జనం స్వరం మారుతున్నది

by Viswanth |   ( Updated:2022-03-10 09:46:44.0  )
జనం స్వరం మారుతున్నది
X

ముఖ్యమంత్రి కేసీఆర్ దేన్నయినా సహిస్తారేమోగానీ ప్రశ్నించడాన్ని మాత్రం తట్టుకోలేరు. అది ప్రతిపక్షాల నేతలే అయినా పాత్రికేయులే అయినా. ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే రాజకీయం అంటూ కొట్టిపారేస్తారు. పాత్రికేయులు ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్నతో నూరు మూయిస్తారు. ఇంతకాలం సామాన్య ప్రజలు నోరు విప్పే సాహసం చేయలేదు. అరెస్టులు, కేసులు కామన్. ఏడేళ్లకాలంలో ప్రశ్నించడమే నేరమైపోయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఐదేళ్ల కాలంలో విపక్ష పార్టీలన్నీ టీఆర్ఎస్‌ను నిలదీయలేకపోయాయి. తెరవెనక లోపాయకారీగా వ్యవహరించాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున గొంతు విప్పాల్సిన ప్రతిపక్షాలు ఆ పాత్రను పోషించలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌కు దాసోహమైపోయిందని, కోవర్టుగా వ్యవహరిస్తున్నదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా కామెంట్ చేశారు. బీజేపీ సైతం అంతకు భిన్నంగా ఏమీ లేదనే అపవాదును మూటగట్టుకున్నది. తెలంగాణ జనసమితి లాంటి పార్టీలు పురుడు పోసుకున్నా, మీడియాను కంట్రోల్ చేయడం ద్వారా దాని గొంతు వినిపించకుండా చేయడంలో ఇంతకాలం అధికార పార్టీ విజయవంతమైంది. ఇక వామపక్షాలు ఉనికి కోసమే ఆరాటపడుతున్నాయి. అధికార పార్టీతో కొట్లాడడం కంటే రాజీ మార్గమే ఉత్తమమని భావిస్తున్నట్లు వాటి ఆచరణ రుజువు చేస్తున్నది. చివరకు ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోయారు.

పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయ్. ప్రజలు గొంతెత్తడం మొదలుపెట్టారు. అన్యాయాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. వైఫల్యాన్ని నిలదీస్తున్నారు. నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రగతిభవన్‌నే టార్గెట్ చేసుకున్నారు. ప్రజల పక్షం వహించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఏ పక్షమో అర్థం చేసుకున్నారు. ప్రత్యామ్నాయాన్ని వెదుక్కున్నారు. సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని దగ్గర చేసుకుంటున్నారు. కేసులకు, అరెస్టులకు భయపడడంలేదు. ప్రభుత్వాన్ని నిలదీసే చైతన్యాన్ని కూడగట్టుకున్నారు. చివరకు ప్రభుత్వమే తనను తాను కాపాడుకునేలా ఆత్మరక్షణలో పడిపోయింది. అందుకే ప్రగతిభవన్ చుట్టూ భారీస్థాయి గోడలు వెలిశాయి. కంచెలు ఏర్పాటయ్యాయి. వందల సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు వచ్చేసింది. కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్న అనుభవంతో, ఉద్యమ స్ఫూర్తితో అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్ధమవుతున్నారు. పిడికిలి బిగిస్తున్నారు. మంత్రుల కాన్వాయ్‌నే కాదు ముఖ్యమంత్రి కాన్వాయ్‌నూ అడ్డుకుంటున్నారు. గ్రామాలలో తిరగడానికి ప్రజా ప్రతినిధులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తున్నది. అధికారిక కార్యక్రమాలలో ప్రశ్నించే గొంతులను చూసి భయపడుతున్నారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేస్తే కోర్టుకు వెళ్ళి సాధించుకున్నారు. ఆర్టీసీ సమ్మె కాలంలో యూనియన్లను మూసేస్తే ఇప్పుడు జేఏసీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిణామమే అధికార పార్టీ నేతను ఆలోచనలో పడేసింది. ప్రగతిభవన్ గోడలు దాటి ప్రజల్లోకి వెళ్లేలా చేసింది.

విపక్షాల అనివార్యత

ప్రజల చైతన్యాన్ని, తెగింపును కళ్లారా చూసిన ప్రతిపక్షాలు అనివార్యంగా ఆ బాటను ఎంచుకోక తప్పలేదు. ఇంతకాలం అధికార పార్టీకి భజన చేసిన పరిస్థితి నుంచి అవి బైటపడుతున్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో బీజేపీ స్వరం పెరిగింది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ వచ్చిన తర్వాత ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజల ఆకాంక్షలు, ఆలోచనకు అనుగుణంగా వైఎస్సార్‌టీపీకి షర్మిల శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా వేదికగా తీన్మార్ మల్లన్నలాంటివారు పుట్టుకొచ్చారు. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకోవాలనుకుంటున్నారు. మరే రాష్ట్రం కంటే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు భేష్ అని అధికార పార్టీ గొప్పగా చెప్పుకున్నది. దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ గర్వంగానే వ్యవహరించింది. ఏ ఎన్నిక జరిగినా గెలుపు టీఆర్ఎస్‌దే అని ధీమాతో ఉన్నది. మారిన పరిస్థితులతో ఇప్పుడు ఆ పార్టీ దిగ్భ్రాంతికి గురైంది. ప్రజల విశ్వసనీయతను కోల్పోయామనే భావనకు వచ్చింది. ప్రశ్నించే గొంతులను గతంలో లాగ నిర్బంధం ద్వారా నొక్కిపెట్టలేమని గ్రహించింది. పోడు భూముల అంశంలో ఆదివాసీలు అటవీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సహనం కోల్పోయి తిరగబడుతున్నారు. రెవెన్యూ సిబ్బందిని రైతులు నిలదీస్తున్నారు. కొన్ని సందర్భాలలో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ప్రజల అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో టీఆర్ఎస్ పెద్దలు గ్రహిస్తున్నారు.

విఫల ప్రయోగాలు

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని ఏండ్ల తరబడి పదేపదే సీఎం కేసీఆర్ హామీలు ఇస్తున్నా ఆచరణ మాత్రం శూన్యం. స్వయంగా రెవెన్యూ శాఖను ఆయనే చూసుకుంటున్నారు. భూసమస్యల పరిష్కారానికి 'ధరణి' సర్వ రోగ నివారణి అని చెప్పుకొచ్చారు. అది విఫల ప్రయోగమేనని రైతుల ఆగ్రహంతో తేలిపోయింది. ఒక్కో సెక్షన్ ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపులకు బదులుగా నిరసనలే మార్గమని గ్రహించారు. సర్కారుపై ఒత్తిడి తేవడమే పరిష్కారమని భావించారు. వరుస సంఘటనలతో ప్రభుత్వం సహజంగానే అప్రమత్తం కాక తప్పలేదు. ప్రగతిభవన్‌కే పరిమితమైతే అడ్రస్ గల్లంతు అని అధికార పార్టీ గ్రహించగలిగింది. ఫలితంగా ముఖ్యమంత్రి మొదలు టీఆర్ఎస్ నేతలు ప్రజల బాట పట్టక తప్పలేదు. కొత్త స్కీమ్‌లు, కొత్త ఆశలు అనివార్యమయ్యాయి. ప్రజల వ్యతిరేకతను చల్లార్చడానికి అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో విపక్ష పార్టీలు సైతం ప్రజలను అనుసరించకపోతే పుట్టగతులుండవని తెలుసుకున్నాయి. తొలి టర్ములో అధికార పార్టీకి అంటకాగితే ఏం జరిగిందో విశ్లేషించుకున్నాయి. ఇప్పుడు ప్రజలలో టీఆర్ఎస్ పట్ల పెరుగుతున్న అసంతృప్తిని, వారి మిలిటెన్సీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటున్నాయి. వారికి మద్దతు పలుకుతున్నాయి. అధికారంలోకి రావాలనుకుంటున్నాయి.

ముగిసిన హనీమూన్

టీఆర్ఎస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక ప్రజలకు దగ్గర కావడం, వారి ఆందోళనకు గొంతు కలపడం, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు రోడ్ మ్యాప్ రూపొందించుకోవడం, నిత్యం ప్రజల మధ్య ఉండడం అనివార్యమని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాత్రమే పోటీ అనే ఈక్వేషన్ ఇప్పుడు మారిపోయింది. ప్రజలే ఇప్పుడు పార్టీలను గైడ్ చేస్తున్నారు. ఇంతకాలం నల్లేరుమీద నడకలా సాగిన టీఆర్ఎస్ ప్రయాణం ఇప్పుడు ముళ్లబాటలోకి మారింది. గెలుపు కోసం చెమటోడుస్తున్నది. ప్రజలలో గూడు కట్టుకున్న అసంతృప్తి తీవ్రత ఎంతో గ్రహించగలిగింది. ప్రజల నిలదీతలతో పతనం తప్పదని గ్రహించింది. అందుకే ఆ పార్టీకి కొత్త తాయిలాలు, పథకాలు తెరమీదకు వస్తున్నాయి. రానున్న కాలంలో ఇంకెన్ని వస్తాయో! అయితే, ఇవన్నీ ఎందుకొస్తున్నాయో కూడా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఏ లక్ష్యం కోసం జీవితాలను త్యాగం చేసి రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నారో అది ఏ దిశగా ప్రయాణిస్తున్నదో, ఇకపైన ఎలా ఉండాలో స్పష్టమైన ఆలోచనతో ఉన్న యువత భవిష్యత్తు మార్పునకు నాంది పలకనున్నారు.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story

Most Viewed