సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు.. వారి రాకతో రాజకీయనేతల గుట్టురట్టు..?

by Anukaran |   ( Updated:2021-09-20 00:31:40.0  )
సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు.. వారి రాకతో రాజకీయనేతల గుట్టురట్టు..?
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ దుమారం రేపుతున్న మాదకద్రవ్యాల కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని “నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో” చేపట్టనున్నదా..? టాలీవుడ్ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) విచారణ మరో రెండు రోజులలో ముగియనున్న తరుణంలో ఎన్సీబీ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల 31 నుంచి మొదలైన ఈడీ విచారణలో సినీ ప్రముఖులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టారు. దర్యాప్తులో భాగంగా మొత్తం 12 మందికి సమన్లు జారీ చేయగా అందులో ఇప్పటికే 11 మంది విచారణకు హాజరయ్యారు. చివరగా ఈనెల 22న సినీ నటుడు తరుణ్ ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. తరుణ్ తరువాత ఈడీ మరి కొంతమందికి సమన్లు జారీ చేస్తుందా..? లేక విచారణను ముగిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఈడీ విచారణ కొనసాగిస్తున్నది. సినీ ప్రముఖులతో పాటు డ్రగ్ స్మగ్లర్ కెల్విన్ ముఠా సభ్యులను ముఖాముఖి విచారించి కీలక ఆధారాలను సేకరించింది. గతంలో ఎక్సైజ్ శాఖ విచారణలో లేని సినీ నటులు రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాలను డ్రగ్స్ మనీలాండరింగ్ కేసులో సుదీర్ఘంగా ప్రశ్నించింది. కేసులో కింగ్ పిన్ కెల్విన్ బ్యాంకు ఖాతాల ఆధారంగా నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళాయి అనే విషయాన్నిఈడీ గుర్తించింది.

వాస్తవానికి 2017లో ఎక్సైజ్ శాఖ పలువురు సినీ ప్రముఖులను విచారించినప్పటికి ఎలాంటి ఫలితం రాలేదు. బాధితులు ఎవరు..? నిందితులు ఎవరు..? అని తేల్చకుండానే కేసు ముగిసింది. రాజకీయ ఒత్తిళ్ల క్రమంలో ఎక్సైజ్ శాఖ కేసును నీరుగార్చడంతో మాదక ద్రవ్యాల ముఠాలు మళ్లీ చెలరేగాయి. రాష్ట్రం ఇమేజ్ డామేజ్ చేయకండి అని ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతో అసలు డ్రగ్స్ ప్రమాదకరమైన కేసు అనే విషయాన్ని అధికారులు మరిచిపోయారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ ప్రమాదకర మాదకద్రవ్యాల సరఫరాకు అడ్డాగా మారింది. హెరాయిన్, నల్ల మందుతో పాటు గంజాయి లిక్కర్ కంటే సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఎక్సైజ్, పోలీస్ అధికారులు కోట్లాది రూపాయల విలువచేసే మాదకద్రవ్యాలను పట్టుకున్నప్పటికి వాటి మూలాలను ఛేదించడానికి ప్రయత్నాలు చేయలేదు. దీంతో డ్రగ్ స్మగ్లర్లు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది ప్రస్తుత పరిస్థితి. ఒకరకంగా హైదరాబాద్ శివార్లు , తెలంగాణలోని ప్రధాన రహదారులు ఇతర రాష్ట్రాల నుంచి, దేశాలనుంచి వచ్చే మాదకద్రవ్యాలకు సురక్షిత కారిడార్ గా మారాయి.

ఎక్కడ పెద్దల గుట్టు బయటపడుతుందో అన్న భయం వల్ల రాష్ట్ర అధికారులు చాలా సందర్భాలలో లోతైన విచారణ జరపలేదని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో డ్రగ్ స్మగ్లర్లకు సినీ ప్రముఖులు, ఇంకా కొందరు మాదకద్రవ్యాల కోసం నిధులను మళ్ళించారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ మొదలు పెట్టింది. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ కింద అనుమానితులను, నిందితులను ఇంటరాగేట్ చేసింది. ఈ విచారణలో నిందితులను, సినీ ప్రముఖులను ముఖా ముఖి విచారించి బ్యాంకు ఖాతాలలో లోగుట్టును తెలుసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి పూర్తి వివరాలు తీసుకున్న ఈడీ తనదైన పంథాలో సీరియస్ గానే విచారణ జరిపింది. ఇందులో ఆర్థిక వ్యవహారాలు కాకుండా వెల్లడైన ఇతర కీలక అంశాలను ఈడీ, నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరోకు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ముంబాయి, కర్ణాటక లోని బాలీవుడ్, శాండిల్ వుడ్ డ్రగ్ కేసులలో పలువురు సినీ తారలను అరెస్ట్ చేసిన ఎన్సీబీ రంగంలోకి దిగితే కేసు సీరియస్ టర్న్ ను తీసుకుంటుందని ఒక అధికారి అన్నారు. డ్రగ్స్ కేసు రాజకీయ రంగు పులుముకున్న క్రమంలో కేంద్రం ఈ విషయాన్ని గంభీరంగా తీసుకుంటే ఎన్సీబీ లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సినిమా తారలతో పాటు రాజకీయ ప్రముఖుల లింకులు కూడా బయటపెట్టాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయి..? మరోసారి లోతైన దర్యాప్తు చేస్తాయా.. ? అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed