జూన్ నెలాఖరు నుండి గొర్రెలు పంపిణీ

by Shyam |   ( Updated:2021-04-19 04:45:41.0  )
జూన్ నెలాఖరు నుండి గొర్రెలు పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణం పనులు మరింత వేగవంతం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 6 పశువులు ఉండేందుకు వీలుగా 57 వేల రూపాయల వ్యయంతో ఒక్కో పశువుల షెడ్డును నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు. షెడ్ల నిర్మాణం చేయించుకొనే విధంగా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

6,453 మంది రైతులు షెడ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా.. 3,631 షెడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 2,822 షెడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసేలా పశుసంవర్ధక శాఖ అధికారులు పంచాయితీరాజ్, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. జూన్ నెలాఖరు నుండి 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జీవాల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుందని, అవసరమైన మందులు, వ్యాక్సిన్‌లను ఉచితంగా సరఫరా చేస్తుందని తెలిపారు. జీవాలు వ్యాధుల భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాలలో నెలకు 2, 3 రోజులు రైతు సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. జీవాలు వ్యాధుల భారిన పడకుండా ముందు జాగ్రత్తలు చేపట్టడం వలన జీవాలు మరణించకుండా కాపాడవచ్చని, రైతులు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడినట్లు అవుతుందని పేర్కొన్నారు.

అదేవిధంగా.. రాష్ట్రంలోని జీవాలకు సరిపడా పశుగ్రాసం ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలు అన్నింటిని వినియోగించుకోవాలని చెప్పారు. దాణాకు కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం 3 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు ఉండటం, గ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున వర్షాకాలం ప్రారంభమైన వెంటనే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. మొదటి విడతలో 366976 లబ్దిదారులకు 77.06 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు.

అన్ని జిల్లాలలో గొర్రెల మార్కెట్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే పెద్దపల్లిలో నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని, కామారెడ్డి, ఖమ్మం, వనపర్తిలలో కూడా త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. మిగిలిన అన్ని జిల్లాలలో గొర్రెల మార్కెట్‌ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను సేకరించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని తక్కువ ధరకు అందజేయాలనే ఉద్దేశంతో తెలంగాణా బ్రాండ్‌తో మాంసం విక్రయాలు వీలైనంత త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. యుద్దప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో సబ్సిడీపై పెరటి కోళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రతిపాదనలను రూపొందించి అందజేయాలని ఆదేశించారు. గొర్రెల పెంపకంలో ఆధునిక పరిజ్ఞానంపై రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 55 ఎకరాలలో నూతనంగా నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మే మొదటి వారంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story