ZP CEO సస్పెన్షన్.. ప్రజల్లో అనుమానాలు

by Shyam |
Suryapet ZP CEO suspension
X

దిశ, సూర్యాపేట: ‘‘ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లడం దారుణం. కార్పొరేట్ చెప్పుచేతల్లోనే పాఠశాలలు ప్రారంభించడం సిగ్గుచేటు.’’ అని సూర్యాపేట జిల్లా జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ స్కూళ్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. కార్పొరేట్ స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు, ఎప్పుడు క్లోజ్ చేస్తే అప్పుడు ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో కూడా విద్యార్థుల నుంచి కార్పొరేట్ స్కూళ్లకు ఫీజులు మొత్తం వసూలు కాగానే ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల కోసం పనిచేస్తోందని, ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వం ప్రోత్సహించడం దారుణమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఈ పరిస్థితులు దాపురించడం ఘోరం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తామేంటో చేసి చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో విద్యావిధానం మారాలని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ విధానం మూలంగా రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, ఫస్ట్ ఆ పాఠశాలలను కాపాడాలని తెలిపారు. అయితే, ఈ విషయం తెలిసిన పై అధికారులు సోమవారం జెడ్పీ సీఈఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత విద్యావిధానం ఎలా ఉందో చెప్పినందుకే ఆయన్ను సస్పెండ్ చేశారని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు. వెంటనే కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి సీఈఓగా సూర్యాపేట ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed