- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాప్తి ‘లాక్‌డౌన్’ అయిందా?
దిశ, సెంట్రల్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఐదో దశ లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టాం. వైరస్ వ్యాప్తి నిరోధకం కోసం కేంద్రం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే నాటికి దేశం మొత్తం మీద 500 కేసులే ఉన్నాయి. నాలుగో దశ ముగిసేటప్పటికి రెండు లక్షలకు చేరువైంది. ఆంక్షలు సడలిస్తున్న కొద్దీ కేసులు పెరుగుతూ ఉన్నాయి. మొదటి మూడు దశల్లో 52 రోజుల్లో 90 వేల కేసులు నమోదైతే నాలుగో దశలో మాత్రం కేవలం రెండు వారాల వ్యవధిలో రెట్టింపుకంటే ఎక్కువయ్యాయి. లాక్‌డౌన్ ఇప్పుడు కంటైన్‌మెంట్ జోన్లకే పరిమితమైంది. కరోనా వ్యాప్తికి లాక్‌డౌన్ ఏ మేరకు కళ్లెం వేసింది? ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు ఎంతవరకు ఫలితాలనిచ్చాయి? సమీప భవిష్యత్‌పై లాక్‌డౌన్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టమేమీ కాదు.
కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరి సోకకుండా జాగ్రత్తపడటానికి, దేశంలోని ఆరోగ్య సదుపాయాల సామర్థ్యానికి మించి కేసులు కుప్పలు తెప్పలుగా పెరగకుండా అదుపులో పెట్టడానికే ప్రధానంగా ప్రభుత్వం లాక్‌డౌన్ వ్యూహాన్నిఅనుసరించింది. కేసులు పరిమితంగా రిపోర్ట్ అయితే అందివచ్చిన ఆ అదనపు కాలంలో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేసుకునే అవకాశాన్ని వినియోగించే వ్యూహం అందులో ఉంది. ఈ ప్రణాళికతో మార్చి 25న అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగుసార్లు పొడిగించింది. తొలి దశ, రెండో దశల్లో కఠిన ఆంక్షలను అమలు చేసినా.. మూడో దశ లాక్‌డౌన్ నుంచి ఎక్కువ మొత్తంలో ఆంక్షల సడలింపులను చేస్తూ వచ్చింది. అయితే, ఈ సడలింపులతో సమాంతరంగా కేసులు పెరుగుతూ వచ్చాయి. ప్రతి లాక్‌డౌన్ దశలో అంతకుముందు కంటే అధిక కేసులు నమోదవుతూ వచ్చాయి.
ఏ దశలో ఎన్ని కేసులు?
మనదేశంలో తొలిసారిగా కరోనా కేసులు జనవరి 30న కేరళలో వెలుగుచూశాయి. మార్చి 24 నాటికి మనదేశంలో 512 కేసులు రిపోర్ట్ అయ్యాయి. తర్వాతి రోజు నుంచే తొలిదశ లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 21 రోజుల ఆ లాక్‌డౌన్ కాలంలో 10,877 కరోనా కేసులు నమోదయ్యాయి. 19 రోజులపాటు అమలైన రెండో దశ లాక్‌డౌన్(ఏప్రిల్ 15 – మే 3)లో 31,094 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మే 17వరకు అమలైన మూడో దశ లాక్‌డౌన్ కాలంలో 53,636 కేసులు నమోదయ్యాయి. కాగా, మే 18న మొదలై 31వ తేదీన ముగిసిన నాలుగో దశ లాక్‌డౌన్ కాలంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో సగం కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ పిరియడ్‌లో 85,974 (దేశంలోని మొత్తం కేసుల్లో 47.20 శాతం) కేసులు నమోదయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే కరోనా కేసుల పెరుగుదల ఓ మేరకు తక్కువ ఉన్నప్పటికీ లాక్‌డౌన్ ప్రభావవంతంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేదని ఈ గణాంకాలతో తెలుస్తున్నది. కరోనా కేసులూ పెరుగుతూ రావడమే కాదు, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థా తీవ్రంగా దెబ్బతింది.
పుంజుకోవడం సులువేనా?
కరోనా మహమ్మారి ప్రధానంగా పట్టణాల్లోనే పాగా వేసింది. ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబయి, దేశరాజకీయాల కేంద్ర బిందువు ఢిల్లీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ చెన్నై, పెట్టుబడుల హబ్ అహ్మదాబాద్, ఇతర ప్రధాన నగరాలలో ఈ వైరస్ విజృంభించింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, ఇతర రంగాలు స్తంభించడంతో వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లక తప్పలేదు. ఇప్పుడు లాక్‌డౌన్ 5.0లో భాగంగా దాదాపుగా అన్ని రంగాలకు అనుమతులిచ్చినా వర్కర్లు లేక అనుకున్నంత సజావుగా పుంజుకుంటాయని అనుకోవడం భ్రమేనని ఆర్థికనిపుణులు విశ్లేషిస్తున్నారు. అదీగాక, రెండు నెలలుగా రాబడి లేక కొట్టుమిట్టాడుతున్న రంగాలు మళ్లీ వ్యాపారాలను, ఉత్పత్తిని గాడిలో పెట్టడమూ ఆర్థికంగా మోయలేని భారంగా ఉంటుందని వివరిస్తున్నారు. ఉపాధి లేక వినియోగదారుల తలసరి ఆదాయాలు క్షీణించడమూ మనముందున్న పెద్ద సవాల్ అని చెబుతున్నారు. అందుకే లాక్‌డౌన్ ప్రభావం నుంచి కోలుకోవడానికి సుదీర్ఘకాలం తప్పదని పేర్కొంటున్నారు. ఇంకా పీక్ స్టేజ్‌కు భారత్ చేరలేదని విశ్లేషణల నేపథ్యంలో కంటైన్‌మెంట్ ఏరియా వెలుపల దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతివ్వడంతో ఇంకా ఎంతవేగంగా కేసులు పెరుగుతాయోనన్న భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకేసారి బ్లాంకెట్‌గా లాక్‌డౌన్ విధించే బదులు ఇప్పుడు అనుసరిస్తున్న కంటైన్‌మెంట్ వ్యూహాన్నిముందు నుంచీ అనుసరించాల్సిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఇంతలా పతనం కాకుండా ఉండేదని, ప్రభుత్వాలు, ప్రజలకు ఇంతటి ఆర్థిక సంకటం ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు.
చర్చనీయాంశమైన కేంద్రం నిర్ణయాలు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. దేశంలో సుమారు 500 కేసులున్నప్పుడు లాక్‌డౌన్ విధించిన కేంద్రం 5,000 కేసులున్నప్పుడు కరోనా యోధుల కోసం చప్పట్లు, వంట సామగ్రితో చప్పుళ్లు చేయమని కోరింది. దీంతో కొన్ని చోట్ల చప్పుళ్లు చేస్తూ గుంపులుగా ర్యాలీలూ జరిగాయి. కేసులు 10,000కు చేరినప్పుడు లైట్‌లు ఆఫ్ చేయాలని కోరింది. కరోనా కేసులు 40,000లకు చేరాక ఆస్పత్రులపై పూల వర్షం కురిపించే పనిని చేపట్టింది. కాగా, 50,000ల కేసులు ఉన్నప్పుడు లిక్కర్ షాపులు, వైన్స్‌లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. 60,000ల కేసులున్నప్పుడు రైళ్లను ప్రారంభించింది. ఇక 1.82 లక్షల కేసులు నమోదైన తరుణంలో దాదాపు అన్ని ఆంక్షలను సడలించే నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మిగిలింది కరోనాతో సహజీవనమేనా? కట్టడి గురించిన కథ సమాప్తమైనట్లేనా? కేసులు రాకుండా చూసుకోవడం ప్రజల బాధ్యత అయితే, కేసులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం వరకే ప్రభుత్వాలు పరిమితమవుతాయా? అనే చర్చలు జరుగుతున్నాయి.