సేవా మార్గంలో డాక్టర్ పవన్

by Sridhar Babu |
సేవా మార్గంలో డాక్టర్ పవన్
X

దిశ, కరీంనగర్: ఆదాయం వచ్చే మార్గాలు ఉంటేనే సేవ చేయడం కాదు ప్రజలకు ఉచితంగా సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఓ డాక్టర్. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో పేషెంట్లు లేరు. ఇటువంటి సమయంలో డాక్టర్లు ఖాళీగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు. కాని ఆ వైద్యుడు అలా చేయడం లేదు. నిరుపేదలు, వలస కూలీలను ఆదుకుంటున్నాడు. ఆయనే నగరానికి చెందిన డాక్టర్ పుల్లెల్ల పవన్ కుమార్.

నిరుపేదలు, వలస కూలీల కోసం ప్రత్యేకంగా భోజనాలు తయారు చేయించి వారికి అందజేస్తున్నారు. రోజుకు 150 నుంచి 200 భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసి ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వీరికి రేషన్ బియ్యం అందజేయాలని నిర్ణయించింది. అయితే, అవి ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. కాని ఈయన రోజూ వారికి సాయం చేస్తున్నాడు. భోజనాల సరఫరా బాధ్యతను తన సోదరునికి అప్పగించారు. ఆయన నగరంలో పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నారు. జ్వరం ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రోజుకు 150 మంది వరకూ స్ర్కీనింగ్ చేస్తూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

కరోనా వైరస్ (కోవిడ్-19) వేగంగా ప్రబలుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తాను రోగులను కేవలం స్క్రీనింగ్ చేసి ప్రభుత్వ ఆస్పత్రికి వెల్లాలని మాత్రమే సూచిస్తున్నానని చెబుతున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ నగరంలోని వలస కూలీలకు, నిరు పేదలకు పరీక్షలు చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. భోజనాల సరఫరా ప్రక్రియ కూడా యథావిధిగా కొనసాగిస్తానని తన సోదరుడు, మరో ఇద్దరు యువకులు ఫుడ్ సప్లై చేసేందుకు నగరంలో తిరుగుతుంటారని తెలిపారు. ప్రైవేటు ప్రాక్టీసు చేసి డబ్బు సంపాదించాలన్న తపనకే పరిమితం అయ్యే వారికన్నా డిఫరెంట్‌గా ముందుకు సాగుతున్న డాక్టర్ పవన్‌ను జిల్లావాసులు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్కువ శాతం వైద్యులు కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఇచ్చే పరిస్థితులుండటంతో ఇతారత్రా ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని డాక్టర్ పవన్ స్క్రీనింగ్ చేసి అవసరాన్ని బట్టి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించడం పట్ల పేషెంట్లు, వారి కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags : doctor pavan kumar, covid 19, food, screening, free, service

Advertisement

Next Story

Most Viewed