపంచ అవసరాలకు తగినట్లు మారనందువలన విద్యా ర్థులు ఆచరణాత్మక నైపుణ్యాలు లేకుండానే ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించి భంగపడుతున్నారు. వచ్చే ఐదేళ్లలో 14.8కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉందని నిపుణులు అంటు న్నారు. ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ఇటీవలి బడ్జెట్‌లో కేంద్రం కేటాయించిన రూ.2లక్షల కోట్లను సద్వినియోగం చేసే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇంటర్న్‌షిప్, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి యువతను నేరుగా పరిశ్రమలో చేరేందుకు అనువైన నిపుణ మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. భారత్ వృద్ధిరేటు స్థిరంగా కొనసాగుతున్నా ఉద్యోగ కల్పనలో వెనుకపడింది. కాబట్టి కొలువుల సృష్టికి దోహదపడే తయారీ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉపాధి కల్పనలో, ఆర్థికాభి వృద్ధిలో కీలకపాత్ర పోషించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించే విధంగా ప్రభుత్వం విధానాల రూపకల్పన చేయాలి. నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి. ఉపాధి వెతుక్కుంటూ యువత వలస బాట పడుతుండగా గ్రామాల్లో వయోవృద్ధులు ఎక్కు వగా నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడం ద్వారా దీన్ని నివారించి, యువత వలసలను అరికట్టవచ్చు. నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా యువత సామర్ధ్యాలను సద్వినియోగం చేసుకుంటే సమ్మిళిత అభివృద్ధి ద్వారా"వికసిత్ భారత్" సాధన అసాధ్యమేమీ కాదు!
- లింగమనేని శివరామ ప్రసాద్
79813 20543