విత్తనాలు అమ్మొద్దు: కలెక్టర్

by Aamani |
విత్తనాలు అమ్మొద్దు: కలెక్టర్
X

దిశ, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చే వరకు వరి విత్తనాలను అమ్మ కూడదని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ విత్తన డీలర్లను ఆదేశించారు. మంగళవారం అధికారులు, విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల దిగుబడి పెరగడం వల్ల ప్రభుత్వం నియంత్రిత పంటల విధానం అమలు చేయనుందన్నారు. భూమి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల వారీగా పంట లక్ష్యాలు ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు వరి సన్న, సాధారణ రకం పండించే భూములను, రైతులను గుర్తించి విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు మూడు రోజుల్లో వస్తాయని.. అప్పటివరకు వరి విత్తనాలను డీలర్లు అమ్మొద్దని కలెక్టర్ ఆదేశించారు. మొక్కజొన్న వంట సాగు చేసిన వారికి రైతుబంధు వర్తించదని, కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించదని ఆయన తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు పత్తి, తొగరి సాగు చేసుకోవాలన్నారు. మొక్కజొన్న విత్తనాలు అమ్మకూడదని డీలర్లకు సర్కులర్ జారీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయన వ్యవసాయాధికారులతో సాగుకు వినియోగించే యంత్ర పరికరాలు, స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు వారి విత్తనాలను అమ్మ కూడదని డీలర్లను సూచించారు. మండలం, క్లస్టర్, గ్రామాల వారీగా, టార్గెట్ పంటల వారీగా కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. చెప్పిన పంట వేసిన వారికి రైతుబంధు వర్తిస్తదని ఆయన అన్నారు. సమావేశంలో సహాయ సంచాలకులు కోటేశ్వరరావు, మహమ్మద్ ఇబ్రహీం హనీఫ్, వినయ్ బాబు, వ్యవసాయ అధికారులు, విత్తనాల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story