వలస సమస్యపై సినిమా

by Ravi |   ( Updated:2023-12-16 00:30:32.0  )
వలస సమస్యపై సినిమా
X

ఫిలిం ఫెస్టివల్‌లో సినిమాలు చూస్తున్నపుడు నేటి ప్రపంచంలో migration ఒక ప్రధాన సమస్య అని అర్థమవుతుంది. ఉపాధి అవకాశాల్లేక బ్రతుకు తెరువు కోసమో, తమ దేశంలో అంతర్గత కలహాల వలన ఏర్పడిన ప్రమాదకర పరిస్థితుల నుండి తప్పించుకోవడం కోసమో ప్రాణాలను అరచేత పట్టుకుని అక్రమంగానైనా దేశాల ముళ్ళకంచెలు దాటి, యూరోప్‌లో ఓ అందమైన భవిష్యత్తు కోసం పయనమౌతున్నారు వివిధ దేశాల ప్రజలు. కొందరు ఈ ప్రమాదకర ప్రయాణంలో ప్రాణాలు కోల్పోతుంటే, కష్టపడి అక్కడికి చేరిన వారికీ అదో ఎండమావి అని అర్థమయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటలీ సినిమా ‘Me Captain’, వెనిజులా సినిమా ‘One Way’, పోలాండ్ సినిమా ‘Green Borders’, రొమానియా సినిమా ‘Clara’ – ఇలా చాలా సినిమాలు ఈ అంశాన్నే చర్చిస్తాయి. తండ్రి అమెరికాకు వలస పోయాక ఒక మెక్సికో కుటుంబంలోని తల్లీ కొడుకుల పరస్పర సంబంధాలు ఎలాంటి మార్పులకు, సంఘర్షణలకు లోనయ్యయో తెలిపే మెక్సికో సినిమా ‘Broken Borders’ కూడా పరోక్షంగా ఈ సమస్యనే తడిమింది. ఇలా వలసల సమస్యపై చాలా సినిమాలు దృష్టి పెట్టాయి. వీటిలో ఒక ముఖ్యమైన సినిమాను ఇప్పుడు చూద్దాం.

Yo Captain (నేనే కెప్టెన్ని) సినిమాలో

సెయిదూ, మౌస్సా సెనెగల్ (ఆఫ్రికా ఖండం) డాకర్ నగరంలోని పేదింటి పిల్లలు. ఇద్దరూ కజిన్ బ్రదర్స్. చదువులతో పాటు కాయకష్టం చేయాల్సిన స్థితి. తమ వూరిలో భవిష్యత్తు అగమ్యమని వారి గట్టి నమ్మకం. 16 ఏళ్ల సెయిదూ తమ ప్రాంతంలో చిన్నపాటి రాప్ సింగర్. తమ గాన కళతో యూరప్‌ను జయించవచ్చని ఆ అన్నదమ్ముల ఊహ. దొంగతనంగా యూరప్‌‌కు పారిపోవాలని తమ కష్టార్జితం నుండి డబ్బు ఆదా చేస్తుంటారు. సెయిదూ తల్లి అటువంటి ఆలోచనకు కూడా ఉగ్రురాలౌతుంది. ఆఫ్రికా దేశాల ఎడారుల గుండా ప్రయాణం చాలా ప్రమాదకరమనీ, దారి పొడుగునా శవాల గుట్టలు కనిపిస్తాయనీ ఒక పెద్ద మనిషి హెచ్చరిస్తాడు. కానీ మనసు కఠినం చేసుకుని తమ కలను సార్థకం చేసుకోవడానికి ఓ రాత్రి దొంగతనంగా బయల్దేరుతారు ఆ ఇద్దరూ.

కథేంటంటే..

బయల్దేరిన రెండు రోజుల్లోనే తామో భయంకర అడ్వెంచర్ చేయబోతున్నామని అర్థమైపోతుంది వారికి. దారి పొడుగునా వారు దాచుకున్న డబ్బును దోచుకునే బ్రోకర్లు కాచుకుని కూర్చుని ఉన్నారని తెలియడానికి ఎంతో కాలం పట్టదు. సెనెగల్ బోర్డర్ దాటి మాలి దేశపు నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారుచేయించడానికే చాలా నగదు ఖర్చయిపోతుంది. ఆ తర్వాత దారి దోపిడీగాళ్ళను తప్పించుకుంటూ సహారా ఎడారిలో అతి వేగంతో పోతున్న కిక్కిరిసిన వాహనం ఇసుక దిబ్బల మధ్యలోనే వారిని వదిలేస్తుంది. అక్కడనుంచి ఒక నమ్మదగని గైడ్ సంరక్షణలో కాలినడకన లిబియా వరకు వెళ్ళాలి. తాగునీరు కూడా తగినంత లేకుండా భయంకరమైన వేడిని భరిస్తూ వెళ్ళడం అందరికీ సాధ్యపడదు. వీలుకాక అక్కడే కూలబడ్డ స్త్రీ పురుషులు ఆ ఎడారిలో అనామక శవాలుగా కుళ్ళిపోవాల్సిందే. లిబియా గార్డులు వళ్ళంతా తనిఖీ చేసి డబ్బు దోచేసుకుంటారు. కనుక డబ్బును ప్లాస్టిక్ లో చుట్టి మలద్వారంలోకి జొనిపి దాచుకోమని నిగర్ దేశపు ఏజెంట్ చెబుతాడు. కానీ తీరా చూస్తే తెలివి మీరిన లిబియా గార్డులు వచ్చిన వారందరి చేతా ఓ మందును తాగించి, వారి మలాన్ని పరీక్షిస్తారు. దొరికిపోయిన వారి దగ్గర డబ్బు తీసుకుని జైల్లో వేస్తారు. అలా మౌస్సా జైలుపాలౌతాడు. మరి కొందర్ని చిత్రహింసలకు గురిచేస్తూ, తమ ఇంటి వారికి ఫోన్ చేసి డబ్బు రప్పించమని ఆజ్ఞాపిస్తారు. డబ్బు తెప్పించలేక సెయిదూ కట్టు బానిసగా చాలా రోజులు పనిచేస్తాడు. చివరికి పోల్చుకోలేనంత అనారోగ్య స్థితిలో బయటపడి ఒక పెద్దాయన ప్రోద్బలంతో నిర్మాణ కూలీగా లిబియాలో పనిచేస్తూ, తన సోదరుడు మౌస్సా కోసం గాలిస్తుంటాడు.

జైలు నుండి పారిపోయే క్రమంలో కాలిలో బులెట్ గాయంతో రహస్యంగా ఒక సెనెగల్ వాసుల బస్తీలో కనిపిస్తాడు మౌస్సా. అతడ్ని దొంగతనంగా చికిత్స చేయించాక, ఇటలీ వెళ్ళడానికి చివరి ప్రయత్నం చేస్తారు వారిద్దరూ. ఏజెంట్లకు తగినంత డబ్బు ఇచ్చుకోలేక తనే ఇటలీకి పోయే ఓడకు పైలట్ గా వ్యవహరిస్తాడు సెయిదూ. ఓడ నడిపే అనుభవం లేకపోయినా ఒక రోజంతా నిద్రలేకుండా భయంకరమైన సముద్రయానం చేసి, చివరకు కళ్ళెదుట ఇటలీలోని సిసిలీ రేవు కనిపించే సరికి ఆనందాన్ని తట్టుకోలేక, “నేనే కెప్టెన్ని. ఒక్క ప్రయాణికుడికి కూడా హాని జరగనివ్వకుండా గమ్యానికి చేర్చిన ధీరుణ్ణి!” అని గొంతుచించుకుని అరుస్తాడు సెయిదూ.

ఎన్నో అవార్డులు పొంది

“ఈ సినిమాను కొన్ని యదార్థ గాథల ఆధారంగా రూపొందించాము. యూరప్ వ్యక్తులుగా శరణార్థుల పట్ల మన దృక్కోణం ఒకలా వుంటుంది. కానీ ఈ సినిమాను బాధితుల దృష్టి కోణం నుండి నిర్మించాము” అని చెబుతాడు దర్శకుడు మాటియో గారోన్. పాలో కార్నెరా కెమెరా వివిధ భౌగోళిక ప్రాంతాల్ని కథనానికి అనుగుణంగా చిత్రీకరిస్తుంది. ఈ చిత్రం 80వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ కోసం పోటీ పడింది. మాటియో గారోన్ ఉత్తమ దర్శకుడిగా, సెయిదూ పాత్రను పోషించిన సెయిదూ సర్ ఉత్తమ నటుడిగా మార్సెల్లో మాస్ట్రోయాని అవార్డులను అందుకున్నారు. ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో ఇటాలియన్ ఎంట్రీగా అకాడమీ అవార్డ్స్‌లోనూ, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లోనూ పాల్గొంది ఈ సినిమా. ఇంకా లెక్కలేనన్ని అవార్డులు గెల్చుకుంది.

ఎమ్. బాలాజీ

90077 55403

Advertisement

Next Story

Most Viewed