Gangula Kamalakar: ఇకపై ఈటల రాజేందర్ ఒంటరి: గంగుల

by Sridhar Babu |   ( Updated:2021-05-24 08:14:33.0  )
Gangula Kamalakar: ఇకపై ఈటల రాజేందర్ ఒంటరి: గంగుల
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజారాబాద్‌లో ఈటల రాజేందర్ పూర్తిగా ఒంటరిగా మారాడని, కొద్ది రోజులుగా ఆయనకు మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులంతా వాస్తవాలు గ్రహించి సొంతింటికి వస్తున్నారని, ఇప్పటికే 99 శాతం మంది పార్టీ వెంట ఉన్నట్లు మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని శ్వేతా హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రధాన నేతలు సర్పంచు నుంచి మొదలు ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు తమకు పదవి కట్టబెట్టిన పార్టీకే మద్దతుగా నిలిచారన్నారు. కొంతకాలంగా తన వర్గీయులను బెదిరిస్తున్నారు, డబ్బులతో కొంటున్నారు, భయపెడుతున్నారని చేస్తున్న ఆరోపణలపై మంత్రి గంగుల ధీటుగా స్పందించారు.

ఈటల రాజేందర్ (Eatala Rajender) పదే పదే టీఆర్ఎస్ (TRS) ప్రజాప్రతినిధులు అమ్ముడు పోయారు అని వ్యాఖ్యానిస్తుంటే బాధ కలుగుతుందని, ఇవాల ఆ ఆవేదనతో వారంతా స్వయంగా పత్రికాముఖంగా కేసీఆర్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారని అన్నారు. టీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన ఎవరైనా కేసీఆర్ బొమ్మతోనే గెలిచారని, అలాంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా అమ్ముడు పోయే స్వభావంతో ఉండరని హితవు పలికారు. పార్టీకి మద్దతుగా నిలిచే నేతల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటే పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ భయాందోళనలకు గురవ్వకూడదన్నారు. టీఆర్ఎస్‌లో వర్గాలు లేవని, టీఆర్ఎస్ (TRS) పార్టీ మొత్తం ఒకటే వర్గమని, గంగులకు ప్రత్యేక వర్గాలు లేవని, పార్టీలో కేవలం కేసీఆర్ వర్గం మాత్రమే ఉంటారని చెప్పారు.

ఈటల రాజేందర్ కాంగ్రెస్, బీజేపీ నేతల్ని, టీఆర్ఎస్ అంటే గిట్టని వ్యక్తుల్ని కలుస్తుండడంతో హుజురాబాద్ పార్టీ కేడర్ విసిగిపోయిందని, వారిలో నెలకొన్న అయోమయం తొలగించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆరు దశాబ్దాలుగా ఆత్మగౌరవం కోసం తండ్లాడిన తెలంగాణ బానిస సంకెళ్లు తెంచడమే కాక, కాళేశ్వర జలాలు, 24గంటల కరెంటు, రైతుబంధు పెట్టుబడితో రైతుల కళ్ళలో ఆనందం వెళ్లి విరుస్తుందన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సంక్షేమంలో ఉందని, హుజురాబాద్ సుభిక్షమైందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీకి కట్టుబడి ఉండే నేతలు, ప్రజాప్రతినిధుల లిస్టును పత్రికలకు విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed