టీచర్లంటే.. ఫలితాలు సాధించే యంత్రాలా?

by Ravi |   ( Updated:2024-09-21 00:46:19.0  )
టీచర్లంటే.. ఫలితాలు సాధించే యంత్రాలా?
X

గురువు అంటే ధనాన్ని అనుగ్రహించే నిధి కాదు. దోషాలను తొలగించే పరిహారం అంతకన్నా కాదు. ఆశయాలకు అనుగుణంగా విద్యార్థిని తీర్చిదిద్దే బోధన నేర్పేది గురువు బాధ్యత. శిష్యుడి మనసులో ఎగసిపడే ఆలోచనలకు అడ్డుకట్టవేసే శోధన గురువు. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే సాధన గురువు. మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ నేర్చుకునే ప్రతి అంశం వెనుక గురువు గుప్తంగా ఉంటాడు. అటువంటి మహోన్నత ఉత్తమ గురువులను మనం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో మాత్రమే. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ఎంత విస్తరించి తరగతి గదిలోకి ప్రవేశించినా అది గురువు ప్రత్యక్ష బోధనకు సరికాదన్న సత్యాన్ని మరువరాదు. అటువంటి ఉపాధ్యాయులు నేటి సమాజంలో అందరికీ టార్గెట్ అవుతున్నారనేది వాస్తవం. దానివల్ల ఉపాధ్యాయ వృత్తి గౌరవం, ఉపాధ్యాయుల ప్రతిభా విశేషాలు మసకబారిపోతున్నాయి. దీనికి కారకులు ఎవరు?

స్వాతంత్ర్యం అని స్పష్టంగా పలుకడం రాని కొంతమంది గల్లి నుండి ఢిల్లీ వరకు ఉన్న రాజకీయ నాయకులు తన మంది మార్బలంతో పాఠశాలను సందర్శించడం, బడి సమావేశాలకు హాజరవుతూ మీడియా ముందు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ టీచర్లను నిలదీయడం వారికి పరిపాటిగా మారింది. అలా చేయడం తమ నాయకత్వానికి గొప్ప చిహ్నంగా వారు భావిస్తుంటారు. రాజకీయ నాయకులు పాఠశాలలను తప్పక సందర్శించాలి. అలాగే బడిలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ టీచర్లను అందరి ముందు చులకనగా మాట్లాడటం సరికాదు. ఇట్లాంటి సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది అధికారులు టీచర్లపై కర్ర పెత్తనం చేయడానికి తమకు ఈ హోదా లభించిందనే భావనతో వ్యవహరిస్తుంటారు. టీచర్లకు ఫలితాలు, టార్గెట్లను విధిస్తూ వారిని ఫలితాలను రూపొందించే యంత్రాలుగా మారుస్తున్నారు. పిల్లలకు చదువు రాకపోవడానికి టీచర్లే కారణమని స్టేట్మెంట్‌లు ఇస్తూ తాము చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లమని నిరూపించుకోవడానికి తాపత్రయ పడుతుంటారు.

విద్యారంగంలో సరికొత్త మేధావులు..

ఈ మధ్య విద్యారంగంలో సరికొత్త మేధావులు అవతరించారు. వీరికి తరగతి బోధనానుభవం ఉండదు. కానీ టీచర్లు బోధన ఎలా చేయాలో చెబుతూ విద్యాధికారులకు ఉచిత సలహాలు ఇస్తూ వినూత్న కార్యక్రమాలను రూపొం దించి అమలు చేస్తుంటారు. వీరికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంపై పూర్తిస్థాయి అవగాహన ఉండదు. వివిధ ప్రొఫా ర్మాలు నింపడం యాప్‌లలో అప్లోడ్ చేయడం వంటి వాటితోనే గొప్ప సంస్కరణలు తీసుకొచ్చామని, ఇప్పుడు పిల్లలకు చదువు బాగా వస్తుందనే ప్రచారం చేస్తుంటారు. సదరు మేధావులు పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించాలని ఒకపక్క చెబుతూనే మరోపక్క టీచర్ ఏ పాఠం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలో తెలుపుతూ ఇదే చెప్పండి, ఇంతే చెప్పండి, ఇలాగే చెప్పండి అంటూ టీచర్లకు బోధనలో స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఉపాధ్యాయుల సృజనాత్మక ఆలోచన శక్తిని అణిచివేస్తున్నారు.

క్లాస్ రూమ్‌లో పాఠం చెబితే...

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా అది గురువుకు సాటిరాదనేది అక్షర సత్యం. కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాన్ని సులభతరం చేసి వారి మస్తిష్కాలలో నింపడానికి ఉపాధ్యాయులు విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. తరగతి గదిలో నలభై ఐదు నిమిషాల పాఠం బోధించడం ఆషామాషీ విషయం కాదు. తరగతి గదిలో విద్యార్థులందరికీ సామర్థ్యా‌లను అవగతం చేసుకుని బోధించాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయం లేని జ్ఞానజ్యోతి గురువు.

అంతా టీచర్లే చూసుకోవాలా?

చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలను బడిలో చేర్పించాం ఇక మా పని అయిపోయింది అంతా టీచర్లే చూసుకోవాలి అన్నట్లు వ్యవహరిస్తుంటారు. అది సరికాదు. ఒక మొక్క ఎదగడానికి నీరు, తగినంత సూర్యరశ్మి ఇతర వనరులు ఎంత అవసరమో అలాగే విద్యార్థికి చదువు రావడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుందనే విషయం మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు అతి గారాబం వల్ల పిల్లలు చెడిపోతున్నారనేది కఠోర సత్యం. మా పిల్లలు ఎలా ఉన్నా మాకు ఇష్టం, మీరు మాత్రం మా పిల్లల్ని ఏమీ అనకండి అంటూ టీచర్లను నిలదీసే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. విద్యార్థికి చదువు రావడానికంటే ముందుగా క్రమ శిక్షణ ఉండాలి. క్రమశిక్షణ కోసం ఎక్కడైనా ఉపాధ్యాయులు కొంత కఠినంగా వ్యవహరిస్తే చాలు వెంటనే తల్లిదండ్రులు ప్రత్యక్షమై టీచర్లను నిందిస్తుంటారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల ప్రవర్తన కూడా టీచర్ల పరిస్థితి దిగజారడానికి కారణమవుతోంది. వీరు రాజకీయ పార్టీలతో, నాయకులతో అంటకాగుతూ వారి ముందు సాగిలపడటంతో టీచర్ల పట్ల చులకన భావం ఏర్పడుతుంది. అధికారుల మెప్పు కోసం మాట్లాడే టీచర్ల వల్ల కూడా సాటి టీచర్లు అవమానాల పాలవుతుంటారు.

చులకన చేస్తూనే...

కర్ణుడు చావుకు అరవై శాపాలనట్లు ఇంతమంది కలిసి సభ్య సమాజంలో టీచర్లను చులకన చేసేందుకు ప్రయత్నిస్తూ, మరోపక్క ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం టీచర్ల గొప్పతనం గురించి ఊకదంపుడు ఉప న్యాసాలు ఇవ్వడం విడ్డూరం. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని, విలువలను కాపాడే కొంతమంది అధికారుల చర్యల వల్లనే ఇంకా కొంతమేరకు ఉపాధ్యాయులు ప్రతిష్ట నిలబడుతూ వస్తోంది, అలాగే తన చుట్టూ ఇంత వ్యతిరేకత ఆవహించి ఉన్నా వాటి మధ్యన నిలబడి తమ విధిని సక్రమంగా నిర్వహిస్తున్న ఆదర్శ ఉపాధ్యాయుల వల్ల కూడా ఉపాధ్యాయుల గౌరవం అక్కడక్కడ బతికే ఉన్నది. ఇన్ని ప్రయోగాలు, సమస్యలు అవస్థలు ప్రతికూలతల నడుమనే విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు శతకోటి వందనాలు.

సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed