ఆ ఎమ్మెల్యేల ఆస్తులపై విచారణకు సిద్ధమా..?

by Sridhar Babu |
ఆ ఎమ్మెల్యేల ఆస్తులపై విచారణకు సిద్ధమా..?
X

దిశ, హుజూరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసేవన్నీ కేంద్ర ప్రభుత్వ డబ్బులేనని, సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిదని ఎమ్మెల్యే, హుజురాబాద్ టౌన్ ఇంచార్జ్ రఘునందన్ రావు విమర్శించారు. శుక్రవారం హుజురాబాద్‌లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెల్లో ప్రస్తుతం నిర్మాణం అవుతున్న వైకుంఠదామాలు, ప్రకృతి వనాలు, ఇతర అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈజీఎస్ నిధుల ద్వారానే జరుగుతున్నాయన్నారు. రేషన్ బియ్యం కూడా కేంద్రం ఇచ్చే సబ్సిడీ పైనే ఆధారపడి కొనసాగుతుందని తెలిపారు. కేంద్రం ఇచ్చే డబ్బులతోనే రాష్ట్ర ప్రభుత్వం పనులు జరుపుతోందని, తనవంతు వాటా మాత్రం ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. పైకి మాత్రం గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు కోట్లాది రూపాయల నిధులు ఇస్తున్నట్లు ప్రకటిస్తూ. సర్పంచులను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను మోసం చేస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మేలుకోవాలని అన్నారు.

సర్వేలన్నీ బీజేపీ విజయాన్ని సూచిస్తున్నాయి

హుజురాబాద్ ఉప ఎన్నికలపై బీజేపీ చేయించిన సర్వేలన్నింటిలో బీజేపీకి ప్రజలు 78శాతం మద్దతిస్తున్నట్లు తెలుపుతున్నాయని రఘునందన్ రావు అన్నారు. బీజేపీ పేపర్లను టీవీలను నమ్ముకోలేదని కార్యకర్తలను నమ్ముకుందని వెల్లడించారు. బీజేపీ సర్వేలు చూసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయాందోళన ప్రారంభమైందని అన్నారు. ‘‘ఈట్ కా జవాబ్.. పత్తర్ సే దేయింగే’’ అని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం పైసలతో వస్తారని ఓటుకు నోటు సంబంధం ఉన్నవాళ్ళు వస్తారని ఎవరొచ్చినా బీజేపీదే విజయమని అన్నారు. యువరక్తం ఉన్న బీజేపీ కార్యకర్తల ముందు టీఆర్ఎస్ నాయకులు అక్కరకు రాని ఆయన అన్నారు.

ఎమ్మెల్యేల ఆస్తులపై విచారణ…?

తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల ఆస్తులపై విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరాడని కొంతమంది ఆరోపిస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే ఆయన సంపాదించింది మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కదా అని గుర్తుచేశారు. ఆస్తులపై విచారణ కరీంనగర్‌లో అయిన రాజ్ భవన్ వద్ద అయిన గన్ పార్క్ వద్ద గానీ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అక్రమ ఆస్తులను అమరవీరుల కుటుంబాలకు పంచుతామని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు నందగిరి మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, పంజాల సతీష్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story