పరీక్షలు విద్యార్థులకేనా..! ఒత్తిడి తగ్గించుకోవడమెలా?

by Ravi |   ( Updated:2023-03-13 18:45:47.0  )
పరీక్షలు విద్యార్థులకేనా..! ఒత్తిడి తగ్గించుకోవడమెలా?
X

ప్రభుత్వాలకు పరీక్షా కాలానికి ఇంకా ఏడాది ఉంది. కానీ ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కాలం చేరువైంది. ఈ సంక్లిష్ట సమయంలోనే పిల్లలు ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే పాలకులు, అధికారులు, తల్లిదండ్రులు విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గించేలా మూలాలను వెతికి, ఆత్మహత్యలు పునరావృతం కాకుండా చూడాలి. ఇటు ప్రభుత్వాలు సైతం పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. పదిహేను ఏళ్ల పాటు చదివిన చదువును తూకం వేసే సమయమిదే. నాడు నాటిన జ్ఞాన విత్తనం నేడు వృక్షమై ఫలాన్నిస్తుంది. కానీ జామ విత్తనం వేసి మామిడి పండ్లను ఆశించడం దుర్లభం. అన్ని తరగతులకు వార్షిక పరీక్షలు అయితే, పదో తరగతికి, ఇంటర్ విద్యార్థులకు మాత్రం ఇవి బోర్డు పరీక్షలు. నేటి విద్యార్థులకు రేపటి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ పరీక్షలే కాబట్టి వారు ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్షా కాలం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ భరించలేకపోతున్నారు. చదివింది గుర్తుకు రావటం లేదనీ, మర్చిపోతున్నాం అంటూ టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఇంటర్ విద్యార్థుల ఫోన్ల వెల్లువ పెరిగిపోతుంది. ఇదీ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. గత అక్టోబర్ నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60 వేల ఫోన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో అత్యధికులకు పరీక్షలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత మానవ సంబంధాలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి.

టెన్షన్ అందరికీ ఉండేదే..

తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఇంటర్, పది పరీక్షలు మొదలవనున్నాయి. ఈ పరీక్షల్లో లక్షల్లో విద్యార్థులు హాజరవ్వనున్నారు. అయితే ఈ పరీక్షలకు టెన్షన్ గా ఫీలయ్యి టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేస్తున్న వారు 90 శాతం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. పరీక్షల ఒత్తిడి ఒక వైపైతే, ఆ తర్వాత ఉండే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్లలో అర్హత సాధిస్తామా! మంచి ర్యాంకు వస్తుందా లేదా! అనే ఒత్తిడి చాలామందిలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు తల్లిదండ్రులు.. విద్యార్థుల స్థాయిని తెలుసుకోకుండానే వారికి భారీ ఫీజులు చెల్లించి కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించడంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని తెలుస్తుంది. ఈ పరీక్షల ఆందోళన ఒత్తిడి అనేది మనం వండుకునే వంటల్లో ఉప్పు లాంటిది. ఉప్పు వేయకపోతే కూరకు అసలు రుచి ఉండదు. అదే కొంచెం ఎక్కువైనా.. తినడానికి పనికిరాదు. ఈ టెన్షన్ అతిగా పెంచుకుంటూ పోతే దాని ప్రభావం మన శరీరం, మనసు మీద పడుతుంది. కాళ్లు వణుకుతాయి. చేతుల్లో చెమటలు రావడం. ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఎన్నడు కనీ, విననివిగా అనిపించడంతో ఏది గుర్తుకు రాదు. ఇక్కడే విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టెన్షన్ ఒక్క విద్యార్థికే కాదు ప్రతి రంగంలోని వారికి ఉంటుంది. ఇక్కడే మనం చేయాల్సింది దాన్ని ఎలా అధిగమించాలనే మార్గాలను వెతకడమే.

మానసిక నిపుణులు సూచనల ప్రకారం విద్యార్థులు భయపడి టెన్షన్‌కు లోనయ్యేంత తీవ్ర పరిస్థితి పరీక్ష పత్రాల్లో ఉండదు. మీ పాఠ్యాంశాలే ఉంటాయి. ఇతరులతో పోల్చుకోకుండా, ప్రతి గంటకు సుమారు 15 నిమిషాలు విరామం తీసుకోని, మధ్య మధ్యలో వ్యాయామం, యోగా వంటివి చేయాలి. మీరు చదివిన విషయాల అంశాలపై ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకొని తరచూ గుర్తు చేసుకోవాలి. ప్రశాంతంగా ఏకాగ్రతతో కోల్పోకుండా చదువుకున్న అంశాలు, బోధించినప్పటివి గుర్తు చేసుకుని రాయండి. వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏకాగ్రత చదువుల్లో ఎంతో అవసరం ఉందంటున్నారు. అది లేకుండా ఎన్ని గంటలు చదివిన బుర్రకెక్కదని హెచ్చరిస్తున్నారు.

ఒత్తిడి లేకుండా చూడాలి..

మండుతున్న ఎండలో నేల మీద ఒక కాగితం పడేస్తే, అది అలాగే ఉంటుంది .అదే ఒక భూతద్దంతో కిరణాలు దాని మీద కేంద్రీకృతం అయ్యేలా చేస్తే.. కాగితం క్షణాల్లో కాలిపోతుంది. అలాగే విద్యార్థులు మనసుని చదువుల మీద కేంద్రీకృతం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. పరీక్షలు అందరికీ ఒకటే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరు వేరు పేపర్లు ఇవ్వరు కదా! ఎప్పటి పాఠం అప్పుడే చదివే వారికి పరీక్షల సమయంలో ఏ టెన్షన్ ఉండదు. ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ, తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్, నట్స్ తరచూ తీసుకోవడం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ఇటు ప్రభుత్వాలు సైతం పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పరచాలి. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా కేంద్రాలు విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి సంఘటనలు లేకుండా చూడాలి. పరీక్షలు సమీపంలో ఉన్నందున విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, పాలకులపై ఉందని గమనించండి. ఈ పరీక్షలు విద్యార్థులకు మాత్రమే కాదు? అవి నిర్వహించే యాజమాన్యాలకు, అధికారులకు, బోధించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పాలకులకు కూడా పరీక్ష కాలమేనని గ్రహించండి. విద్యార్థులారా.. పరీక్షలు అంటే భయాన్ని వదిలిపెట్టండి. రోజు కాలేజీకో, బడికో వెళ్లినట్లే సహజంగా కొంచెం ప్రణాళికతో ముందుకు సాగండి. పరీక్షల్లో చక్కగా చదివేసిన వాటినే అలవోకగా రాసేయవచ్చు. విద్యార్థులకు ఇంకో అతి విలువైన మాట.. మార్కులు ర్యాంకులే ప్రతిభకు కొలమానం కాదు. పరీక్షలు రాయబోయే ఏ ఒక్క విద్యార్థి నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. ఆత్మ విశ్వాసం కన్న గొప్ప ఆస్తి లేదు. ఆల్ ది బెస్ట్.

మేకిరి దామోదర్

9573666650

Advertisement

Next Story

Most Viewed