కరోనా.. మలి సంధ్య!

by Ravi |   ( Updated:2023-02-21 19:15:17.0  )
కరోనా.. మలి సంధ్య!
X

కరోనా కాలంలో కుటుంబ పెద్దకు ఆపదొచ్చిందంటే ఆ సభ్యులంతా పడ్డ వేదన అంతా ఇంతా కాదు. కానీ వృద్ధుల పట్ల కొందరు అనుసరించిన తీరు ఆక్షేపణీయం. ఆయనొక్కడికి సోకితే తామేం కావాలన్న భయం అసహ్యించుకునే స్థాయికి చేర్చింది. చాలా కుటుంబాల్లో కరోనా సోకిన పెద్దలను కూడా కంటికి రెప్పలా చూసుకొని ఉండొచ్చు. కానీ తోడు నీడా లేని వారి పరిస్థితి మరీ దారుణం. వాళ్లు అనుభవించిన నరకయాతన అంతా ఇంతా కాదు. ఆ అసహ్యం వృద్ధ తరాన్ని ఎంత మానసిక ఆందోళనకు గురి చేసిందో తెలుసుకుంటే, వారి నోట వింటుంటే కన్నీటిపర్యంతం కావాల్సిందే. కొందరి పట్ల వారి కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరు జీవనశైలినే మార్చేసింది. జీవితం నాది. ఎవరిదీ కాదన్న వాస్తవాన్ని గ్రహించిన పెద్దల తదుపరి నిర్ణయాలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రతి మదిని తట్టి నిద్ర లేపుతున్నాయి. ప్రతి జీవితానికి ఓ తోడు ఎంత అవసరమన్నది గుర్తు చేస్తున్నాయి. అలాగే తాను సంపాదించిన ప్రతి పైసా ఎవరి కోసం? ఎందుకోసం కుటుంబ సభ్యులకు ధారదత్తం చేసినా తన పట్ల చూపించిన ఈసడింపునకు కారణాలేమిటి? ఎంత చేసినా, ఎంత సంపాదించి పెట్టినా వృద్ధాప్యానికి గౌరవం దక్కనప్పుడు మార్పు అనివార్యంగా మార్చుకోవాల్సిందేన్న స్పృహ కలుగుతున్నది. ఇప్పుడు తోడును వెతుక్కునే పనిలో పడడం స్వాగతించాల్సిన పరిణామం. ఆ కుటుంబ సభ్యులు కూడా గౌరవించి తీరాలి.

నిన్న మా ఇంటికి నా క్లాస్మేట్ వచ్చాడు. చాలా రోజుల తర్వాత కలవడంతో సంతోషమనిపించింది. ఎట్లనో నేను గుర్తొచ్చానంటూ మొదలుపెట్టాను. ఏదో పని ఉండి వచ్చినట్లుందని అడిగాను. అలాంటిదేం లేదు. ఇక్కడొక పెళ్లి ఉంటే వచ్చానన్నాడు. ఎవరిది, ఏ ఊరు, అమ్మాయి తరపునొచ్చావా, అబ్బాయి వాళ్లు చుట్టాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను. ఐతే సమాధానం చెప్పడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏదో ట్విస్ట్ ఉందన్న అనుమానం కలిగింది. గుచ్చి గుచ్చి అడగడం తప్పలేదు. మా బంధువుల పెళ్లికొచ్చాను. కానీ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అదేమని అడిగాను. ఆయనకు ఇప్పటికే 65 ఏండ్ల వయసు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎట్లా అని అందరూ వద్దన్నారు. ఆయన మాత్రం పెళ్లి చేసుకొని తీరుతానని పట్టుబట్టాడు. అందుకే తప్పలేదన్నాడు. అసలేం జరిగిందో చెప్పు.. పెళ్లి వెనుక ఆంతర్యమేదో ఉంటుందన్నాను. అప్పుడు అసలు సంగతేంటో చెప్పాడు.

ఆయన కొంత కాలం క్రితమే భార్యను కోల్పోయాడు. ఇంతలోనే కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడు కొడుకులు, కోడళ్ల నుంచి ఈసడింపులు ఎదుర్కొన్నాడు. సరిగ్గా చూసుకోలేదట. కనీసం గది బయటికి రాకుండా ఆంక్షలు పెట్టారు. ఎవరూ సరిగ్గా మాట్లాడలేదు. అప్పటి నుంచి ఆయన తనకు తోడు ఉండకపోవడం వల్ల ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొన్నాడో అర్థమైంది. ఒక్క తోడు లేకపోతే కుటుంబ సభ్యులకు లోకువ కావడం ఏమిటి? తానేమైనా సంపాదించలేదా? రూ.కోట్ల విలువైన ఆస్తిని వారసులకు ఇచ్చాను. ఇప్పటికీ వ్యాపారం చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ప్రతి నెలా రూ.లక్షల్లో కిరాయిలు వచ్చే ఆదాయం ఉన్నది. తన ఆస్తులను అనుభవిస్తూ తనపైనే పెత్తనం చెలాయించడానికి కారణం తోడు లేకపోవడమే. భార్యను కోల్పోవడం ఎంత నష్టం కలిగించిందోనన్న ఆయన ఆలోచన నుంచే ఈ పెళ్లి. ఎట్లయినా ఓ తోడును సంపాదించుకోవాలన్న ప్రయత్నం నేడు ఫలించిందని చెప్పాడు.

తన జీవితంలో ఎంతో కష్టపడి రూ. కోట్లు సంపాదించాడు. ఆ ఆస్తిని వారసులకే ఇచ్చాడు. వృద్ధాప్యంలో బాగా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన అవమానాలను తట్టుకోలేకపోయాడు. అందుకే పెళ్లి చేసుకున్నాడు. అందులో తప్పేం లేదు. కుటుంబ సభ్యులు కూడా స్వాగతించాల్సిందేనన్నాను. ఎవరో ఒకరు వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడే వారుండాల్సిందే. అది ఆడా,మగా అన్న తేడా లేదు. ఒకరికొకరుగా జీవితాన్ని సాగించాల్సిందే కదా అన్నది నా అభిప్రాయం.

ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చిన కరోనా..

ప్రపంచమంతా కరోనా సంక్షోభాన్ని తెచ్చింది. ఐతే ప్రయోజనాలను కూడా చూపించింది. అందులో ప్రధానమైనది కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయతల్లో నిజాయితీ ఎంత సొసైటీ స్పందన, సహకారం ఎంత ఈ రెండింట్లో అత్యంత కీలకమైనది మొదటిదే. ప్రతి రోజూ కలిసి జీవిస్తోన్న వారి నుంచి ఎంతటి ప్రోత్సాహం అందింది ఎలా చూసుకున్నారు ఆ 14 రోజుల పాటు ఎలా వ్యవహరించారన్న దాన్ని బట్టి ఎవరి ప్రేమ నిజమైనది? తాను కోలుకోవడానికి భార్యా పిల్లలు ఎంత కంగారు పడ్డారు? ఎన్ని కష్టాలు పడ్డారు ఈ విషయాలపైన ఓ క్లారిటీ ఇచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి అంచనా వేసుకోవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలో అర్థమైంది. కుటుంబ పెద్దకు ఆపదొచ్చిందంటే ఆ సభ్యులంతా పడ్డ వేదన అంతా ఇంతా కాదు. కానీ వృద్ధుల పట్ల కొందరు అనుసరించిన తీరు ఆక్షేపణీయం.

ఆయనొక్కడికి సోకితే తామేం కావాలన్న భయం అసహ్యించుకునే స్థాయికి చేర్చింది. చాలా కుటుంబాల్లో కరోనా సోకిన పెద్దలను కూడా కంటికి రెప్పలా చూసుకొని ఉండొచ్చు. కానీ తోడు నీడా లేని వారి పరిస్థితి మరీ దారుణం. వాళ్లు అనుభవించిన నరకయాతన అంతా ఇంతా కాదు. ఆ అసహ్యం వృద్ధ తరాన్ని ఎంత మానసిక ఆందోళనకు గురి చేసిందో తెలుసుకుంటే, వారి నోట వింటుంటే కన్నీటిపర్యంతం కావాల్సిందే. కొందరి పట్ల వారి కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరు జీవనశైలినే మార్చేసింది. జీవితం నాది. ఎవరిదీ కాదన్న వాస్తవాన్ని గ్రహించిన పెద్దల తదుపరి నిర్ణయాలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రతి మదిని తట్టి నిద్ర లేపుతున్నాయి. ప్రతి జీవితానికి ఓ తోడు ఎంత అవసరమన్నది గుర్తు చేస్తున్నాయి. అలాగే తాను సంపాదించిన ప్రతి పైసా ఎవరి కోసం ఎందుకోసం కుటుంబ సభ్యులకు ధారదత్తం చేసినా తన పట్ల చూపించిన ఈసడింపునకు కారణాలేమిటి ఎంత చేసినా, ఎంత సంపాదించి పెట్టినా వృద్ధాప్యానికి గౌరవం దక్కనప్పుడు మార్పు అనివార్యంగా మార్చుకోవాల్సిందేన్న స్పృహ కలుగుతున్నది. ఇప్పుడు తోడును వెతుక్కునే పనిలో పడడం స్వాగతించాల్సిన పరిణామం. ఆ కుటుంబ సభ్యులు కూడా గౌరవించి తీరాలి.

వారి సంపాదన అనుభవించేందుకేనా…

ఎంత సంపాదిస్తే ఏం లాభం? హైదరాబాద్​ నగర శివార్లలో ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టిన పెద్దాయనకే కష్టమొస్తే ఏం సంపాదించని వారి గతేం కావాలి? ఆయన ఓ జీవితానికి తోడునిచ్చే ఆర్థిక స్థితిమంతుడు. అందుకే వారసులను ఎదురించగలిగాడు. తాను పెళ్లి చేసుకొని తీరుతానని ఒకరిని వెతుక్కోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆస్తి లేని ఒంటరి బతుకులు ఆగం కావాల్సిందేనా? మలిదశలో కొత్త తోడును కాపాడుకునేందుకు అవసరమైన సంపాదన ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ పునరాలోచించుకోవాలి. ప్లానింగ్ చేసుకోవాల్సిన అనివార్యత కనిపిస్తున్నది. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలా? వృద్ధాప్యంలో తమను తాము కాపాడుకునేందుకు పొదుపు చేయాలా? అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లల పెంపకం కొంత వరకు మాత్రమేనన్న ప్రచారం.

ఇక్కడేమో వాళ్లు ఓ ఉద్యోగం, ఓ వ్యాపారంలో సెటిలయ్యే వరకు తల్లిదండ్రులదే బాధ్యత అన్నట్లుగా ఆనవాయితీ కొనసాగుతున్నది. ఏ రంగంలో రాణించకపోయినా అది పెద్దల తప్పుగానే నింద వేసే సమాజం. ఉన్నత విద్యనందుకునేందుకు అవసరమైన తోడ్పాటునివ్వలేదంటూ తిట్టూ దూషణలు కామన్ గా మారాయి. నిజానికి పిల్లలను వారి అభ్యున్నతికి సహకరించడం పెద్దల బాధ్యతే. కానీ వారసులుగా మాత్రం ఆలోచించకపోతేనే మంచిది. కొందరు తల్లిదండ్రుల సంపాదనను అనుభవించేందుకే మాత్రమే వారసుల్లా మారుతున్నారు. కానీ వృద్ధాప్యంలో ఆలనా పాలనా చూసే బాధ్యతను మోసేందుకు ముందుకు రావడం లేదు. 40, 50 ఏండ్ల పాటు తన కోసం కాకుండా పిల్లల కోసం కష్టపడ్డ ఆ పెద్దల పట్ల వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉంటున్నది. కొన్ని ఇండ్లల్లో మాకేం ఇచ్చారు ఏం సంపాదించారు అనే వాళ్లు కూడా లేకపోలేదు. కానీ ఆఖరికి రూ. కోట్లు కూడబెట్టిన వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది.

పెళ్లి..జీవితానికి ఓ తోడునీడా

మళ్లీ పెళ్లి తప్పెలా అవుతుంది? వయసుకు మాత్రమే సంబంధించింది ఎట్లా అవుతుంది? మా ఇంటికొచ్చిన ఫ్రెండ్ మరో వ్యక్తి గురించి కూడా చెప్పాడు. కరోనా సమయంలో 40 ఏండ్ల వ్యక్తి భార్యను కోల్పోయాడు. అప్పటి నుంచి ఇద్దరి ఆలనాపాలనా అతడే అయ్యాడు. మరో పెళ్లికి సమాజం ఆమోదిస్తుందో లేదోనని వేచి చూస్తున్నాడు. భర్త కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త.. ఎవరైనా మరో కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు బంధుమిత్ర సపరివార సమేతం స్వాగతించాల్సిందే. కాలం మారుతున్నది. మిగిలిన ఎంతో జీవితాన్ని ఎవరూ లేని వారిగా గడపడం కంటే మరొకరికి కొత్త జీవితాన్ని ఇస్తున్నట్లుగానూ చూడాలి.

ఇటీవల మేఘాలయలో 50 ఏళ్ల మహిళ భర్తను కోల్పోయింది. 25 ఏండ్ల కూతురు తన తల్లికి వరుడిని వెతికి పెళ్లి చేసింది. తన తండ్రి మరణించినప్పుడు తనకు రెండేండ్లే. అప్పటి నుంచి తనను పెంచేందుకు తల్లి పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నది. అసోంలో ఓ మహిళకు మొదటి పెళ్లి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. కానీ తన కూతురును పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంటానన్న ఆ తల్లికి కూతురే దగ్గరుండి ఏర్పాట్లు చేసింది. ఇలాంటి సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి ప్రతి ఒక్కరూ సహృదయంతో ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ జీవితాల్లో మలిసంధ్య కూడా ఉదయాన్నే తీసుకొస్తుంది. పెళ్లి అనేది సెక్స్ కోసమే కాదు. జీవితానికి ఓ తోడునీడా కూడా. మలిసంధ్యలోనూ అవసరమైనదే. ఎంత సంపాదించినా కొడుకులు, బిడ్డలు చూస్తారన్న నమ్మకమైతే లేదు. ప్రస్తుత సమాజంలో ఎవరి దారి వారు వెతుక్కునే పనిలోనే ఉన్నారు. అలాంటప్పుడు ఎవరూ లేని ఒంటరి జీవితాలకు సాంత్వన అవసరం. కనీసం మాట్లాడటానికి ఒకరు కావాలి. బాధను పంచుకునేందుకు ఓ మంచి మనసు కావాలి. అలసిన ఆ జీవితానికి ఓ భరోసానివ్వాలి. తన.. అంటూ ఓ జీవితం ఉండాలి.

శిరందాస్ ప్రవీణ్​కుమార్​

80966 77450

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed