ఆరోపణల ప్రజాస్వామ్యం

by Ravi |   ( Updated:2022-09-03 17:17:06.0  )
ఆరోపణల ప్రజాస్వామ్యం
X

ధునిక ప్రపంచంలో అతి గొప్ప విజయవంతమైన పాలనా విధానంగా మన దేశ ప్రజాస్వామ్యం పేరుగాంచింది. ఫెడరల్, సమాఖ్య లక్షణాలు కలిగిన రాజ్యాంగ నిర్దేశాలను అనుసరించి కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాల ఏర్పాటు కోసం ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజాస్వామ్య ఫలితాలు ప్రజలకు అందాలంటే బలమైన ప్రతిపక్షమెంతో అవసరమన్నారు విన్‌స్టన్ చర్చిల్.

అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తున్న నేటి పాలకుల వైఖరితో ప్రజాస్వామిక వ్యవస్థ ప్రతిష్ట మసకబారి నియంతృత్వంగా రూపాంతరం చెందుతోంది. రెండు దశాబ్దాల బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకొని 1947లో స్వతంత్ర దేశంగా భారతావని అవతరించిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల రాజకీయ ఎజెండా ఒక్కటే. అది దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు ప్రజలందరికీ సమాన సామాజిక, రాజకీయ హోదాతో జీవించగలిగే అద్భుత సామాజిక వాతావరణం సృష్టించే పాలన అందించడం.

విష వలయంలోకి నెడుతూ

నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్ అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది. పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీలతో ఆకర్షించినా, నేరుగా నగదు, లిక్కర్ ఓటర్లకు పంపిణీ చేసినా నియత్రించకపోవడంతో చట్టసభలలోకి నేరస్తులు ప్రవేశిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల రూపాయల ఖర్చుతో అధికారాన్ని చేజిక్కించుకున్నవారు సహజంగానే దానిని దుర్వినియోగం చేయడం ద్వారా తాము గెలవడానికి పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడికి వంద రెట్లు తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటారు. రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నవారు 'వేల కోట్ల ఆర్థిక నేరాలలో ఇరుక్కొని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికీ అవరోధాలుగా మారుతున్నారని' ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఇక్కడ గమనార్హం.

ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని, కుటుంబ పాలనతో భ్రష్టుపట్టిస్తున్నారని, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రజల సంక్షేమానికి అడ్డుపడుతున్నారని, ప్రజాక్షేత్రంలో గొంతెత్తి గోల చేస్తున్నారు. 'మంత్రులు సైతం మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రైవేటీకరణతో, అంతులేని ఆర్థిక అసమానతలలో దేశ ప్రజలను పేదరిక విష వలయంలోకి నెట్టివేస్తున్నారని' రచ్చ చేస్తుంటే న్యాయ వ్యవస్థ సుమోటాగా సదరు ఆరోపణల నిజానిజాల నిగ్గు తేల్చాలని ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు.

వ్యూహకర్తల ప్రభావం

రాజకీయ పార్టీలు తాము చేసిన సేవలను ఉటంకించి, రాబోయే కాలంలో మరింత కట్టుదిట్టంగా పనిచేస్తామనే హామీని తమ మేనిఫెస్టోలో చేర్చి పోటీ చేయడం మానేసి, అవినీతి నాయకులను చట్ట సభలకు పంపేలా వ్యూహకర్తలను నియమించుకోవడం విచారకరం. వారు ప్రజల సంక్షేమం మరచి, విద్వేషాలు రెచ్చగొట్టి, సమాజాన్ని చీల్చి, భావోద్వేగాలను రెచ్చగొట్టి కోట్ల రూపాయలు ఫీజుగా తీసుకుంటూ అవినీతిపరులను అధికార పీఠం ఎక్కిస్తున్నారు. వ్యూహకర్తల బృందానికి ఓ ప్రత్యేక విధానమేమి ఉండదు. ఎవరు డబ్బులు ఎక్కువ ముట్టచెబుతారో వారి కోసమే పని చేస్తారు.

పార్టీల పాలనలో ప్రజలకు మేలు జరుగుతుందా? లేదా అనే అంశాన్ని వారు పరిగణనలోకే తీసుకోరు. 'ప్రజలు సమస్యలలో చిక్కుకోవడానికి కారణం మీరంటే మీరంటూ' పరస్పర ఆరోపణలతో సామాన్య ప్రజలు సైతం వినడానికి వీలు లేని భాషతో వీరంగం వేస్తున్నారు. ప్రజలు ఎవరి మాటలు నమ్మాలో తెలియక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దోచుకోవడానికి వీలు లేని ఓ ఆదర్శ సమాజ నిర్మాణానికి దోహదం చేసే సుపరిపాలన అందించాలంటే ఈ దేశ ప్రజలు నిరంతరం జాగరూకత వహించే విధంగా చైతన్యపరచాల్సిన బాధ్యతను మేధావివర్గాలు త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాల్సిందే.

నీలం సంపత్

సామాజిక కార్యకర్త

98667 67471

Advertisement

Next Story