ప్రైవేటీకరణకు పెద్ద పీట వేసిన బడ్జెట్

by Ravi |   ( Updated:2025-02-02 00:45:57.0  )
ప్రైవేటీకరణకు పెద్ద పీట వేసిన బడ్జెట్
X

మనదేశంలో రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం లాంటి మహనీయులు తీసుకొచ్చినవి సంస్కరణలు.. అవి మన దేశ చరిత్రలో రాయబడ్డవి. విధవా పునర్వివాహం, సతీ సహగమన నిషేధం లాంటి.. ప్రజలకు మేలు చేసే సంస్కరణలు అవి. అయితే మన దేశం సరళీకరణ యుగం లోకి ప్రవేశించాక.. పదాల అర్థాలు సమూలంగా మారిపోయాయి. బహుళ సంఖ్యాకులైన పేదలు, మధ్యతరగతి వర్గాలను వదిలేసి.. కొద్దిమంది పెద్దోళ్ల పక్షం వహించడమే సంస్కరణలు అనే.. ఉల్టాపల్టా యవ్వారం నేడు సాగుతున్నది. ఆ రీతిన.. ధనిక స్వాముల గులాంగిరీకి మారు పేరుగా నిలిచిన సంస్కరణల సరళిని కొనసాగించే దిశలోనే శనివారం రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025 కొనసాగింది.

ప్రైవేట్ బీమా విఫల హామీ!

దేశంలోని కీలక వనరులను ప్రైవేట్ దొరల చేతుల్లో పెట్టే క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది తాజా కేంద్ర బడ్జెట్. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 74 శాతం నుండి వంద శాతానికి పెంచుతామని ప్రకటించారు. బీమా అనేది కంటికి కనిపించే వస్తువు కాదు. అది ఒక హామీ, ఒక విశ్వాసం! ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో విదేశీ కంపెనీలు ఘోరంగా విఫలమయ్యాయి."ఫెయిల్డ్ ప్రామిసెస్" అనేది.. అమెరికాలో బీమా కంపెనీల కుంభకోణంపై వెలువడిన ప్రభుత్వ రిపోర్టు శీర్షిక. ప్రజల సొమ్ముకు టోకరా పెట్టడంలో జగజ్జంత్రీల లాంటివి ఈ విదేశీ కంపెనీలు.. దేశ ప్రజల పొదుపుని విదేశీ సంస్థలకు అప్పజెప్పడం.. మన ఆర్థిక వ్యవస్థకు ఎలా మేలు చేస్తుందో నిర్మలమ్మ గారే తేల్చి చెప్పాలి.

ఆ శక్తుల ఉచ్చులో రైతులు..

ధనిక స్వాములకు మరింతగా రాయితీలు ఇవ్వడమే తప్ప పన్నులు పెంచే దిశలో సాహసం చేయలేక పోయారు. పేదలకు అందించే సంక్షేమ పథకాలను "రేవడి" అంటూ ఎద్దేవా చేసే మోడీ సర్కార్.. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెట్టడంలో ఉదారంగా వ్యవహరిస్తున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఈ బడ్జెట్ నిర్దయగా మొండి చేయి చూపింది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటూ.. పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలంటూ రైతన్నలు గత నాలుగేళ్లుగా రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. అయి తే.. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించే విషయంలో నిర్మలమ్మ బడ్జెట్ పూర్తిగా మౌనం పాటించింది. రైతన్నలను మార్కెట్ శక్తుల దోపిడీకి వదిలేసింది.

రాష్ట్రాలకు గ్రాంట్లలో భారీ కోత

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గ్రాంట్ల విషయంలోనూ పెద్దయెత్తున కోత విధించారు. ఆర్థిక సంఘం ప్రకటించిన రాష్ట్రాల గ్రాంట్లకు.. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి మధ్య.. రూ. 27 లక్షల కోట్ల అంతరం ఉన్నది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ.. రాజ్యాంగంలో ప్రవచించిన ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించే దుస్సాహసానికి కేంద్రం పూనుకుంటుంది. సామాన్య ప్రజల అభివృద్ధికి సహకరించే.. విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాలకు పోయిన బడ్జెట్లో ఇచ్చిన కేటాయింపులను సైతం పూర్తిగా వెచ్చించలేకపోయామని బడ్జెట్ గణాంకాల్లో చెప్పుకున్నారు. వివిధ రంగాలకు పోయింది రూ.48.2 లక్షల కోట్లు కేటాయించామని చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం.. చివరకు రూ. 47.16 లక్షల కోట్లే ఖర్చు చేసి ఒక లక్ష కోట్ల ఆదాయాన్ని మిగుల్చుకున్నది.

ఉపాధి హామీకి తూట్లు..

భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఆ పథకానికి కేటాయింపులను.. పోయిన ఏడాది ఉన్న రూ. 86 వేల కోట్ల దగ్గరనే ఆపేసి.. ఒక్క నయా పైసా అదనంగా కేటాయించడానికి ముందుకు రాలేదు కేంద్ర ఆర్థిక మంత్రి. సంక్షేమ రాజ్యం గురించి రాజ్యాంగంలో రాసుకున్న మౌలిక సూత్రాలను రద్దు చేసే దిశలో కేంద్ర బడ్జెట్ సాగింది. దేశంలోని శ్రామిక వర్గాల ప్రజలు, ప్రజాపక్షం వహించే ఆర్థిక వేత్తలు ఈ బడ్జెట్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు!

ఆర్. రాజేశం,

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక

94404 43183

Next Story

Most Viewed