ప్రత్యేక హోదా అవసరమే!

by Ravi |   ( Updated:2023-12-29 01:30:48.0  )
ప్రత్యేక హోదా అవసరమే!
X

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కొత్తగా జై భారత్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదానే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్రానికి ఆ హోదా వస్తేనే అన్ని సమస్యలు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. ఏది ఏమైనా ఇటు జగన్, అటు చంద్రబాబు మరచిపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని లక్ష్మీనారాయణ మరోసారి కదిపారు.

విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్‌సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చినా, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ దానికి మద్ధతిచ్చినా, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు. ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా ఇది ముగిసిపోయిన అధ్యాయమని, ప్రత్యేక హోదా ఇవ్వకున్నా రాష్ట్రానికి కావాల్సిన అన్నీ చేసామని సన్నాయి నొక్కులు నొక్కుతుంది కేంద్రం. ఒక్కమాటలో చెప్పాలంటే ....అన్నీ ఇస్తాం కానీ....ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం.

హోదా చుట్టూనే పాలిటిక్స్

విభజన తరువాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం పాటు ప్రత్యేక హోదా అంశం చుట్టూనే రాజకీయాలు నడిచాయి. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి సాయపడ్డ ప్రధాన అంశం ఇదే. తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని తాము మాత్రమే చేయగలమని ఎన్నికల ప్రచారంలో ఊరువాడా ఏకం చేసి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఒక దశలో రాజకీయాలకతీతంగా ప్రత్యేక హోదా సాధన కోసం క‌ృషి చేస్తే తమ ఎంపీల మద్దతు ఇస్తామన్నారు. అందరూ రాజీనామా చేసి ఢిల్లీలో కూర్చుందామన్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక, జనం ముందుకు పోలేక ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. ప్రత్యేక హోదా సంగతి ఎలాగున్నా, దీనికై అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం అంటూ ఏదీ కనిపించదు. వాస్తవానికి నరేంద్ర మోడీ సర్కార్‌తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఎన్డీయే కూటమిలో లేకపోయినా మోడీ సర్కారు తీసుకునే ప్రతి సంచలన నిర్ణయాన్ని అందరికంటే ముందుగా బలపరిచే పొలిటికల్ పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రంలో ఆ స్థాయిలో పలుకుబడి ఉన్నప్పటికీ అయిదు కోట్ల ఆంధ్రుల డిమాండ్ అయిన ప్రత్యేక హోదాను జగన్ సాధించలేకపోయారు. సాధించడం సంగతి దేవుడెరుగు అసలు ఆ దిశగా ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదన్న విమర్శలున్నాయి.

జగన్ ప్రయత్నాలేవి?

స్పెషల్ స్టేటస్ అంశం ఒక్కటే కాదు ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసే ఏ నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నా దానిని నిలదీసి ప్రశ్నించే దైర్యం జగన్మోహన్ రెడ్డి చేయడం లేదన్నది ఆయనపై ఉన్న ప్రధాన విమర్శ. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో ఆంధ్రులు సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయినా ఆయన మౌనాన్నే ఆశ్రయించారు. కేంద్రానికి లేఖలు రాసి ఇక తన బాధ్యత తీరిపోయినట్లు ప్రవర్తించారు. అలాగే పోలవరం, రైల్వే జోన్‌ల విషయంలో కూడా ఏపీకి తీరని అన్యాయం జరిగింది. అయినా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడానికి కూడా జగన్ సాహసించలేకపోయారు. కేంద్రానికి సాయం చేయడమే తప్ప ...స్పెషల్ స్టేటస్‌పై ఇచ్చిన హామీని అమలు చేయించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారన్న విమర్శలు వచ్చాయి. కారణాలు ఏవైనా సామాన్య ప్రజల దృష్టిలో స్పెషల్ స్టేటస్ సాధించలేకపోయిన నేతగా జగన్‌పై ముద్ర పడిపోయింది.

హోదాతో వచ్చే ప్రయోజనాలు..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆర్థికంగా రాష్ట్రానికి బోలెడన్ని లాభాలుంటాయి. ఈ రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థికసాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలకు ఇస్తున్న ఫండ్స్‌లో ముప్ఫయి శాతం నిధులను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందచేస్తారు. మిగిలిన డెబ్భయి శాతం నిధులను ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణం కింద ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు ఇస్తారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అన్ని విధాలా రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తారు. రుణాల చెల్లింపు సమయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుంది. రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు. అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందచేస్తుంది. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే. దీనికి బదులుగా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఆ లాభం ప్రత్యేక హోదా గుర్తింపు వల్ల కలిగే ప్రయోజనాలతో సమానం కాదు. కనీసం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ చొరవతోనైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తుందని ఆశిద్దాం.

- ఎస్. అబ్దుల్ ఖాలిక్,

సీనియర్ జర్నలిస్ట్,

63001 74320

Advertisement

Next Story