పోల్ డేట్ ప్రకటనకు ముందే మమతకు ఈసీ షాక్

by Shamantha N |
పోల్ డేట్ ప్రకటనకు ముందే మమతకు ఈసీ షాక్
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కేంద్ర బలగాలు మోహరించనున్నాయి. అదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే కావడం గమనార్హం. ఈ నెల 25లోగా బెంగాల్‌కు 125 కంపెనీ(ఒక కంపెనీలో 80 నుంచి 100 మంది సైనికులుంటారు)ల బలగాలు చేరనున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో మోహరింపులు చేపట్టనున్నాయి. 60 కంపెనీల సీఆర్‌పీఎఫ్, 30 కంపెనీల ఎస్ఎస్‌బీ, ఐదు కంపెనీల సీఐఎస్‌ఎఫ్, ఐదు కంపెనీల ఐటీబీపీ బలగాలు మోహరించనున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ నిచ్చినట్టయింది. కేంద్ర బలగాల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే బలగాల మోహరింపునకు సంబంధించిన వ్యూహం రాష్ట్ర పోలీసులకు అందినట్టు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కాలంలో శాంతి భద్రతలను కాపాడటానికే ఈ బలగాల మోహరింపని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్‌లో ప్రస్తుతం అమలవుతున్న శాంతి భద్రతల తీరుపై ఈసీ సంతృప్తిగా లేదని, లేదా రాష్ట్రానికి హెచ్చరిక గానూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలపై రాష్ట్రం తటస్థంగా వ్యవహరించబోదన్న అనుమానాలూ ఉండవచ్చని చెబుతున్నారు. అదిగాక, అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికల కంటే బెంగాల్‌పైనే ఈసీ ఎక్కువ దృష్టి సారించినట్టు తెలుస్తున్నదని వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ హీటెక్కుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed