‘అది విడదీయలేని బంధం.. ఆ బంధాన్ని అలాగే ఉంచాలి’.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-14 14:56:49.0  )
‘అది విడదీయలేని బంధం.. ఆ బంధాన్ని అలాగే ఉంచాలి’.. డిప్యూటీ CM భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భూమికి మనిషికి విడదీయులేని బంధం ఉంటుందని.. ఆ బంధాన్ని అలాగే ఉంచాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు అని అభిప్రాయపడ్డారు. సామాన్యుడికి అర్థమయ్యేలా భూభారతి పోర్టల్‌ను రూపొందించినట్లు తెలిపారు. హక్కులు కోల్పోయిన రైతులకు హక్కులు కల్పించేందుకే భూభారతి(Bhu Bharathi Portal)ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ధరణి అనేది రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. ధరణి సమస్యలపై ప్రస్తావించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తుచేశారు. ధరణి చట్టంతో రైతులకు, భూమికి మధ్య ఉన్న బంధాన్ని తెంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని.. ప్రజలకు పనికొచ్చే చట్టం తెస్తామని అప్పుడే చెప్పాము.. ఇచ్చిన మాట ప్రకారం భూభారతి తెచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ పోర్టల్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 4 మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేయనున్నారు. మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి), వెంకటాపూర్‌ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలాలను ఎంపిక చేశారు. జూన్‌ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Next Story

Most Viewed