కలహాల సమూహం కాంగ్రెస్

by Viswanth |   ( Updated:2022-03-10 10:36:04.0  )
కలహాల సమూహం కాంగ్రెస్
X

తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ స్థానం ఎక్కడ? ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ఆ పార్టీ పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. కలహాల కాపురం, కట్టప్పల సమూహంగా తయారైంది. వర్గాలు, గ్రూపులు, సీనియర్లు-జూనియర్లు లాంటి జాడ్యం ఆ పార్టీ ప్రత్యేకత. ఒకరు నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే ఆ అవకాశం దక్కలేదన్న అక్కసుతో కిందికి లాగడం ఆ పార్టీ బలహీనత. పార్టీ కోసం సమిష్టిగా పనిచేయడం కంటే వ్యక్తి స్వార్థం, పదవీకాంక్ష లాంటి అవలక్షణాలు కాంగ్రెస్‌కు ఎదుగు బొదుగు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో పవర్‌లోకి రావడానికి నిర్దిష్ట నినాదం, విధానం, కార్యాచరణ లేదు. ఎన్టీఆర్ కాలంలో 'తెలుగువారి ఆత్మగౌరవం, వైఎస్‌ఆర్ హయాంలో 'విశ్వసనీయత' కేసీఆర్ టైమ్‌లో 'బంగారు తెలంగాణ' లాంటి నినాదాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆ పార్టీల నినాదాలే వాటి విధానాలుగా ఉన్నాయి. అందుకే ఇవి విస్తృతంగా మారుమూల గ్రామాలకు సైతం వెళ్లిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్‌కు అలాంటి నినాదమేదీ లేదు. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతే నినాదంగా మారింది. అధికార పార్టీని తిట్టడమే విధానంగా కొనసాగుతున్నది. తెలంగాణలో పవర్‌‌లోకి వస్తే ఏం చేయనున్నదీ ప్రజలకు లైన్ చెప్పలేకపోతున్నది. అందువల్లనే కాంగ్రెస్ ప్రజలను ఆకర్షించే ప్లాన్ ప్రదర్శించలేకపోతున్నది.

బలమైన నాయకుడు వచ్చినా

ఏడేళ్ల తర్వాత పార్టీకి బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చాడని శ్రేణులలో కొత్త విశ్వాసం ఏర్పడింది. కేసీఆర్ ప్రజాదరణకు దీటుగా వాక్చాతుర్యం, వివిధ అంశాలపై లోతైన అవగాహన ఉన్న నేత వచ్చాడనే అభిప్రాయమూ ఉన్నది. కానీ, సీనియర్లతో గ్యాప్ రేవంత్‌ ముందరి కాళ్లకు బంధంగా మారింది. పార్టీ సంస్థాగతంగా ఎదగడంలో ఇబ్బందులకు కారణమవుతున్నది. ఒకరు ఎదుగుతూ ఉంటే కాళ్లులాగే సంప్రదాయమే ఆ పార్టీకి అతి పెద్ద ప్రమాదంగా పరిణమించింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు, వర్గాలు అనే ఒక సాధారణ అభిప్రాయం ప్రజలలో నెలకొన్నది. సరిగ్గా కాంగ్రెస్ పార్టీలోని ఈ ధోరణే కేసీఆర్‌కు బాగా ఉపయోగపడుతున్నది. గ్రూపుల తగాదాలు, వర్గ విభేదాలు, అసంతృప్తిలాంటివన్నీ కేసీఆర్ ప్రలోభాలు, పదవులులాంటి రూపంలో వాడుకోడానికి దోహదపడుతున్నాయి. చివరకు గ్రామాల స్థాయిలో కార్యకర్తలను సైతం సునాయాసంగా కొనేయడమో లేక ప్రలోభాలకు గురిచేసి లాక్కోవడమో జరుగుతున్నది. పన్నెండు మంది ఎమ్మెల్యేలుగానీ, తాజాగా కౌశిక్‌రెడ్డి లాంటివారికిగానీ కేసీఆర్ ఏ స్థానం కల్పించారో స్పష్టం చేస్తున్నాయి. క్రిందిస్థాయి కార్యకర్తల అవసరాలు, వాటిని తీర్చడం టీఆర్ఎస్‌కు లాభిస్తున్నది. ఒకప్పడు ఉన్న అంకితభావం ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లో లేకపోవడంతో తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోతున్నారు.

సీనియర్ల సహకారం నిల్

మాస్ పుల్లర్‌గా, యువతను ఆకర్షించే నాయకుడిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్నా రేవంత్‌కు సీనియర్ల నుంచి సహకారం ఆశించిన స్థాయిలో లేదు. ఆయన కింద పనిచేయడానికి సుముఖంగా లేని సీనియర్లు చాలా మందే ఉన్నారు. పార్టీ కన్నా వ్యక్తిగా ప్రాధాన్యాన్ని కోరుకునే జాడ్యమే ఇందుకు కారణం. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాలు గణనీయంగానే ఉన్నా ముఖ్యమంత్రి, మంత్రి లాంటి పదవులపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అలాంటి భరోసా లేకపోవడంతో గెలిచే అవకాశం ఉన్నవారిని పనిగట్టుకుని ఓడించారన్నది బహిరంగ రహస్యం. కట్టప్ప తరహా మనస్తత్వమే ఆ పార్టీని ఇప్పుడు ఈ స్థాయికి దిగజార్చింది. స్వంత పార్టీలోనే కోవర్టులున్నారంటూ కొందరు బహిరంగంగా వ్యాఖ్యానించడం అతిశయోక్తేమీ కాదు. కొత్తగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం అలాంటివారు ఉంటే వెళ్లిపోవాలంటూ డెడ్‌లైన్ కూడా పెట్టారు. ఇప్పటికీ ఎవరు ఎవరికి కోవర్టులో, ఏ పార్టీకి సన్నిహితంగా ఉన్నారో చెప్పలేని అనుమానపు పరిస్థితులు ఉన్నాయి.

అంతర్గత ప్రజాస్వామ్యమా? విచ్చలవిడితనమా?

దేశంలోనే సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ అని గొప్పగా చెప్పుకుంటుంటారు. సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ మినహా ఎవరిని తిట్టినా ఏమీ కాదు అనే అభిప్రాయం ఉంటుంది. గాంధీభవన్ వేదికగా చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నా ఏమీ కాదు. అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరుతో విచ్చలవిడితనం ఆ పార్టీ ప్రత్యేకత. తాజాగా దళితబంధు విషయంలోనూ ఒక్కో నేతది ఒక్కో రకమైన అభిప్రాయం. ఒకరు వ్యతిరేకిస్తే మరొకరు దానికి భిన్నంగా స్పందిస్తారు. పార్టీపరంగా విధానపరమైన స్పష్టత కొరవడింది. పార్టీ చేపట్టిన 'దళిత-గిరిజన దండోరా' విషయంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చే ఆచరణ కరువైంది. హుజూరాబాద్ అభ్యర్థిని ఖరారు చేయడంలోనూ వర్గాలు అడ్డమొస్తున్నాయి. ఇప్పటివరకూ ఉన్న 'సీల్డ్ కవర్' సంస్కృతి ఇప్పుడూ రిపీట్ అయింది. అందుకే కేటీఆర్‌లాంటి రాజకీయ ప్రత్యర్థులు 'వీరు ఢిల్లీకి గులాములు' అని ధైర్యంగా అనగలుగుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో అది 'తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు' అనేది అప్పట్లో ప్రజలలోకి చొచ్చుకెళ్లి్ంది. ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని తొలగించడానికి కాంగ్రెస్ సంస్థాగతంగా భారీస్థాయి కృషే చేయాల్సి ఉన్నది. పార్టీ ప్రయోజనాలే పార్టీ నేతలకు స్పష్టమైన విధానంగా ఉంటే నాయకత్వంలో ఎవరు ఉన్నా టీమ్ స్పిరిట్‌తో అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తారు. కానీ జూనియర్లు, సీనియర్లు అనే గ్యాప్‌ పార్టీకే నష్టం చేకూరుస్తున్నది.

జోష్ కొనసాగిస్తారా?

సుదీర్ఘకాలం తర్వాత పార్టీ లైన్‌ను వ్యక్తీకరించగలిగిన రేవంత్‌కు యువతలో ఫాలోయింగ్‌ ఉన్నది. కేడర్‌లోనూ కొత్త జోష్ వచ్చింది. ఈ వాస్తవాన్ని గుర్తించి సీనియర్ నేతలు పార్టీ ఎదుగుదలకు సహకరించాలి. సీనియర్లలోని అసంతృప్తిని చల్లార్చడానికి, వారి సహకారాన్ని తీసుకోడానికి, పార్టీని ఎదిగించడానికి, పార్టీలో సమాన ప్రాతినిథ్యం, అవకాశాలు ఉంటాయన్న భరోసాను కలిగించడానికి రేవంత్ వైపు నుంచి చొరవ ఉండాలి. ప్రభుత్వం పట్ల, అధికార పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోడానికి ప్రయత్నించాలి. కానీ, తిట్టడమే విధానంగా ఉండకూడదు. తక్షణం పార్టీ ఒక నినాదాన్ని, విధానాన్ని, తగిన కార్యాచరణను రూపొందించుకోవాలి. ఇప్పుడు రేవంత్ సమర్థతకు అదే గీటురాయిగా ఉంటుంది.

ఎన్. విశ్వనాథ్

Advertisement

Next Story

Most Viewed