ఆదివాసీలు మేలుకోవాలి

by Ravi |   ( Updated:2022-09-03 14:03:04.0  )
ఆదివాసీలు మేలుకోవాలి
X

మన గాలి పీల్చడానికి కూడా అర్హుడు కానీ అదివాసేతరుడు మన ఇంటి దాకా వచ్చాడంటే దానికి ఆదివాసీలే కారణం. ఇప్పటికైనా ఆదివాసీలలో మార్పు రావాలి. ఐక్యంగా చట్టాల అమలుకు పోరాడాలి. చదువుకున్న ఆదివాసీలు మిగితావారిని చైతన్యపరచాలి. యూఎన్ ఓ 'ఆదివాసీ హక్కులు-వారి స్థితిగతులు-జీవన విధానం పై అధ్యయనం చేసింది. ఆదివాసీల హక్కులు, సంస్కృతిని పరిరక్షించాలని సూచించింది. యేటా ఆగస్ట్ తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని కోరింది. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుండి 9 వరకు నవరాత్రులు నిర్వహించి ఆదివాసీలను చైతన్యపరచడం జరుగుతుంది.

భూమి మీద మనిషి పుట్టిన అనంతరం మానవ పరిణామ క్రమం అనేక దశలలో జరిగింది. పుట్టుకతో అందరూ ఒకేలా ఉన్నప్పటికీ తదనంతరం మార్పులు వచ్చాయి. అవి నవీన జీవన శైలికి దారి తీసాయి. దీంతో మానవుడు ఖండాలుగా, దేశాలుగా భూభాగానికి సరిహద్దులు రాసుకున్నాడు. మతాలు, కులాలు, ప్రాంతాలుగా వేరు చేసుకున్నాడు. ఆధునిక నాగరికతలోకి వచ్చాక వివక్ష, చిన్నచూపు, దోపిడీ ఎక్కువయ్యాయి. నిజానికి ఈ దేశ మూలవాసులు ఆదివాసీలు. వారి సంస్కృతి భిన్నమైనది. వారికి లోకం తెలియదు. అందరినీ నమ్మి సులువుగా మోసపోతారు. అందుకే వారి హక్కులను, సంస్కృతిని కాపాడటం కోసం బ్రిటిష్ పాలకులు 1917లోనే ఏజెన్సీ ట్రాక్స్ చట్టాన్ని తీసుకొచ్చారు.

ఏజెన్సీలోకి బయటివారి వలసలను నిషేధించారు. దీనిని యథాతథంగా రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లోనూ పొందుపరిచారు. ఆదివాసీ భూముల బదలాయింపు ఆదివాసీయేతరులకు నిషిద్ధమనే విషయాన్ని స్పష్టం చేస్తూ '1 / 59 ల్యాండ్ ట్రాన్సఫర్ రెగ్యూలేషన్ (LTR), 1 /70 చట్టాలను తీసుకు వచ్చారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు 'సమత జడ్జిమెంట్' కేసుతో స్పష్టం చేసింది. ఇన్ని చట్టాలున్నా ఏజెన్సీ భూముల అన్యాక్రాంతం, భూ బదలాయింపులు ఆగాయా? అంటే లేదనే చెప్పాలి.

ఎన్ని చట్టాలు చేసినా

1950 నుంచి 1970 సంవత్సరాలలో గిరిజనేతర వలసలు 0.05 శాతంగా ఉండగా 1970లో చట్టం అమలులోకి వచ్చాక 50 శాతం వలసలు పెరిగాయి. దానికి కారణం ఆదివాసీలను ఓటు బ్యాంకుగా పాలకులు వాడుకోవడమే. ఖనిజ సంపద కోసం, వివిధ సేవల పేరుతో ఆదివాసేతరుల జనాభా పెరిగేలా చూస్తున్నారు. ఇంకొందరు బతుకుదెరువు కోసం వచ్చి ఆదివాసీల భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. వ్యాపారాలు చేస్తూ రాజులుగా మారుతూ ఆదివాసీలను గుప్పిట పెట్టుకొని ఏజెన్సీని ఏలుతున్నారు. ప్రజాప్రతినిధుల అండతో పెత్తనం చెలాయిస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు గెలిచేది ఆదివాసీ ఓట్లతోనే. కానీ, వారికి దక్కాల్సిన రాజ్యాంగ హక్కుల కోసం వీరు చట్టసభలలో ఏనాడూ మాట్లాడిన దాఖలాలు లేవు. గిరిజనేతర పార్టీల కబంధ హస్తాలలో ఉండి, అదివాసీ చట్టాలు, రిజర్వేషన్ అన్యాక్రాంతం అవుతున్నా పోరాడిన చరిత్ర లేదు. ఆదివాసీలు చదువులేక, రాజ్యాంగం తెలియక, పూర్వీకులు పోరాడి సాధించిన హక్కులను గిరిజనేతరులకు బినామీల పేరుతో తాకట్టు పెడుతున్నారు. ఇది తెలిసి చేసేవారు ఉన్నారు. తెలియక చేసేవారూ ఉన్నారు. బినామీలుగా ఉన్న అదివాసీలు తనకు ఆ భూమి దక్కడానికి తన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో ఆలోచించాలి. అవగాహన లేక తమ భూములను గిరిజనేతరులకు వెయ్యికి, రెండువేలకు అమ్మి భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు.

ఐక్యంగా పోరాడి

గిరిజనేతరులు తమ ఆస్తులను ఆదివాసీల పేరుతోనే ఉంచుతున్నారు. బినామీ అంటే ఏమిటో తెలుసుకోలేని స్థితిలో ఆదివాసీలు ఉన్నారు. ఇలా డబ్బు కోసం ఒకరిని చూసి ఇంకొకరు తాకట్టు పెట్టడం పరిపాటి అయింది. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. బినామీలుగా ఉన్న ఆదివాసీల ఆస్తులను జప్తు చేయాలి. ఐటీడీఏ‌లు సైతం గిరిజనేతరులకు అడ్డాలుగా మారిపోయాయి. ఇందులో గిరిజనేతరులకు జరిగినంత సులువుగా ఆదివాసీలకు పనులు జరగవు. గుడిసెతో మొదలిడి బహుళ అంతస్తుల దాకా అక్రమ కట్టడాలు కడుతున్నారు. ప్రశ్నిస్తే బినామీగా ఉన్న అదివాసీనే దానిని అడ్డుకుంటున్నాడు.ఇప్పటికే గిరిజనేతరులు ఆదివాసీల ఉద్యోగ,ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారు. అలా పోగొట్టుకున్నదే జీఓ నెం 03. ఇకనైనా మారకపోతే ఎలా?

మన గాలి పీల్చడానికి కూడా అర్హుడు కానీ అదివాసేతరుడు మన ఇంటి దాకా వచ్చాడంటే దానికి ఆదివాసీలే కారణం. ఇప్పటికైనా ఆదివాసీలలో మార్పు రావాలి. ఐక్యంగా చట్టాల అమలుకు పోరాడాలి. చదువుకున్న ఆదివాసీలు మిగితావారిని చైతన్యపరచాలి. యూఎన్ ఓ 'ఆదివాసీ హక్కులు-వారి స్థితిగతులు-జీవన విధానం'పై అధ్యయనం చేసింది. ఆదివాసీల హక్కులు, సంస్కృతిని పరిరక్షించాలని సూచించింది. యేటా ఆగస్ట్ తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని కోరింది. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుండి 9 వరకు నవరాత్రులు నిర్వహించి ఆదివాసీలను చైతన్య పరచడం జరుగుతుంది.

కుంజా శ్రీను

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఆదివాసీ సంక్షేమ పరిషత్

ఆంధ్రప్రదేశ్, 79950 36822

Advertisement

Next Story