కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

by Shyam |
కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ పై కోపం ప్రస్తుతం తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. ఓనర్లు, క్లినర్ల పంచాయతీలో కరోనా వైరస్‌ను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ చేస్తున్న శవ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు బలిపశువులు అవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో ఆరోగ్య మంత్రికి వాస్తవాలు తెలిసినా, ముఖ్యమంత్రిని ప్రశ్నించ లేక, పదవిని కాపాడుకునే పనిలో భాగంగా బీజేపీ పై విమర్శలు చేస్తూ కేసీఆర్ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో జిల్లా వైద్యాధికారులు చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెలువరిస్తున్న కరోనా కేసుల సంఖ్యలో భారీ తేడాలు ఎందుకు వుంటున్నాయో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఆరోగ్యశాఖలో జరుగుతున్న విషయాలు కూడా తెలియని ఈటల రాజేందర్ నెంబర్ వన్ డమ్మీ మంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. కరోనా టెస్టులు చేసే ల్యాబ్స్‌లో సౌకర్యాలు లేక టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

కేంద్ర బృందాలు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో వారి మెప్పుకోసం చేసే హడావిడి, ఆత్రుత, ప్రజల ప్రాణాలు కాపాడటంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎందుకు లేదని ప్రశ్నించారు. టిమ్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వ నిధులు మింగే వరకు వాటి మీద వున్న శ్రద్ధ ఇప్పుడెందుకు లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కరోనా నిధులు రూ.7,151కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన విరాళాల నిధులు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చుపెట్టారో చెప్పే నిజాయితీ సీఎం కేసీఆర్‌కు ఉన్నదా అని సవాల్ విసిరారు.కరోనా నివారణకు రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తానని చెప్పిన సీఎం ఇప్పటి వరకు పైసా కేటాయించలేదని గుర్తు చేశారు. హరితహారం పేరుతో ఊర్లు తిరుగుతున్న ముఖ్యమంత్రికి హైదరాబాద్‌లోని ఆస్పత్రులను సందర్శించే బాధ్యత లేదా అని దుయ్యబట్టారు.లక్షల్లో ఖర్చయ్యే కరోనా చికిత్సను పేద మధ్యతరగతి ప్రజలు ఎలా భ‌రిస్తారో మీరే చెప్పాలన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed