కన్నుమూసిన ఉద్యమకారుడు

by Ravi |   ( Updated:2024-09-07 01:00:51.0  )
కన్నుమూసిన ఉద్యమకారుడు
X

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా జిట్టా బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణకు ఉద్యమ జోహార్లు.

జిట్టా బాలక్రిష్ణ భువనగిరి కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడంతో పాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. నాటి టిఆర్ఎస్ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 2009లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత జగన్ వైసీపీ‌లో పని చేశారు. యువ తెలంగాణ పార్టీ స్వయంగా ఏర్పాటు చేసి కొంతకాలం పనిచేసిన తర్వాత బీజేపీలో విలీనం చేశారు. తర్వాత బీఆర్ఎస్.. ఇలా నిలకడ లేని రాజకీయ మూలంగానే ఎక్కడ కూడా ఆయనకు సరైన చట్టసభలో ప్రాతినిధ్యం దక్కలేదని భువనగిరి ప్రాంతంలో నేటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. ఒక ఉద్యమకారుడుగా ఆయనకు ఇవ్వాల్సినటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఆయా పార్టీలలో ఇవ్వకపోవడం కొంత ఆయనకు రాజకీయంగా నష్టం జరిగిందని చెప్పాలి.

మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర

ఉద్యమ కాలంలో భువనగిరి ప్రాంతంలో నయిమ్ గుండాలను ఛేదించుకుంటూ తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోవడంలో జిట్టా పాత్ర అమోఘమైనది. ఉద్యమకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఒక భరోసాను ఇవ్వడంలో జిట్టా ముందంజలో ఉండేవాడు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో ఆయన పాత్ర కీలకమే. ఉమ్మడి జిల్లాలో నాటి టిఆర్ఎస్‌కు అన్నీ తానై వ్యవహరించారు.

యువతను ఆకర్షించిన నేత

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో నాడు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న గ్రామాల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి సొంతంగా ఆయన డబ్బులతో వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్లను ఏర్పాటు చేయించి ప్రజలకు అండగా ఉన్నారు. భువనగిరి ప్రాంతంలో యువతను పెద్ద మొత్తంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో ఆయన ముందంజలో ఉండేవాడు. భువనగిరి ప్రాంతంలో తెలంగాణ గాన కోకిల బెల్లి లలితతో పాటు అనేకమంది ఉద్యమకారులు తెలంగాణను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకు వెళ్లారు. బెల్లి లలితక్క స్తూప ఆవిష్కరణ గాని, ఆమె విగ్రహాన్ని గానీ కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయకపోవడం అటువైపుగా ప్రభుత్వాలు ఆలోచించకపోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.

దిక్కులేని మరణాలు

తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం గుర్తింపు చట్టసభల్లో అవకాశంతో పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమం కోసం అసువులు బాసినటువంటి అమరవీరులకు స్తూపాలను కానీ వారి విగ్రహాలను గాని ఏర్పాటు చేసి వారికి సరైన గౌరవం ఇచ్చి వారిని స్మరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమకారులకు కొంత గౌరవం ఇచ్చిన వాళ్లం అవుతాం గనక అటువైపుగా పాలకపక్షం ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి మాట్లాడి వారికి ఇచ్చిన హామీలను వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యతను మర్చిపోకూడదు. శుక్రవారం అనారోగ్యంతో అసహజ మరణం పొందిన జిట్టా బాలకృష్ణకు వినమ్ర నివాళులు...

వేముల గోపీనాథ్

తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు

96668 00045

Advertisement

Next Story