డిజిటల్ మీడియాలో యూనిక్ ‘దిశ’

by Anukaran |   ( Updated:2023-10-10 15:36:44.0  )
డిజిటల్ మీడియాలో యూనిక్ ‘దిశ’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పాత్రికేయరంగంలో సంచలనం సృష్టించిన ’దిశ‘ రానున్న కాలంలో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతోంది. గతేడాది మార్చి 7వ తేదీన డిజిటల్ ప్రయోగంతో ఉనికిలోకి వచ్చిన ’దిశ‘ ఇకపైన ‘డైనమిక్’ వర్షన్‌తో పాఠకులకు చేరనుంది. సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలను ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ, కరోనా సమయంలో అనేక మీడియా సంస్థలు కాస్ట్ కటింగ్ చేసినా, ఉద్యోగాల్లోంచి తీసేసినా ‘దిశ’ మాత్రం అందుకు భిన్నంగా నిలిచిందని, క్రమం తప్పకుండా పూర్తి జీతాలను చెల్లించిందని పేర్కొన్నారు. సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సంస్థ తరఫునే త్వరలో ఉచితంగా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా కల్పించనుందని ప్రకటించారు.

నిజమైన ప్రసారమాధ్యమంగా వాస్తవాలను ప్రజలకు చేరవేయాలన్న ఏకైక ఉద్దేశంతో ‘దిశ’ ఉనికిలోకి వచ్చిందని, ఏ రాజకీయ పార్టీకి అంటకాగకుండా ‘నిజం వైపు ప్రయాణం’ నినాదంతో నిర్భయంగా పనిచేస్తోందని, ఈ ప్రయాణం ఇకపైన కూడా నిష్పక్షపాతంగానే ఉంటుందన్నారు. ఏడాది కాలంలో సిబ్బంది చూపిన నిబద్ధతను, అంకితభావాన్ని, సంస్థ వృద్ధికి అందించిన సహకారాన్ని అభినందించారు.

ఏడాది క్రితం పరిమిత వనరులతో మొదలైన ‘దిశ’ ప్రయాణం ఇప్పుడు ప్రముఖ పత్రికలకు దీటుగా నిలిచిందని, వార్తలు, కథనాల్లో ఎక్కడా తగ్గకుండా పోటీ పడిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలకు చిరునామాగా మారనుందని ఎడిటర్ డి.మార్కండేయ వ్యాఖ్యానించారు. డిజిటల్ ప్రపంచంలో క్షణక్షణం లోకల్ మొదలు గ్లోబల్ వార్తల వరకు ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకుంటున్నారని, దీనికి అనుగుణంగా కచ్చితమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వార్తలను ఇవ్వడానికి త్వరలోనే వినూత్న రీతిలో ప్రజలకు చేరువ కానుందని అన్నారు. మూసపోత పద్ధతుల స్థానంలో డైనమిక్ ఆలోచనలతో ‘దిశ’ ఒక చిరునామాగా మారనుందన్నారు. యువత అభిరుచులకు అనుగుణంగా నయా ట్రెండ్ సృష్టించబోతుందన్నారు. సిబ్బందిలో పాత్రికేయ రంగంలో పెద్దగా పూర్వానుభవం లేని ట్వంటీ ప్లస్, థర్టీ ప్లస్ యువత ‘దిశ’ ప్రత్యేకత అని నొక్కిచెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య, అర్థసత్య వార్తలపై ప్రజలకు విశ్వసనీయత తక్కువేనని, కానీ అదే సోషల్ మీడియా వేదికగా ‘దిశ’ అందిస్తున్న వార్తలకు ఆదరణ ఉందని, అదే ఈ ఏడాది కాలంలో సాధించిన విజయం అని వ్యాఖ్యానించారు.

‘దిశ కెరీర్’ లాంచింగ్

‘దిశ’ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్య, ఉద్యోగ అంశాలను అందించేందుకు ‘దిశ కెరీర్’ వెబ్‌సైట్‌ను సంస్థలోనే అతి పిన్నవయస్కురాలైన ఉద్యోగిని సమత ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల మొదలు విద్యార్హతకు తగిన ఉపాధి అవకాశాలు పొందడానికి అవసరమైన సమాచారం వరకు అన్నింటినీ అందించడం ‘దిశ కెరీర్’ ప్రధాన లక్ష్యం. ‘దిశ’ ఉనికిలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

‘దిశ’ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఈఓ కమల్‌నాధ్, న్యూస్ ఎడిటర్ ఫజుల్ రహమాన్, సెంట్రల్ డెస్క్ ఇన్‌ఛార్జి నర్సింహాచారి, బ్యూరో చీఫ్ విశ్వనాధ్, నెట్‌వర్క్ ఇన్‌ఛార్జి ప్రవీణ్, వెబ్‌సైట్ ఇన్‌ఛార్జి వనజ, ఫీచర్స్ డెస్క్ ఇన్‌ఛార్జి సుజిత, నేషనల్ డెస్క్ ఇన్‌ఛార్జి స్వామి, వెబ్‌టీవీ ఇన్‌ఛార్జి రాజ్‌కుమార్, చీఫ్ ఆర్టిస్ట్ బాలు, యాడ్స్ మేనేజర్ అశోక్, టెక్నికల్ ఇన్‌ఛార్జి అనుకరణ్, సిబ్బంది అంతా పాల్గొన్నారు.

Advertisement

Next Story