న్యాయ వ్యవస్థపై ముప్పేట దాడి...కేంద్రానికీ ఏపీనే ఆదర్శమా?

by Ravi |   ( Updated:2023-01-25 02:07:05.0  )
న్యాయ వ్యవస్థపై ముప్పేట దాడి...కేంద్రానికీ ఏపీనే ఆదర్శమా?
X

పాలకపక్షాలు ప్రజాస్వామ్య గొంతు నులిమి ఊపిరితీస్తుంటే న్యాయవ్యవస్థ ప్రాణంపోస్తోంది. అందుకే న్యాయవ్యవస్థపై ముప్పేట దాడి జరుగుతోంది. న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై దాడిచేస్తూ కించపరిచే విష సంస్కృతి మన రాష్ట్రం నుంచే ప్రారంభమైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ నియామకాన్ని అడ్డుకునేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివాదాస్పదమైన లేఖ రాసి న్యాయవ్యవస్థపై దాడి ప్రారంభించారు. స్వతంత్ర సంస్థలన్నీ పాలకపక్షాల చేతిలో కీలుబొమ్మలుగా మారాయి. ఒక్క న్యాయవ్యవస్థే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసి వాటి విశ్వసనీయతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి.

ట్టసభల్లో మెజార్టీ ఉంది కదా అని.. ఏదైనా మార్చవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చనే అహంభావాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. మేం చేసే చట్టాలను సమీక్షించే అధికారం, హక్కు న్యాయస్థానాలకు లేదని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న పెద్దలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. అమరావతి రాజధానిని మార్చే వ్యవహారంలో ఇచ్చిన తీర్పుపై శాసనసభ సాక్షిగా హైకోర్టును కించపరుస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన ప్రసంగాలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేశాయి. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా పాలకపక్ష నేతలు మరో అడుగు ముందుకువేసి న్యాయమూర్తులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. దీనిని హైకోర్టు తీవ్రంగా పరిగణించి సీబీఐకి అప్పగించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దాడిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలిచింది.

హైకోర్టును ధిక్కరిస్తూ..

సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుతున్నప్పుడు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపైన, ఇటు నిర్వాహకులపైన ఉంటుంది. కానీ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ రాజకీయపక్షాలపై నెపాన్ని నెట్టి రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కింది. జీవో నెం.1 లాంటి జీవోలను భారతదేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. బ్రిటీష్ వలస పాలకులు తెచ్చిన ఈ చట్టాన్ని వారు సైతం అమలుచేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది. కందుకూరు, గుంటూరు లాంటి దురదృష్టకరమైన సంఘటనలను అడ్డుపెట్టుకుని ప్రజలను, ప్రజాసంఘాలను, ప్రతిపక్షాలను నిలువరించాలని అనుకోవడం దేనికి సంకేతం? ఈ సమస్య అత్యవసరమేమీ కాదు.. సెలవుల్లో దీనిపై విచారించాల్సిన అవసరం ఏముందని అడ్వకేట్ జనరల్ హైకోర్టును ప్రశ్నించారు. అత్యవసరం కానప్పుడు ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు? విచారణ దశలో ఉన్నప్పుడు.. హైకోర్టును ధిక్కరిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడం న్యాయవ్యవస్థపై దాడికాక మరేమిటి? సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకే పంపడం ప్రభుత్వానికి అవమానం కాదా? దీనికి ఎలాంటి రాజ్యాంగబద్ధత లేదు. న్యాయస్థానాల్లో నిలవదు. ప్రభుత్వానికి ఇది మరొక చెంపపెట్టు అవుతుంది. ప్రజల భద్రత ఎంత ముఖ్యమో భావప్రకటనా స్వేచ్ఛను కాపాడటం కూడా అంతే ముఖ్యం.

ఏపీ ప్రభుత్వంపై కోర్టు వ్యాఖ్యలు..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధ పాలనను సమాధి చేసి 40 నెలల్లో 400 తుగ్లక్ నిర్ణయాలను తీసుకున్నారు. 400 కేసుల్లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ.. కొన్నింటిని రద్దు చేసి, మరికొన్నింటిపై స్టే విధించింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు దోషుల్లాగ కోర్టు బోనులో నిలబడి చీవాట్లు తింటున్నారు. వివిధ సందర్భాల్లో కోర్టులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాయి. వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులు, పోలీసులు కలిసి పనిచేస్తున్నారు.. హంతకులను పోలీసులు కాపాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అత్యంత సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పవర్‌ను ప్రజలు ఎప్పుడు తీయాలి, కాంట్రాక్టర్లను దొంగలుగా మారుస్తున్నారు, పెన్షన్ దార్లను పిక్ పాకెటర్లుగా మారుస్తారేమోనని హైకోర్టు వ్యాఖ్యానించింది. సలహాదారుల నియామకం ప్రమాదకరం.. ఇది సమాంతరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే అవుతుంది. ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడానికి కూడా సలహాదారులను నియమిస్తారేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులా ఎమర్జెన్సీని తలపిస్తున్న పోలీసులు, డా.సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశం, రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా' ఉందా, రాజధాని తరలింపు 'మతిలేని చర్య'గాక మరేమిటి అంటూ పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమరావతే రాజధాని అని మేం తీర్పు ఇచ్చాక మూడు రాజధానులు ఏమిటి అంటూ అమరావతి రాజధాని తరలింపు అంశంలో హైకోర్టు అనేక దఫాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

హద్దులు దాటి రాజకీయ జోక్యం..

రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని వ్యవస్థల మధ్య సమతుల్యత ఉండాలి. మందబలం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నట్లున్నాయి. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్ కు ఉంది. కానీ రాజ్యాంగ సవరణలు దాని మౌలిక స్వరూపానికి భంగం కలిగించేలా ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1973 ఏప్రిల్ 24 తేదీన కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేసులో న్యాయవ్యవస్థకున్న అధికారాలు, చట్టసభలకున్న అధికారాల పట్ల స్పష్టత ఇవ్వడమైనది. ప్రభుత్వాలు చట్టాలు చేసినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉందని ఆ తీర్పు ద్వారా వెల్లడైంది. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఎలాంటి చట్టం చేసినా అది చెల్లదు. గోలఖ్ నాథ్ కేసులో కూడా పౌరుల హక్కులను మరింత విస్తృతపరచాలే తప్ప నియంత్రించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది.

కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి కూడా ఒకరు ఉండాలని కోరుకోవడం న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ఎంతవరకు సబబు? న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జీలతో కూడిన కొలీజియం న్యాయమూర్తుల నియామకాలకు, బదిలీలకు సిఫార్సు చేయడం ఆనవాయితీ. దీనికి భిన్నంగా జడ్జీల నియామకం, బదిలీచేసే అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ వితండవాదం చేస్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపమే ప్రమాదంలో పడేలా కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పును నేనసలు అంగీకరించనని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీనికి తోడు కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా వంతపాడుతూ లేఖ రాశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మూడూ దేనికదే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయి. వారి వారి పరిధులను అతిక్రమించకుండా అధికారాలు విభజించడం జరిగింది. కానీ రాజకీయ అధికారం హద్దులు దాటి అన్ని వ్యవస్థల్లో జోక్యం చేసుకుంటోంది. దీనివల్ల ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, లౌకికతత్వం, సమాఖ్యస్ఫూర్తికి నష్టం జరుగుతుందేమోనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.

ఏది తోస్తే అది చట్టంగా మార్చుతూ

నియంతపాలన ఎలా ఉంటుందో ప్రజలకు జగన్ రెడ్డి రుచిచూపిస్తున్నారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలపై హైకోర్టులో నెలకు సగటున 10 సార్లు చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన జీవోలు, చేసిన చట్టాలు 90 శాతం లోపభూయిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు హడావుడిగా, ఏకపక్షంగా తీసుకోవడం వల్ల అభాసుపాలవుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం న్యాయవాదులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయినా న్యాయపరమైన కసరత్తు జరగడం లేదు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎవరితో సంప్రదించకుండా జగన్ రెడ్డికి ఏది తోస్తే అది చట్టంగా మారుతోంది. దేశ స్వాతంత్ర్య చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయస్థానాలు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. అయినా ఎప్పుడు ఎక్కడా సిగ్గుపడటం కాని, ఆత్మపరిశీలన చేసుకోవడం కానీ జరగలేదు. ఇప్పటికైనా తప్పొప్పులను బేరీజు వేసుకోవాలి. రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం కలిగించకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంచి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్

99497 77727

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

సర్పంచుల పీక నొక్కుతున్న సర్కార్


Advertisement

Next Story

Most Viewed